పరువు కోసం కుస్తీ! | Sakshi Editorial On WFI Issue | Sakshi
Sakshi News home page

పరువు కోసం కుస్తీ!

Published Tue, Dec 26 2023 12:03 AM | Last Updated on Tue, Dec 26 2023 12:03 AM

Sakshi Editorial On WFI Issue

ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్‌ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్‌ వేటువేయక తప్పలేదు.

వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌  సింగ్‌ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్‌ సింగ్‌ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్‌ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్‌తో మన రెజ్లింగ్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. 

ఒలింపిక్‌ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్‌ పూనియా,ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతక విజేత వినేశ్‌ ఫోగట్‌లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు.

అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్‌భూషణ్‌కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్‌సింగ్‌ గత గురువారం డిసెంబర్‌ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం.

అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్‌–15, అండర్‌–20 వారికి జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్‌ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం.

ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్‌ సాక్షీ మాలిక్‌ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్‌ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్‌ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్‌ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్‌ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. 

రెజ్లింగ్‌ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్‌ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్‌ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్‌ ఫోగట్‌ అన్నట్టు...

రెజ్లింగ్‌ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్‌ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి.

ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్‌ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని  నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement