ఏలూరు(మెట్రో): ఇంటర్ క్వార్టర్లీ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతా శాతం మెరుగుపడేలా కళాశాలల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రి సెల్వి సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని 19 జూనియర్ కళాశాలలు, 30 హైస్కూళ్లకు సంబంధించి విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓలు, మండల విద్యాశాఖ అధికారులతో అపార్ నమోదు ప్రక్రియ, ఇంటర్ ఏ1, ఏ2 క్వార్టర్లీ పరీక్షల ఫలితాలు, విద్యార్థుల ప్రవేశాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మండలాల వారీగా అపార్ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రాలు 45 ఉన్నాయని, ఇంకా ఎక్కడైనా అపార్ కోసం అవసరమైతే ప్రారంభించాలన్నారు. లక్ష్యం మేరకు అపార్ నమోదును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పుట్టిన తేదీలో తప్పులు దొర్లితే ఆర్డీఓలు వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్ ఏ1, ఏ2 క్వార్టర్లీ పరీక్షల ఫలితాలపై సమీక్షిస్తూ వాటిని బట్టి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ ఉత్తీర్ణ శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓలు ఎం.అచ్యుత అంబరీష్, ఎంవీ రమణ, ఇన్‌చార్జి సీఈఓ విజయరాజు, డీవీఈఓ బి.ప్రభాకరరావు, ఆర్‌ఐ కె.చంద్రశేఖరబాబు, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్, ఎంఈఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment