
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు.
ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్‌మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.
1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం
పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది.
- మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం?
- వారి అతిపెద్ద భయం ఏమిటి?
- భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి?
- వారు దేనికి ఒత్తిడి చెందుతారు?
- వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి?
- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి
వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం.
బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు..
- కలసి గడపడానికి ప్లాన్ చేయలి
- ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి
- భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి
- భాగస్వామిని అభినందించాలి
- అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి
3. కలసి మెలసి నడవండి
ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్‌ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది.
4. భాగస్వామి మాటకు విలువనివ్వండి
దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.
5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి
వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు.
- ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి
- అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి
- ఒకరి తప్పులను ఒకరు సహించాలి
6. పీటముడిని అధిగమించండి
నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి..
- సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
- ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి ·
- చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి
- భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి
7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి
జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.
- మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం
- పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం
- అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం
- అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం
--సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
(చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..)
Comments
Please login to add a commentAdd a comment