
తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీలకు చెందిన అచ్చెన్నాయుడిని చేశామని టీడీపీ గొప్పలు చెప్పుకొంటోంది. మరి, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలో, పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పేరు, ప్రమేయం ఎక్కడా కనబడకపోవడం విచిత్రం. బీసీ తదితర పీడిత కులాలకు చెందిన వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నా ఆధిపత్య కుల పార్టీల నాయకుల వ్యవహారశైలి ఎలా ఉంటుందో, బహుజన వర్గాల వ్యక్తుల పదవులు ఎంతటి డొల్ల పదవులో చంద్రబాబు తాజా ప్రకటన బహిర్గతం చేస్తోంది.
‘గులాంగిరీ’కి అలవాటు పడిపోయిన అచ్చెన్నాయుడు ఉలకడు, పలకడు. మరిప్పుడూ ‘డూడూ బసవన్న’లాగే తల ఊపుతాడా? అణచబడ్డ కులాల యెడల ఆధిపత్య కులాల పార్టీల నాయకులు ఒలకపోసే ప్రేమలూ, అభిమానాలూ, పొగడ్తలూ, లేదా, విదిలించే పదవులూ, రాయితీలూ–అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో అంతర్భాగమే. కనుక బహుజనులు డొల్ల పదవులూ, తాత్కాలిక రాయి తీలతో సంతోషించకుండా, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన దిశగా సాగిపోవాలి.
వై. కె., సామాజిక న్యాయ కేంద్రం, రాష్ట్ర కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టీస్
మొబైల్ : 98498 56568