అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. కానీ సమాజం, చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమ్మని సలహా ఇస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు.
అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దీన్ని ఒక వేడుకలా నిర్వహించి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లంటే నూరేళ్ల పండుగ. కానీ అందరి జీవితాల్లో అది నిజం కాదు. పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే? ఆ బాధ వర్ణణాతీతం.మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. అయితే అప్పటికే భర్తతో ఇక కలిసి ఉండలేనంటూ కూతురు తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా ఘనంగా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. వివాహం సమయంలో నిర్వహించిన ఊరేగింపు మాదిరిగానే బ్యాండు బాజాలు, టపాసుల చప్పుళ్ల మధ్య ఆమెకు స్వాగతం పలికారు.
బాణసంచా సందడి మధ్య ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..రాంచీలో కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు.ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అతడు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని,అంతేకాకుండా అతడికి ముందే వివాహం అయినట్లు తెలిసి షాక్ అయ్యామని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు.
అయినప్పటికీ పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సర్దిచెప్పామని, అయినా అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి విడిపోవాలని తన కూతురు నిర్ణయం తీసుకుందని, దీన్ని తాము కూడా అంగీకరించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు బరాత్ మాదిరిగా ఊరేగింపు చేశామని అన్నారు. ప్రస్తుతం విడాకుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment