కోర్టు నోరు విప్పిందంటే న్యాయం నిలబడుతుందని సామాన్యులకు ఆశ. దేశంలో చట్టాలను తుంగలో తొక్కుతున్న బుల్‌డోజర్ సంస్కృతిపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కాసింతైనా సంతోషం కలిగిస్తున్నది అందుకే. అనేక రాష్ట్రాలలో క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్న నిందితులు, వారి కుటుంబ సభ్యుల ప్రైవేట్ గృహాలు, ఆస్తు లపై బుల్‌డోజర్లను నడిపిస్తూ... ‘దాన్ని ఘనకార్యంగా పేర్కొంటూ, సమర్థించుకుంటున్న’ వైఖరి పాలకుల సాక్షిగా పెచ్చుమీరుతోంది.
ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 దాకా దేశవ్యాప్తంగా ఈ అడ్డగోలు కూల్చివేతలన్నిటికీ సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేయడం విశేషం. అదే సమ యంలో నీటి వసతులు, రైల్వే లైన్లకు అడ్డుగానూ, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాల్లోనూ సాగిన దురా క్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ కూల్చేందుకు అభ్యంతరం లేదని సుప్రీమ్ పేర్కొంది. అలాగే, కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అమలయ్యేలా నిర్ణీత మార్గదర్శకాల్ని రూపొందించాలన్న కోర్ట్ ప్రతిపాదన హర్షణీయం. ఇన్నాళ్ళ తరువాత ఇప్పటికైనా ఇది సరైన దిశలో సరైన అడుగు.
యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్‌లో 2017లో ఈ బుల్‌డోజర్ న్యాయానికి బీజం పడింది. ఆ తరువాత ఇది అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటికి 4.5 లక్షల దాకా గృహాలు ఇలా నేలమట్టమయ్యాయని అంచనా. ఇకపై చట్టవిరుద్ధంగా ఒక్క కూల్చివేత జరిగినా అది పూర్తిగా రాజ్యాంగ విధానానికే విరుద్ధమని కోర్ట్ పేర్కొనడం గమనార్హం. నిజానికి, గతంలోనూ కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, వాటి ఆదేశాలను ధిక్కరిస్తూ అనేకచోట్ల కూల్చివేతలు యథేచ్ఛగా సాగాయి.
అసలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుల మీదకు బుల్‌డోజర్‌ను నడిపిస్తున్న తీరుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, నోటీసులైనా ఇవ్వకుండా, నిర్ణీత ప్రక్రియ ఏదీ పాటించకుండా వారికి శిక్షగా బుల్‌డోజర్‌ను ఉపయోగించడమేమిటనే ధర్మబద్ధమైన ప్రశ్నలు వినిపిస్తూ వచ్చాయి. పైపెచ్చు, ముస్లిమ్‌ల ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు సాగించడమనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా విధానంగా తయారవడం ఆందోళన రేపింది.
ఈ పరిస్థితుల్లో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ డివిజన్ బెంచ్ ఈ పద్ధతిని తప్పుబట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రానో, లేదంటే దోషి అయినంత మాత్రానో వారి ఇంటిని కూల్చేయవచ్చా? అందుకు చట్టం అనుమతిస్తుందా? లేదు కదా! ఆ మాటే సుప్రీమ్ అంటోంది. పైగా ఇంట్లో ఎవరో ఒకరు నేరం చేస్తే, కూల్చివేతలతో ఆ కుటుంబం మొత్తానికీ శిక్ష విధించడం ఏ రకంగా సబబు?
ప్రభుత్వ పాలన నిర్వహించే కార్యనిర్వాహక వ్యవస్థే జడ్జిగా మారి, శిక్షించవచ్చా? ఆక్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ తొలగించేందుకు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ, వాటిని ప్రతిపక్షాల పీక నొక్కేందుకూ, నిర్ణీత వర్గాలపై ప్రతీకారేచ్ఛకూ సాధనంగా మార్చుకోవడంతోనే అసలు సమస్య. గొంతు విప్పిన భార తీయ ముస్లిమ్‌లపై ఉద్దేశపూర్వకంగా సాగుతున్న దాడిలో భాగమే ఈ కూల్చివేతలని చివరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం పేర్కొనే పరిస్థితి వచ్చిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఈ బుల్‌డోజర్ న్యాయం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో సాగుతున్నా, అన్ని చోట్లా ఒక అంశం మాత్రం సర్వసాధారణం. అది ఏమిటంటే – గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా, నిర్ణీత ప్రక్రియ అంటూ లేకుండానే ఈ కూల్చివేతలు కొనసాగడం! దురాక్రమణ లకు వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ లాంటి చోట్ల ఇటీవలి కూల్చివేతల్లోనూ చట్ట ఉల్లంఘన నిర్భీతిగా సాగింది. గుజరాత్, అస్సామ్, త్రిపురల్లో సైతం కూల్చివేతల పర్వానికి కట్టడి లేకుండా పోయింది.
అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందనే భావన కల్పిస్తూ, రాజకీయ లబ్ధి పొందడం అధికార పార్టీల వ్యూహం. దానిలోని మతపరమైన కోణాన్ని కప్పిపుచ్చడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. ఈ బుల్‌డోజర్‌సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం జోక్యానికి ఇంతకాలం పట్టడం విచారకరమే. అయితే, ఇప్పుడిక పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘విశాఖ’ మార్గదర్శకాలు చేసినట్టుగానే దీనిపైనా అఖిల భారత స్థాయిలో కోర్టు మార్గదర్శకాలు ఇవ్వనుండడం ఒకింత ఊరట.
అనధికారిక నిర్మాణాల గుర్తింపు, నోటీసులివ్వడం, వాదనలు వినడం, అనంతరం చట్టబద్ధంగా కూల్చివేతలు జరపడం... ఈ ప్రక్రియ అంతటికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన నియమావళి ఉండడం కచ్చితంగా మంచిదే. ఇటీవలి కూల్చివేతల డేటాను నిశితంగా సమీక్షిస్తే అనేక లోపాలు కనిపిస్తాయి. అందుకే, ఈ అంశంపై సంబంధిత వర్గాల నుంచి సూచనలు కోరుతున్న కోర్ట్ రేపు మార్గదర్శకాల రూపకల్పనలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం కీలకం. మత ఘర్షణలు, ఆ వెంటనే సాగే కూల్చి వేతల మధ్య సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు పాలకులు ఎత్తులు వేయడం తరచూ చూస్తున్నాం. ఆ పన్నాగాలు పారనివ్వకుండా మార్గదర్శకాల తయారీ అవసరం.
అలాగే, ఎప్పుడో నోటీసులు ఇచ్చా మని మభ్యపెట్టేందుకు వెనకటి తేదీలతో కాగితాలు చూపించి, పాలనా యంత్రాంగం ఇష్టారీతిన సాగించే కూల్చివేతలకు చెక్ పెట్టాలి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగే ఏ చర్యలనూ అనుమతించని రీతిలో నియమావళిని కట్టుదిట్టంగా రూపొందించాలి. ఆదేశాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజలెనుకున్న పాలకులు తామే జడ్జీలుగా, తామే శిక్షలు అమలు చేసేవారిగా ప్రవర్తిస్తే అది పౌరుల ప్రాథమికహక్కులకే భంగకరం.
Comments
Please login to add a commentAdd a comment