
పచ్చదనం చూస్తే మనసు పరవశించకుండా ఉండదు. కాంక్రీట్ అరణ్యంలో బాల్కనీలను హరిత హారాలుగా మార్చి పచ్చని ముచ్చట తీర్చుకుంటూంటారు. అయితే, లివింగ్ రూమ్‌లోనూ పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. అదీ గ్లాస్ టీపాయ్‌తో. అలా లివింగ్ రూమ్‌లోకి తొంగి చూసే ఆ కొత్త అందం గురించి..
గ్లాస్ టాప్ .. ఇండోర్ ప్లాంట్స్:
గ్లాస్ టాప్ సెంటర్ టేబుల్స్ కొన్ని నగిషీలు అద్దుకుంటూ.. ఇంకొన్ని వంకీలతో వయ్యారాలు పోతూ ఆకట్టుకుంటూంటాయి. వాటికి పచ్చదానాన్నీ అద్దితే..!? ఇంటికి వచ్చిన అతిథులు పచ్చికలో టీ, కాఫీలను ఆస్వాదిస్తున్న అనుభూతిని సొంతం చేసుకోరూ! అందుకే టేబుల్ గ్లాస్ టాప్ కింది భాగంలో ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచేలా సెట్ చేసుకుంటే సరి!
ప్రకృతి దృశ్యాల సోయగం:
ప్రకృతి పరచిన పచ్చిక బయళ్ల పచ్చని తివాచీని డ్రాయింగ్ రూమ్ నడుమ పరవాలనుకుంటే నేచురల్ గ్రాస్‌తో సెంటర్ టేబుల్‌ను అలంకరించుకోవాలి. ఈ అలంకరణకు సంబంధించిన ఆన్‌లైన్ క్లాసులూ నెట్టింట కొలువుదీరి ఉన్నాయి.
రంగు రంగుల మొక్కలు:
ఇండోర్ ప్లాంట్స్‌లో చాలా వరకు చిట్టి చిట్టి మొక్కలను ఎంపిక చేసుకుంటే మంచిది. వాటిల్లో మళ్లీ పసుపు, పచ్చ, లేత గులాబీ రంగు మొక్కలను పెట్టుకుంటే ఆ అందం.. గ్లాస్ నుంచి బయటకు మరింత శోభాయమానంగా కనువిందు చేస్తుంది.
కృత్రిమ పూల సొగసు:
రంగురంగుల పూల సొగసుకు సిట్టింగ్ ఏరియాలోనూ సీట్ ఆఫర్ చేయాలనుకుంటే ఆర్టిఫిషియల్ మొక్కలను గ్లాస్ సెంటర్ టేబుల్ లోపల అలంకరించవచ్చు. ఇందుకోసం రంగులు, పువ్వులు, డిజైనర్ మొక్కలను... అభిరుచి మేరకు ఎంపిక చేసుకోవచ్చు.
ఇలా తక్కువ ఖర్చుతో సెంటర్ టేబుళ్లను పచ్చగా మార్చి ..ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని నింపొచ్చు.. అతిథుల ప్రశంసలనూ పొందొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment