అద్దె కార్లతో ఉడాయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఏలూరు టౌన్: నగరంలో పలు కార్లను అద్దెకు తీసుకుని ఉడాయిస్తున్న ఇద్దరిని ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ముంగర అభిషేక్, ఏలూరు టూ టౌన్ పరిధిలోని పత్తేబాద ప్రాంతానికి చెందిన యల్లపు భానుచందర్‌గా పోలీసులు గుర్తించారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు నగరంలోని టూటౌన్, త్రీటౌన్, ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు తమ కార్లను అద్దెకు తీసుకుని నెలలు గడుస్తున్నా తిరిగి ఇవ్వడం లేదని, వాటిని తాకట్టు పెట్టారని ఆయా పోలీస్ స్టేషన్‌లో పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు త్రీటౌన్ సీఐ ఎస్.కోటేశ్వరరావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. దీంతో నిందితులు ముంగర అభిషేక్, యల్లపు భానుచందర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఆరు కేసులకు సంబంధించి ఆరు కార్లును రికవరీ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు ప్రసాద్, రాంబాబులను డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment