రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా సీనియర్ కబడ్డీ పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24న తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా పురుషులు, మహిళల జట్లకు సంబంధించి 12 మందితోపాటు స్టాండ్‌బైగా మరో ముగ్గురు చొప్పున ఎంపిక చేసినట్లు వివరించారు. వీరంతా డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించే 71వ రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల అఽధినేత బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించగా, సెలక్షన్ కమిటీగా ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె.రంగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రంగారావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బి.జాన్సన్, పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, టి.సత్యవేణి, ఎస్.సూర్యనారాయణ, ఎ.నాగేశ్వరరావు, కె.బాబూరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment