వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం.
హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట.
ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన.
నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు.
ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’.
ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే!
శీతోష్ణస్నానం
Published Mon, Dec 18 2023 1:53 AM | Last Updated on Mon, Dec 18 2023 3:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment