13 నుంచి జాతీయ నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన అభినయ నృత్యభారతి 29వ జాతీయ నృత్యోత్సవాలు, నృత్య పోటీలు డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, అధ్యక్షుడు మనోహర్ గోపాల్ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తెలిపారు. సోమవారం స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హేలాపురి లయన్స్ క్లబ్, సర్వీస్ ట్రస్ట్, హిందూ యువజన సంఘం, లయన్స్ జిల్లా 316జీ, దీపక్ నెక్స్ జెన్ సంస్థల సహకారంతో ఈ ఉత్సవాలను స్థానిక వైఏంహెచ్‌ఏ హాల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుమారు 10 రాష్ట్రాలకు చెందిన యువ కళాకారులు నృత్యకౌముది అవార్డులు స్వీకరించనున్నారని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 400మంది చిన్నారులు కూచిపూడి, జానపద, బృంద నృత్య పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇదే సందర్భంలో నృత్య రంగంలో సేవలందించిన గురువులకు నృత్య తపస్వి, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సేవామూర్తులకు సేవాతపస్వి అవార్డులతో సత్కరించనున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా యార్లగడ్డ జగన్మోహన్ రావు, అధ్యక్షుడిగా లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు వ్యవహరిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment