అద్దెకు ఎన్నో ఇళ్లు, ఫ్లాట్లు ఉంటాయి కదా అనిపించవచ్చు. కాని వీల్‌చైర్‌లో మాత్రమే జీవనం గడిపేవారికి ఆ ఇళ్లేవీ పనికి రావు. బెంగళూరులో ఐటి ఇండస్ట్రీలో పని చేస్తున్న మృణ్మయి తను నివసించడానికి బెంగళూరులో తగిన ఫ్లాటే దొరకడం లేదని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ విశేషంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. లిఫ్ట్‌లో అడుగు పెట్టడం దగ్గరి నుంచి బాత్‌రూమ్‌ల వరకూ ప్రతిదీ వీల్‌చైర్‌కు వీల్లేనివేనని ఆమె తెలిపింది. ఆమె మాత్రమే కాదు సాధారణ వ్యక్తులకు జబ్బు చేస్తే వీల్‌చైర్‌లో ఆస్పత్రికి వెళ్లిరావడం కూడా దుర్లభమే. మన నిర్మాణ పద్ధతుల్లో మానవీయత రాదా?
‘అందరికీ అందుబాటు’ (యాక్సెసెబిలిటీ టు ఆల్) అనే మాట వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని అది ఆచరణ యోగ్యం కావడం ఇంచుమించు అసాధ్యంగా ఉంది మన దేశంలో. ‘మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తే అందరూ ఆ ఆహ్వానాన్ని మన్నించగలరా? మన ఇల్లు దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉందా? నివసించే ఫ్లాట్స్‌లో సులభంగా వీల్‌చైర్‌తో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కట్టుకున్న ఇళ్ల మెయిన్‌గేట్‌నైనా వీల్‌చైర్ దాటగలదా? అందరూ మెట్లు వాడగలరని, మెట్లు ఉంటే సరిపోతుందని ఇప్పటికీ భావిస్తున్నామంటే యాక్సెసెబిలిటీ టు ఆల్ హక్కును నిరాకరిస్తున్నట్టే. ర్యాంప్‌లు కట్టి దివ్యాంగుల రాకపోకలను అన్ని ప్రయివేటు, పబ్లిక్ ప్లేసుల్లో సులభం చేసినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు.
ఇల్లు కావాలి
బెంగళూరులో అమేజాన్‌లో పనిచేస్తున్న మృణ్మయి‘నాకు ఇల్లు కావాలి. కాని అలాంటి ఇల్లు దొరకడం లేదు’ అని ‘ఎక్స్’ (ట్విటర్)లో తాజాగా పెట్టిన పోస్టు దివ్యాంగుల ఘోషను మరోసారి బయటపెట్టింది. ‘నేను ఇన్నాళ్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అందులో ర్యాంప్‌లు ఉన్నాయి. నా మోటర్డ్ వీల్‌చైర్‌తో కిందకు రావడం మళ్లీ ఫ్లాట్‌లోకి వెళ్లడం సులభంగా ఉంటుంది. ఫ్లాట్‌లో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఇప్పుడు మా ఫ్లాట్ ఓనర్ ఏవో కారణాల రీత్యా ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుంచి తగిన ఫ్లాట్ కోసం ఎంతో వెతుకుతున్నాను. కాని వీల్‌చైర్‌తో రాకపోకలు సాగించేలా ఒక్క ఫ్లాట్ కూడా లేదని తెలపడానికి చింతిస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది.
అన్ని చోట్లా మెట్లే
చాలా ఫ్లాట్లలో లిఫ్ట్ దగ్గర మెట్లు ఉండటం ఒక సమస్యగా మృణ్మయి చెప్పింది. అంటే ఒకటో రెండో మెట్లు ఎక్కి లిఫ్ట్ ఎక్కాలి. కొన్ని లిఫ్ట్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీల్‌చైర్‌తో ప్రవేశించి లోపల దానిని తిప్పుకుని డోర్ వైపుకు ముఖం పెట్టడం కష్టం. ‘అపార్ట్‌మెంట్స్‌లో చాలా ఫ్లాట్లకు గడప అడ్డంగా ఉంటుంది. వీల్‌చైర్‌తో దాటలేము. దాటినా అన్ని ఫ్లాట్లలో బాత్‌రూమ్‌లు ఒక మెట్టు ఎత్తులో ఎందుకు కడతారో అర్థం కాదు. నేను వీల్‌చైర్‌తోటే బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేయాలి. కాని సింకో, టాయిలెట్ సీటో అడ్డంగా ఉంటుంది. అదీగాక బాత్‌రూమ్ ద్వారాలు మరీ సన్నగా పెడతారు. నా వీల్‌చైర్‌తో అడుగుపెట్టాలంటే అవి కనీసం 25 అంగుళాల వెడల్పు ఉండాలి. అలా ఉండవు’ అంటుంది మృణ్మయి. ‘మరో సమస్య ఏమిటంటే... ఇలా వీల్‌చైర్‌కు అనువుగా ఉన్న ఫ్లాట్‌లకు రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. 25 వేల రూపాయల ఫ్లాట్ 40 వేలు చెబుతున్నారు’ అందామె.
యాక్సిడెంట్ వల్ల
మృణ్మయి అందరిలా హుషారుగా తిరిగే అమ్మాయి. కాని 2011లో జరిగిన కారు ప్రమాదం వల్ల ఆమెకు స్పైనల్ కార్డు ఇంజూరీ జరిగింది. సర్జరీ చేసినా రెండు భుజాల కింద ప్రాంతమంతా అధీనాన్ని కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మోటర్డ్ వీల్‌చైర్ ద్వారా ఆమె మామూలు జీవనం గడపడానికి ప్రయత్నిస్తోంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఆఫీస్ పని కోసం డిక్టేషన్ సాఫ్ట్‌వేర్ వాడతాను. వేళ్ల మీద అధీనం ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ ఉపయోగిస్తాను. కాని నాకూ తిరగాలని ఉంటుంది. బయటికొస్తే రెస్టరెంట్‌కు కూడా పోలేను. ప్రతి రెస్టరెంట్‌కూ మెట్లు ఎక్కి వెళ్లాలి. ఎక్కడా ర్యాంప్‌లు ఉండవు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారికే ప్రవేశం అన్నట్టుగా మన నిర్మాణాలు ఉంటాయి.
సినిమా హాళ్లు చెప్పే పనే లేదు. టాక్సీ సర్వీసులు కూడా వీల్‌చైర్ ఫ్రెండ్లీ కావు. అందుకే మాలో చాలామంది యాక్సెసబిలిటీ యాక్టివిస్ట్‌లుగా మారి సమాజంలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపింది మృణ్మయి. ‘ఎక్స్’లో మృణ్మయి పెట్టిన పోస్ట్‌కు చాలామంది స్పందించారు. నిజంగా మీ ఇబ్బంది మీరు చెప్తుంటే తెలుస్తోంది అని చాలామంది చెప్పారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఆఫీసులు, పార్కులు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదీ దివ్యాంగుల రాకపోకలకు అనువుగా మారడం, మార్చడం తప్పనిసరి. వాటిని వాడేది ఒకరిద్దరైనా ఆ ఒకరిద్దరి హక్కును నిరాకరించే అధికారం మనకు లేదు.
(చదవండి: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! )
Comments
Please login to add a commentAdd a comment