ఏదీ సురక్ష.. ప్రజారోగ్యంపై ఎందుకింత కక్ష?
భీమవరం (ప్రకాశంచౌక్): కూటమి ప్రభుత్వంలో వైద్యం పడకేసింది. నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఆరు నెలల దాటినా ఇప్పటివరకు ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. కనీసం సీజనల్ వైద్యసేవలు కూడా అందించేందుకు ఆసక్తి చూపడం లేదు. సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నా ఇప్పటివరకు ఒక్క వైద్యశిబిరం కూడా నిర్వహించలేదంటే కూటమి ప్రభుత్వానికి పేదల ఆరోగ్యంపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది. గతంలో ప్రజారోగ్యమే పరమావధిగా జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికంగా అందించడం కోసం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతగానో పేరుగాంచింది.
నాడు వార్డుల వారీగా సురక్ష క్యాంపులు
నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లాలోని పట్టణాల్లో వార్డుల వారీగా జగన్న ఆరోగ్య సురక్ష వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్యులచే ప్రజలకు వైద్యసేవలను అందించింది. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను అన్నింటిని ఒకే చోటకు తీసుకువచ్చి పట్టణంలోని పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించారు. గైనకాలజీ, జనరల్ మెడిసన్, గుండె వ్యాధులు, మూత్రపిండాలు, గ్యాస్ట్రో, జనరల్ సర్జన్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, మానసిక, కంటి, ఎముకలు తదితర స్పెషలిస్టులచే ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఉచితంగా 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందించేవారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలిగేది. ప్రతి క్యాంపులో రూ.100 నుంచి రూ.1500 విలువైన పరీక్షలు, రూ 500 నుంచి రూ.2 వేల విలువైన మందులు ఉచితంగా అందించేవారు. లక్షల రూపాయల ఖర్చు చేసే వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో అందించేవారు. కేన్సర్, లివర్, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలను ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించేవారు. జిల్లాలోని ఆరు పట్టణాల్లో 191 వార్డులకుగాను 150 వార్డుల్లో సురక్ష శిబిరాలు పూర్తి చేశారు. 60 వేల మందికి వైద్యసేవలు అందించారు. 2 వేల మందికి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు, మెరుగైన వైద్యం అందించారు. 58 వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 50 వేల మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటివరకు ఒక్క వైద్య శిబిరం నిర్వహించని కూటమి ప్రభుత్వం
సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
జగన్ ప్రభుత్వంలో ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట
కార్పొరేట్ వైద్యం సైతం ఉచితంగా అందించిన వైఎస్సార్ సీపీ
నేడు సీజనల్ వ్యాధులకు సైతం దిక్కులేదు
కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరునెలల కాలంలో కనీసం సీజన్‌ల వ్యాధులకు జిల్లాలోని ఆరు పట్టణాల్లోని ఒక్క వార్డులో కూడా వైద్యశిబిరాలు నిర్వహించలేదు. రోజుల తరబడి జ్వరంతో పట్టణవాసులు బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో చేసేదిలేక పేదలు ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల వద్ద జనం క్యూ కట్టడంతో అక్కడ వైద్యులు ఎక్కువ మందికి వైద్యం అందించడం కష్టతరంగా మారింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు, ప్రైవేట్ ఆస్పత్రిల్లో వైద్యం చేయించుకుంటున్నారు. పేదలు సైతం వైద్యం కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment