భక్తులతో పోటెత్తిన పట్టిసీమ
పోలవరం రూరల్: కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడతో పట్టిసం శివక్షేత్రం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. మహిళలు ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. వీరేశ్వరస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. క్షేత్ర పాలకుడైన భావన నారాయణ స్వామిని కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. శివక్షేత్రం వద్ద సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈవో చాగంటి సురేష్ నాయుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
హామీల అమలు కోరుతూ ధర్నా
బుట్టాయగూడెం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని రెడ్డిగణపవరం సచివాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 50 సంవత్సరాలు పైబడిన ఎస్సీ, బీసీలకు పింఛను నమోదు చేసి రూ.4000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటినా ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు. డిసెంబర్ నెలలోనైనా పింఛన్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో చిన్నదుర్గారావు, గంగుల గవరయ్య, ఏసు, విజయ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని మహిళ మృతి
దెందులూరు: రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. దెందులూరు మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన కాలి కాంతమ్మ గ్రామంలో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు సోమవారం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై పి సైమన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment