
సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్‌కు చెందిన ఎన్–ఆర్క్ సంస్థ నిర్మిస్తోంది. మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్–ఆర్క్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. బయటివైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. రెండో వర్తుల భాగంలో తేలియాడే భవంతులు, నగరంలో జనాల రాకపోకలకు వీలుగా పడవ మార్గాలు ఉంటాయి.
లోపలి వైపు నడిమధ్యన ఉండే వర్తుల భాగంలో ఉపరితలంపై ఎలాంటి నిర్మాణం ఉండదుగాని, నీటి అడుగున డేటా సెంటర్, వైద్య పరిశోధన కేంద్రం ఉంటాయి. ‘డోజెన్ సిటీ’గా పేర్కొంటున్న ఈ నగరం సముద్రంలో వైద్య పర్యాటక కేంద్రంగా జనాలను ఆకట్టుకోగలదని దీని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో తేలియాడే భవంతులు ఉన్న భాగంలో నివాస భవనాలతో పాటు తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి. అలాగే నగర ప్రజల అవసరాల కోసం పంటలు పండించుకునే చిన్న చిన్న పొలాలు, తోటలు కూడా ఉంటాయి. నాలుగు కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్న ఈ నగర నిర్మాణం 2030 నాటికి పూర్తి కాగలదని చెబుతున్నారు.
(చదవండి: 600 ఏళ్లనాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే)