భోజన సరఫరా ప్రైవేట్‌పరం!
బుట్టాయగూడెం : సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు పూటలా ఆహారం సరఫరా చేసే బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు భోజనాలు వండి విద్యార్థులకు పంపిణీ చేసే బాధ్యతను అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు, మేట్రిన్లతో ఇటీవల అమరావతిలో గిరిజన శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పాఠశాలలకు, వసతి గృహాల విద్యార్థులకు ఆహార సరఫరా బాధ్యతలను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగిస్తామని సంబంధిత అధికారులు చెప్పినట్లు సమాచారం.
ఐటీడీఏ పరిధిలో 40 పాఠశాలల నిర్వహణ
కోటరామచంద్రాపురం (కేఆర్ పురం) ఐటీడీఏ పరిధిలో మొత్తం 154 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గిరిజన సంక్షేమ పాఠశాలలు 25, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు 114, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు 8, గురుకుల పాఠశాలలు, కళాశాలలు 7 ఉన్నాయి. వీటిలో 40 ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారం సరఫరా చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అందిస్తున్న ఆహార విధానం
గిరిజన సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు, మేట్రిన్ల వ్యవస్థ ద్వారా ఆహారం అందిస్తున్నారు. కూరగాయలు, గుడ్లను టెండర్ల ద్వారా, బియ్యం, ఇతర వస్తువులను గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, సహాయ సంక్షేమ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వ ఆలోచన ఇలా..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారంగా ఆహారం అందడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మండల కేంద్రాల్లో ఆహారం తయారు చేసి ఆయా పాఠశాలలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తొలి విడతలో రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఆహారం సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాల నాయకులు
ఆహార సరఫరా విషయంలో ప్రభుత్వ యోచనను గిరిజన సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆహార సరఫరా ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవ కాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత విధానంలోనే విద్యార్థులకు ఆహారం మెనూ సక్రమంగా అమలు జరిగేలా అధికారులు కృషి చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఐటీడీఏ పరిధిలో 40 ఆశ్రమ, గురుకుల పాఠశాలలు
వీటికి ఆహారం బాధ్యత అక్షయపాత్రకు కేటాయించేలా కసరత్తు
ఇప్పటికే గిరిజన సంక్షేమ అధికారులతో ప్రత్యేక సమావేశం
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు
ఇలాగైతే ఇబ్బందులే..
ఆహార సరఫరాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇబ్బందులు తప్పవు. మండల కేంద్రాల్లో వంటలు చేసి దూరప్రాంతాలకు తరలించాలంటే కష్టంతో కూడిన పని. మార్గమధ్యంలో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థులకు సమయానికి భోజనం అందని పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలి.
– సరియం రామ్మోహన్‌రావు, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి
అప్పగింత మానుకోవాలి
గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన సరఫరా చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల పలు పోస్టులు పోయే పరిస్థితి నెలకొంటుంది. దీనిపై ఆధారపడిన వర్కర్లు కూడా వీధిన పడే అవకాశం ఉంది. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. పాత పద్ధతినే కొనసాగించాలి.
– తెల్లం రామకృష్ణ, సీపీఎం మండల కార్యదర్శి, బుట్టాయగూడెం
Comments
Please login to add a commentAdd a comment