నారీలోకానికి నీరాజనం! | Sakshi Editorial On Womens Reservation Bill approved by Rajya Sabha | Sakshi
Sakshi News home page

నారీలోకానికి నీరాజనం!

Published Fri, Sep 22 2023 3:48 AM | Last Updated on Fri, Sep 22 2023 4:01 AM

Sakshi Editorial On Womens Reservation Bill approved by Rajya Sabha

చిరకాలంగా మహిళాలోకం ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందటంతో పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్టయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావటం, దీన్ని దాదాపు అన్ని పక్షాలూ ఏకగ్రీవంగా ఆమోదించటం ఒక అరుదైన సన్నివేశం. మహిళా కోటాకు లోక్‌సభలో బుధవారం 454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు.

ఇందుకు ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అభినందించితీరాలి. దశాబ్దాలుగా నేతల ఎన్నికల ప్రచార సభల్లో... చానెళ్ల చర్చల్లో మాత్రమే వినబడుతూ చట్టసభల్లో మాత్రం కనబడని బిల్లుకు ప్రాణప్రతిష్ట చేసి, పట్టాలెక్కించి అన్ని పార్టీలనూ అంగీకరింపజేయటం చిన్న విషయమేమీ కాదు. అయితే జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాకే కోటా అమలవుతుందనటం నిరాశ కలిగించే అంశం.

ఏతావాతా 2029 తర్వాత మాత్రమే ఇది ఆచ రణలోకొస్తుంది. అంటే... మరో ఆరేళ్ల వరకూ దీనికి మోక్షం కలగదు! విస్తట్లో అన్ని పదార్థాలూ వడ్డించి, తినడానికి ఇంకా ముహూర్తం ఆసన్నం కాలేదని చెప్పినట్టయింది. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచాక మాత్రమే మహిళా కోటా సాకారం కాగా, దాని అమలుకు మరింత సమయం పడుతుందనటం ఏమాత్రం భావ్యంకాదు. ఈ బిల్లు ఆమోదంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం మరొకటుంది.

ఇరవైయ్యేడేళ్ల క్రితం తొలిసారి లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఓబీసీ వర్గాల వాటా నిర్ధారించాలని బలహీనవర్గాలు పట్టుబట్టాయి. చట్టసభలో మాత్రమే కాదు... వెలుపల సైతం అనేక ప్రజాసంఘాలు ‘కోటాలో కోటా’ గురించి డిమాండు చేస్తూనే ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచాక కూడా ఆ విషయం తేల్చకుండానే బిల్లు ఆమోదం పొందటం మనం ఆచరిస్తున్న విలువలను పట్టి చూపుతుంది. బిల్లుపై అన్ని పార్టీలనూ ఒప్పించిన అధికార పక్షానికి ‘కోటాలో కోటా’ గురించి నిర్దిష్టంగా తేల్చటం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకనో ఆ పని చేయలేదు.

మహిళా కోటా బిల్లుకు తామే ఆద్యులమని, యూపీఏ ప్రభుత్వ కాలంలో 2010లో దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందామని కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ చెబుతున్నారు. కానీ ఆ బిల్లుకూ, ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుకూ సంబంధం లేదు. అసలు మహిళా కోటా బిల్లుకు అంతకన్నా పూర్వ చరిత్ర చాలా ఉంది. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ మరుసటి ఏడాది వచ్చిన ఐకె గుజ్రాల్‌ సర్కారు సైతం బిల్లు దుమ్ము దులిపింది.

అప్పుడే ఓబీసీ కోటా సంగతేమిటన్న చర్చ మొదలైంది. వాజపేయి హయాంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వరసగా 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో మహిళా కోటా బిల్లును గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ ఓబీసీ కోటా విషయంలో దుమారం రేగి ఆగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ లోక్‌సభలో ఎస్‌పీ, బీఎస్‌పీ తదితర పక్షాలు ‘కోటాలో కోటా’ కోరుతూ అడ్డుకున్నాయి.

ఇప్పుడు ఓబీసీ కోటా తేల్చాలని చెబుతున్న కాంగ్రెస్‌ నేతలు తమ హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో సంజాయిషీ ఇవ్వాలి. మరోపక్క కోటా చట్టంగా రూపుదిద్దుకున్న నాటినుంచి కేవలం పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కన 2029 వరకూ అమలే సాధ్యం కాని చట్టం మరో తొమ్మిదేళ్లపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పొడిగింపు సంగతి ఏమవుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ పరిమితి ఏవిధంగా చూసినా సబబుగా లేదు. 

అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వటంలో జాప్యం జరగటం  సమర్థించుకోలేనిది. లింగ వివక్ష, అసమానతలు, వేధింపులు అన్ని స్థాయిల్లోనూ ఉన్న సమాజంలో మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయటం, వారి ప్రాతినిధ్యం పెంచటం ఎంతో అవసరం. అందువల్ల సమాజ నిర్మాణంలో తామూ భాగస్వాములమని, తమ ఆలోచనలకూ విలు వుంటున్నదని స్త్రీలు గుర్తిస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వీలవుతుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారు తుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికీ, ఆచరించటానికీ ఇంత సుదీర్ఘ సమయం పట్టడం విచార కరం. మనకన్నా ఎంతో చిన్న దేశాలూ, బాగా వెనక బడిన దేశాలూ సైతం మహిళలకు చట్టసభల్లో పెద్ద పీట వేసిన వైనం గమనిస్తే మహిళల విషయంలో మనం ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తు న్నామో అర్థమవుతుంది.

రువాండా పార్లమెంటులో మహిళలు 61 శాతం ఉంటే... క్యూబా(53), నిగ రాగువా(52), మెక్సికో, న్యూజిలాండ్‌ చట్ట సభల్లో 50 శాతం మహిళలుండి మన సమాజం తీరు తెన్నుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి దశాబ్దం క్రితం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన నేపాల్‌లో సైతం పార్లమెంటులో 33 శాతం మహిళలున్నారు.

అమలుకు ఇంకా సమయం పడుతుందంటు న్నారు గనుక  ఈలోగా పార్లమెంటు చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఓబీసీ కోటా సంగతి తేల్చటం, చట్టం అమలుకు విధించిన పరిమితిని ఎత్తివేయటం అత్యంత కీలకమని కేంద్రం గుర్తించాలి. ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి సాకారం కాబోతున్న ఈ చట్టం భవిష్యత్తులో సమాజం మరింత పురోగతి సాధించటానికి నాంది కాగలదని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement