న్యూస్‌మేకర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం.
వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్‌ఫోన్‌ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది.
వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే.
15000 మంది గేమర్స్
మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది.
సంవత్సరానికి 5 కోట్లు
23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్‌లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు.
పల్లెటూరి అమ్మాయి
పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్‌డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది.
మంచి మార్గం కోసం
‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు.
చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment