డిస్కోనైట్ అయినా, పెళ్లి బరాత్, దావత్ ఏదైనా డీజే మోత మోగి పోవాల్సిందే. నచ్చిన పాటను అడిగి మరీ పెట్టించుకుని స్టెప్పులతో ఊగిపోతుంది నేటి యువతరం. వెరైటీగా మిరుమిట్లు గొలిపే డ్రెస్ వేసుకుని, ఉత్సాహం నింపే పాటలను పెడుతూ ఊగిపోతుంటాడు డీజే. అబ్బాయిలు మాత్రమే డీజేగా కనిపిస్తుంటారు. కానీ డీజేవాలి దీది పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా డీజేను దంచి కొడుతోంది. తన రీమిక్స్ బీట్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తూ, సరికొత్త బాటలో నడిచేందుకు నేటి యువతరానికి మార్గం చూపుతోంది డీజే రింక్.
డీజే రింక్ మరెవరో కాదు 38 ఏళ్ల స్నేహల్ షా. గుజరాత్‌లో పుట్టినప్పటికీ ముంబైలో పెరిగింది. షాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తయ్యాక... కామర్స్‌లో పీజీ చేసింది. మార్కెటింగ్ కంపెనీలో చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్నేహల్ మన సంతా సంగీతంపైనే ఉండేది. దీంతో.. మంచి మంచి పాటలను వినడం, వాటన్నింటినీ తన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో భద్రపరుచుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఇలా స్నేహల్ కలెక్ట్ చేసిన వాటిలో బాలీవుడ్ పాటలు కోకొల్లలు. సంగీతంపై ఉన్న మక్కువతో సౌండ్ ఇంజినీరింగ్ డిప్లొమా కూడా చేసింది.
డీజే రింక్‌గా...
ఒకసారి స్నేహల్ పార్టీకి వెళ్లింది. అక్కడ ఎంతో ఉత్సాహమైన డీజే పాటలు వస్తున్నాయి. తనకిష్టమైన పాటను ప్లేచేయమని డీజేను అడిగింది. అందుకు ఆ డీజే ప్లేచేయడం కుదరదు అన్నాడు. దీంతో తనే ప్లే చేసుకుంటాను అని అడిగి పాటను ప్లే చేసింది. అప్పటి నుంచి తను కూడా డీజేగా మారాలనుకుని.. ప్రముఖ డీజే జో అజెరెడో, డీజే సుకేతు దగ్గర డీజే శిక్షణ తీసుకుంది. నైపుణ్యాలన్నింటిని ఔపోసన పట్టాక 2015లో డీజే రింక్‌గా మారింది. వివిధ రకాల క్లబ్స్‌లో పనిచేస్తూ ‘డీజేయింగ్’ సంబంధించిన అప్‌డేటెడ్ టెక్నాలజీ గురించి తెలుసుకునేది. స్నేహల్ ఇష్టాన్ని తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. తల్లిదండ్రులు ముద్దుగా పిలుచుకునే ‘రింకు’ పేరునే ... డీజే రింక్‌గా మార్చుకుని డీజే ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
పదమూడులో పాపులర్...
డీజే రింక్ ఈడీఎమ్ ‘‘ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్’’లో కష్టపడి నైపుణ్యం సాధించింది. ముఖ్యంగా హిప్ హాప్, బాంగ్రా పాటలను ప్లేచేయడంలో అందె వేసిన చెయ్యిగా పేరుగాంచింది. పండుగల్లో రీమిక్స్ చేసిన పాటలను కూడా ప్లే చేసేది. అవి అందరినీ ఆకర్షిస్తుండడంతో డీజే రింక్ 2013లో బాగా పాపులర్ అయ్యింది. దీంతో భారతదేశంలో బాలీవుడ్ పాటలను మిక్స్ చేసే తొలి మహిళా డేజేగాను, ఇండియాలోని టాప్ –22 డీజేలలో ఒకటిగా నిలిచింది. పురుషుల ఆధిపత్యం కొనసాగే డిజే సౌండ్స్‌లో రింక్ ఏమాత్రం భయపడలేదు. ప్రారంభంలో పురుష డీజేలతో కలిసి పనిచేయడం కష్టం అయినప్పటికీ.. తనని తాను నిరూపించుకుని తన కలను నిజం చేసుకుంది.
అందర్నీ బీట్ చేస్తూ...
మంచి మంచి బీట్స్‌ను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అనేక రికార్డులను బద్దలు కొడుతోంది స్నేహల్ షా. మల్టీటాలెంటెడ్ సింగర్, రీమిక్సర్, పెర్‌ఫార్మర్‌గా అనేక ప్రశంసలు అందుకుంటోంది. సోనీ మ్యాక్స్ ఐపీఎల్ సీజన్ –6లో పాల్గొన్న ఒక్కగానొక్క మహిళా డీజే రింక్ కావడం విశేషం. గత పదేళ్లుగా ప్రపంచంలోని డీజేలతో పోటీ పడుతూ టాప్–100 జాబితాలో ఇండియా తరపున తనకంటూ స్థానం కల్పించుకుంది. 2023 సంవత్సరానికి గాను ఏషియా టాప్–50 డిజేల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది రింక్. అంతేగాక ఇటీవల ‘బెస్ట్ వెడ్డింగ్ డీజే’ అవార్డును అందుకుంది.
శ్రావ్యమైన బీట్స్‌తో సాగిపోతున్న డిజే రింక్ ఎంతోమంది మహిళలు, అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది. అనాదిగా వస్తోన్న పద్ధతులను దాటుకుని తమని తాము నిరూపించుకోవచ్చని తన బీట్స్‌తో చక్కగా వినిపిస్తోంది. ఇప్పటిదాక రెండు వేల బాలీవుడ్ పాటలను రీమిక్స్ చేసింది. డిజే స్కూల్ నడుపుతూ మరింతమంది డీజేలను తయారు చేస్తోంది. ‘‘డీజే రింక్స్ సౌండ్ ఫ్యాక్టరీ’’ పేరిట యూ ట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అమృతారావ్, జాన్ అబ్రహమ్, కరణ్ గ్రోవర్, ఇలియానా డిక్రూజ్ వంటి బాలీవుడ్ సెలబ్రెటీలతో స్టేజ్ పంచుకుంది.‘‘ద వే యూ లైక్ మి’’ పేరిట రింక్ విడుదల చేసిన తొలి ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభించి, బాగా పాపులర్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment