![Sakshi Guest Column On TTD Srivari Laddu](/styles/webp/s3/article_images/2024/09/25/laddu%5D.jpg.webp?itok=VeCGC8rr)
అభిప్రాయం
అబద్ధం ఆడదల్చుకున్నవాడికి జ్ఞాపకశక్తి దండిగా ఉండాలి. ఆ పనే ఒక ముఠాగా చేయదల్చుకుంటే జ్ఞాపకశక్తితోపాటు ఆ ముఠా సభ్యుల మధ్య సమన్వయం ఉండాలి. అదేమీ లేక పోబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రిగా ఉంటున్న బాబు తనయుడు లోకేశ్ తామే సృష్టించిన ‘కల్తీ నెయ్యి’ ఊబిలో చిక్కుకుని బయటపడే మార్గం తోచక అర్థరహితంగా మాట్లాడుతున్నారు. వీరికి టీటీడీ ఈఓ శ్యామలరావు తోడయ్యారు. కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చి రెండు నెలలు దాటిందన్నవారు అంత వరకూ దర్యాప్తు జోలికి ఎందుకు పోలేదు? పోనీ బయట పెట్టాకైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా ఆ పని ఎందుకు చేయటం లేదు?
మళ్లీ 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ బాబు మొదట్లో చెప్పినప్పుడు అందరూ అయోమయంలో పడ్డారు. తానే సీఎం కదా... ఇక పడగొట్టడానికి ఎవరున్నారని ప్రశ్నించుకున్నారు. కానీ ఈ వ్యవహారం చూస్తుంటే ఆయన దేవదేవుడికే వెన్నుపోటు పొడవదల్చుకున్నారన్న సంశయం కలుగుతోంది. కానీ రోజులు మారాయి.
24 గంటల చానెళ్లతోపాటు సోషల్ మీడియా ప్రవేశించటంతో నోటి వెంబడి మాట రావటం తడవు తాటాకులు కట్టేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల ముందు చెప్పిందేమిటి... ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటని వీడియోల సాక్షిగా అడుగుతున్నారు. కొందరైతే వెనక్కి వెనక్కి పోయి మరీ పాత వీడియోలతో వాతలు పెడుతున్నారు.
‘తన కుట్రలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయగల నేర్పరి చంద్రబాబు. కనుక పాలించే యోగ్యత ఆయ నకు మాత్రమే ఉంటుంది’ అని ప్రఖ్యాత రచయిత కేఎన్‌వై పతంజలి ఒకప్పుడు వ్యంగ్యంగా అన్నారు. ఎటొచ్చీ కలియుగ దైవం ముందు బాబు ఎత్తులు పని కొచ్చినట్టు లేదు. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా సరే... జాతీయ మీడియా సైతం నెయ్యి వివాదంలో మౌలిక ప్రశ్నలు వేసుకోకుండా, కనీసం తమ రిపోర్టర్లను నలుదిక్కులకూ పంపి నిర్ధారణ చేసుకోకుండా డిబేట్లు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నెయ్యిని స్వీకరించటానికి టీటీడీ ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తున్నదో, కల్తీ ఉందని తేలినపక్షంలో ఏం చేస్తున్నారో వారిలో ఎవరూ తెలుసుకోలేదు. 2014–19 మధ్య 14 సార్లు, 2019– 2024 మధ్య 18 సార్లు వెనక్కి పంపినప్పుడు ఇప్పటి మాదిరే టెస్టింగ్ ల్యాబరేటరీలకు పంపారా అని అడగ లేదు. అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి... వాటిని తిప్పి పంపారా, లడ్డూలో వాడటానికి కొండపై గల గోడౌన్‌కు పంపారా అని ఆరా తీయలేదు.
పొరుగు నున్న మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ టెస్టింగ్ ల్యాబరేటరీ లేదా హైదరాబాద్‌లోని గుర్తింపు పొందిన మరో ల్యాబ్‌నూ కాదని ఎక్కడో గుజరాత్‌లో ఉన్న ఎన్‌డీడీబీకి టీటీడీ ఎందుకు పంపవలసి వచ్చిందని ప్రశ్నించలేదు. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని చెప్పే దుస్సాహ సానికి చంద్రబాబు పూనుకోగా, ఈవో శ్యామలరావు ‘అబ్బబ్బే... అదేం లేద’ని తాజాగా తేల్చారు. ఇందులో ఎవరిది నిజం?
బీజేపీ మడత రాజకీయం
ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టో చేతితో కూడా తాకకుండానే పోటీ చేసిన సీట్లన్నీ బీజేపీ జోలెలో పడ్డాయి. ప్రభుత్వంలో కూడా చేరి కులాసాగా రోజులు వెళ్ల దీస్తున్న బీజేపీ ఈ వివాదంలో యథాశక్తి బహుళ పాత్రాభినయం చేస్తున్న వైనం కనబడుతోంది. తిరు పతితో మొదలుపెట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న బీజేపీ నాయకులు తలో మాటా మాట్లాడుతున్నారు. వీళ్లె వరూ అసలు న్యాయవిచారణ లేదా సీబీఐ దర్యాప్తు కావాలని కేంద్రాన్ని అడగటం లేదు. చంద్రబాబునూ అడగరు.
సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ గురించి కొత్తగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో మాట్లాడు తున్న పవన్‌ది సైతం ఇదే బాణీ. ఈ రంకెలెందుకు... లడ్డూ కల్తీ జరిగివుంటే తగిన విచారణ జరిపించి బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించవచ్చు కదా అని నటుడు ప్రకాశ్‌రాజ్ అడిగినందుకు పవన్‌కు రోషం పొడుచుకొచ్చింది. విచారణ సంగతి విడిచిపెట్టి ‘మాకు బాధ వుండదా... మేం గొంతెత్త కూడదా’ అంటూ విరుచుకు పడుతున్నారు.
అసందర్భంగా వేరే మతాలను కూడా గౌరవిస్తానని, విరాళాలిస్తానని ఆయన చెబు తున్నారు. ఇదంతా ఎవరిక్కావాలి? హిందు వును అంటు న్నావు గనుక, దానికోసమే తపించి పోతున్నానని మాట్లాడుతున్నావు గనుక, ప్రభుత్వం మీది గనుక అందరూ అడుగుతున్నట్టు సీబీఐతో దర్యాప్తు చేయించాలి. ప్రకాశ్‌రాజే కాదు, ప్రజలంతా దాన్నే కోరుతున్నారు. బాధ్యులైన సిబ్బందినీ, వారి వెనకున్న నాయకులనూ గుర్తించి కేసులు పెట్టాలి. దాన్ని మరిచి ఇంత కాకిగోల అవసరమా? జనాన్ని వెల్లువలా రావాలని చెప్తున్న మీరు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
అధికారం రాకముందే ఆరోగ్యశ్రీ నుంచి క్రిటికల్ కేర్‌తో పాటు కొన్ని వ్యాధుల చికిత్సలను తొలగించిన బాబు ఇప్పుడు మెడికల్ విద్యను అంగట్లో సరుకుగా మారుస్తున్నారు. హత్యలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు కూడా అధికారం చేతికి రాకముందునుంచే మొదల య్యాయి. సూపర్ సిక్స్ హామీలన్నీ మరిచినట్టే ప్రవర్తి స్తున్నారు. బడిచదువులు చట్టుబండలయ్యాయి.
బుడమేరు, ఏలేరు వరదల పాపం ప్రభుత్వానిదేనని ప్రజలకు అర్థమైంది. విశాఖ ఉక్కులో రెండు ఫర్నేస్‌లను పూర్తిగా నిలిపివేసి, ఉత్పత్తి తగ్గేలా చేసి... నష్టాలు ఎందుకొస్తు న్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ సూక్తులు వల్లిస్తు న్నారు. ఈవీఎంల బండారం బయటపడినా దాన్ని గురించి నోరెత్తరు. తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని గమనించి ఈ వివాదం రేకెత్తించి దృష్టి మరలించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ ఒకటి గ్రహించాలి. టీడీపీని హైజాక్ చేసి, అధికారాన్ని గుంజుకోవటంతో చంద్రబాబు అధికార ప్రస్థానం మొదలైంది. కనుక ఆయన ప్రతిష్ఠకు ఇప్పుడు కొత్తగా భంగం వాటిల్లేదేమీ లేదు. ఎటొచ్చీ బీజేపీకే ఇది ప్రాణాంతకమవుతుంది. దుర్బుద్ధితో సెంటిమెంట్లు రెచ్చ గొట్టాలని చూస్తే భక్తకోటి క్షమించదు.
తెంపల్లె వేణుగోపాలరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు
venujourno@gmail.com
Comments
Please login to add a commentAdd a comment