'చలికాలంలో చర్మసమస్యలు, జుట్టు రాలిపోవడం వంటివి ఎంత సాధారణమో, ఆస్త్మారోగులకు ఆయాసం ఎక్కువ కావడం, ఆర్థరైటిస్ అంటే కీళ్ల జబ్బులు ఉన్నవారికి కీళ్లనొప్పులు పెరగడం అంతే సహజం. గతవారం మనం కీళ్లజబ్బులకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కాబట్టి ఈవారం ఆస్త్మా రోగులు ఏం చేయాలి, ఏం చేయకూడదు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.'
దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా మొదలైనవన్నీ శ్వాసవాళాలకి, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులే. ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధి. దీనికి వయసుతో నిమిత్తంలేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. సరిపడని తత్వం అంటే ఎలర్జీ, దుమ్ము, ధూళి, పొగ, ధూమపానం, ఘాటైన వాసనలు, కాలుష్య వ్యర్థాలు, చలి వాతావరణం సరిపడకపోవటం వంటివి. ముందుగా శీతాకాలంలో ఆస్త్మా రోగులు ఎలా ఉండాలో చూద్దాం!
- శరీర తత్వాన్ని అనుసరించి ఏ పదార్థం తీసుకుంటే ఉబ్బసం వస్తుందో, ఆ పదార్థం లేదా పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
- నిల్వ ఉన్న పదార్థాలకు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి.
- మంచినీరు ఎక్కువగా తాగాలి. ఉబ్బసం ప్రకోపించినప్పుడు, మరింతగా ఎక్కువ నీరు తాగాలి.
- రోగ నిరోధకశక్తిని పెంచేది విటమిన్–సి. అందువలన విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరలు అవసరం.
- ఆ క్రమంలో ప్రతిరోజు కనీసం ఒక సిట్రస్ పండు అయినా తప్పనిసరిగా తినాలి.
- మాంసాహారులయితే ఒమేగా–3 ఫాటీ యాసిడ్స్‌తో కూడిన చేపలను, కోడిమాంసాన్ని తీసుకోవచ్చు.
- శ్వాసనాళాలలోని జిగురు పొర పల్చబడకుండా ఉండటానికి కోడి మాంసం దోహదం చేస్తుంది.
- ఉబ్బసానికి వాడే అల్లోపతి మందులు చాలావరకు స్టెరాయిడ్ మందులు. వీటి వలన మంచితోబాటు కీడు కూడా జరుగుతుంది.
- ఉదయం పూట వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి.
- రాత్రి నిద్రించే ముందు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి.
- రాత్రి పడుకొనే ముందు ఆవాల నూనె ఛాతీ మీద, గొంతుకు రాయాలి.
ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నట్టే.. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం కూడా అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు అది ఆహారపరమైన అలర్జీలకు దారితీస్తుంది. ఇది కొంతమందిలో ఆస్తమాకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ 'డి'
ఆస్తమా నుంచి రక్షణనిచ్చే వాటిలో విటమిన్ డి ది కీలక పాత్ర. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు డి విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు రూపంలో విటమిన్ డి అందుతుంది. పాలు, గుడ్లు కొందరిలో అలర్జీకి కారణమవుతాయి. పడని వారు వీటిని తీసుకోకూడదు.
విటమిన్ 'ఎ'
శరీరంలో విటమిన్ ఎ తగినంత ఉన్న పిల్లలకు ఆస్తమా సమస్య తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించాయి. పిల్లలలో విటమిన్ ఎ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందట. క్యారట్, బ్రకోలీ, ఆలుగడ్డ, పాలకూర తదితర వాటిల్లో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది.
పండ్లు
రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు ఉపయోగపడతాయి.
మెగ్నీషియం
మెగ్నీషియం తక్కువగా ఉంటే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. కనుక గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర తదితర మెగ్నీషియం తగినంత లభించే వాటిని తీసుకోవాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఉపశమనం.
వీటిని దూరం పెట్టాలి..
పులిసిన పదార్థాలు, పొగతాగటం, మత్తుపానీయాలను సేవించటం, మసాలా దినుసులు, తీపి పదార్థాలు.
కడుపునిండా తినడం కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోయినా, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండడం అవసరం. సల్ఫైట్స్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు, ప్యాకేజ్డ్ లెమన్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పై సల్ఫైట్స్ ఉంటాయి. కాఫీ, టీ, కొన్ని రకాల సుగంధ, మసాల దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఉబ్బసాన్ని పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫీషియల్ కలర్స్, ఫ్లావర్స్ తోనూ సమస్య పెరుగుతుంది.
ఇవి చదవండి: అర్ధరాత్రి 1-4గంటల మధ్యలో నిద్ర లేస్తున్నారా? ఆత్మలు కల్లోకి..
Comments
Please login to add a commentAdd a comment