వరికి వాయుగండం | - | Sakshi
Sakshi News home page

వరికి వాయుగండం

Published Wed, Oct 16 2024 2:12 AM | Last Updated on Wed, Oct 16 2024 2:12 AM

వరికి వాయుగండం

భీమవరం: సార్వా సీజన్‌లో వరి రైతులపై ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వరి సాగుచేస్తే విత్తన రకం పంట చేతికి వచ్చే సమయంలో బంగాళాఖాతంలో వాయుగుండం రైతులను బెంబేలెత్తిస్తోంది. గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులకు మాసూళ్లకు సిద్ధమవుతున్న ఎంటీయూ 1121, ఎంటీయూ 1156, ఎంటీయూ 1153, పీఆర్‌ 126 రకాలు సుడులు తిరిగి నేలవాలుతున్నాయి. జిల్లాలో సుమారు 2.19 లక్షల ఎకరాలో సార్వా సాగు చేయాల్సివుండగా సీజన్‌ ప్రారంభంలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వరినారుమళ్లు, నాట్లు నీటమునిగి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. జూలైలో వర్షాల కారణంగా సుమారు 30 ఎకరాలకు సరిపడా నారుమళ్లు, 15 వేల ఎకరాల్లో నాట్లు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. తిరిగి నారుమళ్లు వేసుకుని కొంతమంది, ఇతర ప్రాంతాల్లో నారు కొనుగోలు చేసి నాట్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2.03 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మిలిగిన భూముల్లో మురుగునీరు నిలిచిపోవడంతో బీడు భూములుగా దర్శనమిస్తు న్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు, వరదలు కారణంగా సుమారు 9 వేల ఎకరాల్లో వరిపైరు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్క గట్టగా 6,312 మంది రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందించారు. జూన్‌, జూలైలో పైరు దెబ్బతిన్న రైతులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీపై విత్తనాలు సరఫరా తప్ప ఎలాంటి సాయం అందనేలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

5 వేల ఎకరాల్లో విత్తనం రకం నాట్లు

దాళ్వా పంటకు వినియోగించే విత్తనాల కోసం రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో ఎంటీయూ 1121, ఎంటీయూ 1156, ఎంటీయూ 1153, పీఆర్‌ 126 వంటి రకాలు సాగు చేశారు. విత్తన రకాలు కొన్నిచోట్ల మాసూళ్లకు సిద్ధం కాగా మరికొన్నిచోట్ల మరో 10 రోజుల్లో కోతకు వస్తాయని రైతులు చెబుతున్నారు. స్వర్ణ రకం నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈనిక పూర్తిచేసుకుని గింజలు గట్టిపడే దశలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కోతకు సిద్ధమవుతున్న విత్తన రకం, ఈనిక పూర్తి చేసుకున్న పైరు సుడులు తిరిగి నేలకు వాలిపోవడంతో విత్తన రకం మొలకలు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన పైరుపై దోమపోటు అధికమై తీవ్ర నష్టం కలిగిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు, గాలులకు వాలుతున్న విత్తన రకం వరి

స్వర్ణ రకానికి నష్టమే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement