ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
ద్వారకాతిరుమల: ఆ ఉపాధ్యాయుడు మమ్మల్ని చితక్కొడుతున్నాడు.. మేము స్కూలికి వెళ్లం బాబోయ్.. అంటూ పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద సోమవారం గగ్గోలు పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారకాతిరుమలకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కలసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే. స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముత్యాలరావు సోమవారం తన కుమారుడు త్రివిక్రమ్‌ను కొట్టాడని గుండే ధర్మరాజు, తన కుమార్తె సహస్రను కొట్టాడని గుండే మాణిక్యం, అలాగే తన కుమారుడిని కొట్టాడని మరో వ్యక్తి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఏకో ఒక వంకతో పిల్లలను నిత్యం కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టి, బోర్డుకు, బెంచీకేసి గుద్దుతున్నాడని, దీంతో తమ పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడుతున్నారని, ఇలాగైతే ఎలా అని వారు ప్రశ్నించారు. ముత్యాలరావుపై తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాఠశాల ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసేలా చూడాలని అక్కడున్న టీడీపీ నేతలకు ఎమ్మెల్యే మద్దిపాటి సూచించారు. దీంతో ఈ పంచాయితీ తాత్కాలికంగా వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment