కూటమి పాలనపై అంతటా వ్యతిరేకత
వేలేరుపాడు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో దౌర్జన్యాలకు పాల్పడుతోందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. మండలంలోని ఎర్రబోరు గ్రామంలో ఇటీవల టీడీపీ అల్లరిమూకల దాడి కేసు సంఘటనలో జైలుకెళ్లి వచ్చిన తాట్కూరుగొమ్ము ఎంపీటీసీ సభ్యుడు కొమ్మరాజు రాంబాబు, మరికొందరిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఐదు నెలలకే ఐదింతల వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి దౌర్జన్యాలు, అరాచకాలు, హత్యలు, అక్రమ కేసులు అధికమయ్యాయని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నమ్మి కూటమి నాయకులకు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తీరని అన్యాయం చేస్తు న్నారని విమర్శించారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులకు భయపడేది లేదని అన్నారు. అధికార పార్టీకి తలొగ్గిన పోలీసు అధికారులు కేసులు బనాయిస్తున్నారని, ఎంపీటీసీ రాంబాబుపై కేసు అలానే పెట్టారని అన్నారు. అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకున్నారనే నెపంతో ఎంపీటీసీ రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారని, అలాగే ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌ను సైతం ధ్వంసం చేశారని అన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మరో తొమ్మిది మంది కొమ్మరాజు సంపత్, కర్నాటి రాజు, అత్తిలి వెంకన్న, పంది గోపి, మడకం ధర్మరాజు, పరిచక శ్రీకాంత్, కూనవరపు శ్రీను, మిరియాల గాంధి, మీడియం ముత్యాలు అనే వారిపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకోబోమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల జోలికివస్తే ఉపేక్షించబోమన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా రామలక్ష్మి, సర్పంచ్‌లు కట్టి ఉదయ్‌కిరణ్, లక్ష్మణ్, పార్టీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వరావు, గుద్దేటి భాస్కర్, కౌలూరి సత్తిరాజు, కురిమెళ్ల రమేష్, బద్దె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులు
పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment