ఏలూరుదే తొలి ఫలితం | Sakshi
Sakshi News home page

ఏలూరుదే తొలి ఫలితం

Published Fri, May 24 2024 7:05 AM

ఏలూరు

సాక్షి ప్రతినిధి,ఏలూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ కొనసాగుతోంది.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. జిల్లాలో ఎక్కువ మెజార్టీ ఎవరికి వస్తుంది.. ఇలా ఎక్కడ చూసిన పొలిటికల్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో తొలి ఫలితం ఏలూరు నియోజకర్గం కాగా తుది ఫలితం నూజివీడు నియోజకవర్గానిది వెల్లడయ్యే అవకాశం ఉంది.

వచ్చేనెల 4న..

వచ్చే నెల 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం, ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే కార్యక్రమం ఇదే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈనెల 13న జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఈవీఎంలు ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌తో పాటు కౌంటింగ్‌ సెంటర్లను కూడా అక్కడే ఏర్పాట్లుచేసి అవసరమైన సౌకర్యాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్‌ను కేటాయించి ఏడు హాల్స్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. దాంతో పాటు సర్వీసు ఓట్లు, ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను రెండు కేటగిరీలుగా విభజించి మ్యానువల్‌ ఓట్ల లెక్కింపు, ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపును వేర్వేరుగా చేపట్టనున్నారు.

14 టేబుళ్ల చొప్పున..

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్‌ను కేటాయించారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లు అసెంబ్లీకి, 14 టేబుళ్లు పార్లమెంట్‌కు సిద్ధం చేసి రౌండ్ల వారీగా లెక్కించనున్నారు. ప్రతి రౌండ్‌లో 14 టేబుళ్ల ద్వారా లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను బట్టి రౌండ్లు కొనసాగనున్నాయి. తక్కువ బూత్‌లు ఉన్న చోట తక్కువ రౌండ్లలోనే ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ బూత్‌లు ఉన్న చోట కాస్త ఆలస్యంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మధాహ్నం 1 గంటకు

తొలి ఫలితం

కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా జిల్లాలో తక్కువ పోలింగ్‌ బూత్‌లు ఉన్న ఏలూరు నియోజకవర్గ ఫలితం మొదటగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తర్వాత ఉంగుటూరు ఫలితం తేలనుంది. అలాగే చివరగా నూజివీడు నియోజకవర్గ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం మధ్యాహ్నం 1 గంటకు, తుది ఫలితం సాయంత్రం 6 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించిన తర్వాత అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్‌ ఓట్లను కూడా అసెంబ్లీ తరహాలోనే లెక్కిస్తారు. గెలుపొందిన ఎంపీ అభ్యర్థికి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రం అందిస్తారు.

ఏలూరు

జిల్లా

ఓట్ల లెక్కింపునకు అధికారుల సన్నాహాలు

అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుళ్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌తో ప్రక్రియ ప్రారంభం

జూన్‌ 4న ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు

ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌లో పక్కా ఏర్పాట్లు

సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్‌

చివరిగా నూజివీడు ఫలితం వెల్లడయ్యే అవకాశం

నియోజకవర్గం పోలింగ్‌ రౌండ్లు

కేంద్రాలు

ఏలూరు 213 16

ఉంగుటూరు 214 16

కై కలూరు 235 18

దెందులూరు 239 18

చింతలపూడి 273 21

పోలవరం 284 22

నూజివీడు 286 22

ఏలూరుదే తొలి ఫలితం
1/1

ఏలూరుదే తొలి ఫలితం

Advertisement
 
Advertisement
 
Advertisement