‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్‌కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్‌రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్‌జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్‌ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు...
కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్‌కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్‌సైజ్‌కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్‌మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్‌కు వెళ్లడం అనేది కుదిరేది కాదు.
రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్‌ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్‌లు జిమ్‌కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్‌మెంట్‌లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్‌మెంట్‌లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు.
కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్‌ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్‌లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్‌లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్‌ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్‌మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్‌నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది.
డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్‌సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్‌ను ఉపయోగిస్తుంది. జిమ్‌లో చేసే ప్రతి వర్కవుట్‌కు ఈ మెషిన్‌ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్‌ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌లు మొదలుపెట్టారు.
కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్‌బ్యాక్‌ను కంపెనీ ఫౌండర్‌లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్‌బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్‌కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్‌లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్‌కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి ప్రోటోటైప్‌లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు.
ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్‌లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్‌నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు.
(చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!)
Comments
Please login to add a commentAdd a comment