తొమ్మిది మంది అమరవీరుల సమాధులు
దసరా సంబరాలు. ఊరు, వాడ, పల్లే, పట్టణం అనే తారతమ్యం లేకుండా అంబరాన్నంటాయి. భారత్‌లోని నలుమూల ప్రాంతాలు దసరా ఉత్సవాలతో మునిగితేలుతుంటే ఓ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది వ్యవహారమూ కాదండోయ్. వందేళ్లుగా దసరా వేడుకలు జరగడం లేదీ గ్రామంలో. పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటారు ఎక్కడకి వెళ్లరు. ఎందుకిలా? అనుకుంటున్నారా? మంచి కారణమే ఉంది. తెలిస్తే మీరూ బాధపడే అవకాశమూ ఉంది. ఆ గ్రామ ప్రజల మనసెంత గొప్పదో కదా అనుకోకుండానూ ఉండలేరు.
ఆ గ్రామం పేరు గగోల్. ఉండేది ఉత్తర ప్రదేశ్‌లో. మీరట్ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనిదీ పల్లె. ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటిగడప దాటరు. నోరూ మెదపరు. మౌనంగా బాధను అనుభవిస్తున్నట్లు ఉంటారు. ఈ వింత పోకడలన్నీ ఎందుకంటే....ఎప్పుడో... 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని బ్రిటిష్ పాలకులు ఉరితీసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని... ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. వివరాలేమిటంటే....
భారతదేశ చరిత్ర ఓ ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటీష్ వలసవాద విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేసినప్పటికీ ఎందరికో స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చేలా చైతన్యపరిచింది. వారిలోని దేశభక్తిని మేల్కొల్పి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన గొప్ప ఘటం అది. ఐతే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని భారత్‌లో పలు చోట్ల బ్రిటీషర్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి. వీరిలో గగోల్ ప్రాంతవాసులు కూడా ఉన్నారు.
ఆ గగోల్ గ్రామం చుట్టపక్కల గ్రామాలైన మురాద్‌నగర్, నూర్‌నగర్, ప్రాంతవాసులు ఝండాసింగ్ సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో బ్రిటీష్ వాళ్లు ఆ గ్రామస్తులపై దాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మీరట్ నగరానికి చెందిన కొత్వాల్ బిషన్ సింగ్ సాయం తీసుకున్నారు. అతను ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఫలితం... ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు. కానీ గ్రామాలను ధ్వంసమైపోయాయి. దీంతో ఝుండా సింగ్ పారిపోక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతడు బ్రిటిష్ వారి చేతిలోనే హతమయ్యాడు.
కానీ హింస అక్కడితో ఆగలేదు. ఝండాసింగ్ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు తొమ్మిది మందిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడమే కాకుండా.. వారికి మరణదండన కూడా విధించారు. 1857 దసరా రోజున ఆ తొమ్మిది మందిని ఉరితీశారు. ఆ వీరుల పేర్లు రామ్ సహాయ్, ఘసితా సింగ్, రమణ్ సింగ్, హర్జాస్ సింగ్, హిమ్మత్ సింగ్, కధేరా సింగ్, శిబ్బా సింగ్, బైరామ్, దర్బాసింగ్ తదితరులు. ఈ తొమ్మిదిమంది జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన మర్రి చెట్టు కింద సమాధులు నిర్మించారు గ్రామస్తులు.
ఏటా దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు. ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు దాదాపు 156 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం కోసం పాటుపడి, ఆ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ మౌనం పాటిస్తున్న ఆ గ్రామ ప్రజలు నిజంగా వందనీయులు. ఆ గ్రామ ప్రజలకు దేశం పట్ల, స్వతంత్రం కోసం ప్రాణాలొదిలిని అమరవీరుల యందు కనబరుస్తున్న గౌరవానికి, ప్రేమకు ఫిదా కావల్సిందే కదూ.
(చదవండి: ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment