సంకెళ్లు వేయకుంటే సంకటమే! | Dileep Reddy Guest Column On Second Wave Of Corona | Sakshi
Sakshi News home page

సంకెళ్లు వేయకుంటే సంకటమే!

Published Fri, Nov 6 2020 1:07 AM | Last Updated on Fri, Nov 6 2020 1:07 AM

Dileep Reddy Guest Column On Second Wave Of Corona - Sakshi

దేశంలో పలుచోట్ల కోవిడ్‌ రెండో విజృంభణ (సెకండ్‌ వేవ్‌) గురించి మాట్లాడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీ మూడో విజృంభణ గురించి కలవరపడుతోంది. అదీ శీతాకాలం మొదల య్యాక! అందుకే, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఈ మూడు మాసాల కాలం వాయుకాలుష్యపు విషకౌగిట్లో బందీ అయి ఢిల్లీ తల్లడిల్లడం మనం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఈసారి, కోవిడ్‌–19 తోడవడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లూ తెగ వైరస్‌లు చలి వాతావరణంలో విజృంభించడం సహజం. కరోనా కూడా అంతే! మళ్లీ పెరిగి రోజూ అయిదువేలకు పైగా కరోనా కొత్త కేసులు ఢిల్లీలో తాజాగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఈ సమ యంలోనే ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి పంట అవశేషాలు పొలాల్లో తగులబెట్టడంతో వచ్చే పొగమేఘాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తుం టాయి. తగులబెట్టడాలపై నిషేధం విధించినా ఆగటం లేదు. వారంలో రానున్న ధీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల పుట్టే విష కాలుష్యం అదనం.

అప్పుడు, అన్నీ కలిసి ఓ పెద్ద ‘గ్యాస్‌ చాంబర్‌’గా మారే ఢిల్లీలో సగటు మనిషి జీవనం దుర్భరంగా తయార వుతుంది. దేశాన్ని పరిపాలించే, పాలనను పర్యవేక్షించే, న్యాయ వ్యవస్థను నడిపించే.. ఇలా ఎన్నో రకాల ముఖ్యులు, అతి ముఖ్యు లుండే ఢిల్లీ పరిస్థితి ఏయేటికాయేడు దయనీయంగా మారుతోంది. ‘‘నాకు ఊపిరాడట్లేదు...!’’ అని దేశ రాజధాని గొంతెత్తి రోదించే పరి స్థితి. ఈ వాయుకాలుష్యపు సమస్య ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. ఢిల్లీ పరిసరాలతో పాటు ప్రధాన మెట్రో నగరాలకు క్రమంగా విస్తరి స్తోంది. గాలి నాణ్యతా సూచి (ఎక్యూఐ) ఈ రోజు, గురువారం లెక్కలు ఢిల్లీ (450, పీఎం10) లో ప్రమాదకరంగా ఉంటే, తర్వాత అధ్వానంగా నవీ ముంబయ్‌ (206, పీఎం2.5), ఓ మోస్తరుగా హైద రాబాద్‌ (150, పీఎం2.5–పీఎం10)లో నమోదయ్యాయి. బెంగళూరు (73, పీఎం10), చెన్నై (59, పీఎం2.5) పరవాలేదనిపించాయి. బాగ్‌ పాట్‌ (464), నొయిడా (457), గుర్‌గావ్‌ (443), ఆగ్రా (373)లలో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉంది. సత్వరం దీనికి విరుగుడు చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు చెయిదాటిపోయే ప్రమాద ముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతను అంగీకరించడం, కారణాలు గుర్తించడం, చిత్తశుద్ధితో పరిష్కారాలకు యత్నించడం ముఖ్యం.

నగరీకరణ అతిపెద్ద సవాల్‌
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పట్టణాలు, నగరాలు జనసమ్మ ర్ధంగా మారటం ప్రపంచమంతటా జఠిలమవుతున్న పర్యావరణ సమస్య. కిందటేడు లెక్కల ప్రకారం 55 శాతం ప్రపంచ జనాభా పట్టణాలు, నగరాల్లో ఉంది. 2050 నాటికి, ఇది మూడింట రెండొం తులకు చేరనుంది. 80 శాతం స్థూల జాతీయోత్పత్తి నగరాల నుంచే వస్తోంది. భారత్‌లో కూడా మూడింట రెండొంతుల స్థూల జాతీయో త్పత్తి నగరాలు, పట్టణాల నుంచేనని అధికారిక గణాంకాలు చెబుతు న్నాయి. ప్రణాళిక–నియంత్రణ లోపం, పౌర సదుపాయాలు జనా భాకు సరితూగేలా లేకపోవడం వల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతు న్నాయి. అతి ఎక్కువ జనాభా కలిగిన 20 ప్రపంచ నగరాల్లో అత్య ధికం భారత్, చైనా, జపాన్‌ వంటి ఆసియా దేశాల్లోనే ఉన్నాయి. ఢిల్లీ కన్నా ఎక్కువ జనాభా ఈ భూమ్మీద ఒక టోక్యో లోనే ఉంది. బీజింగ్, షాంఘై, ఒసాకా, కైరో, ముంబై వంటివన్నీ ఆ తర్వాతే! అధిక జనసాంద్రత, నిరంతర నిర్మాణపు పనులు, రోడ్ల విస్తరణ, వాహనాలు వదిలే వ్యర్థాలు, ఔషధ ఇతర పరిశ్రమలు, వస్తోత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే వాయువుల వల్ల గాలి కాలుష్యం అసాధారణమై ఊపిరా డటం లేదు.

ఢిల్లీలో ఇది మరింత ఎక్కువ. శీతాకాలం, సాయం సమ యాల్లో పౌరులు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టమవుతోంది.  ప్రమా ణాలకు మించి వాయుకాలుష్యపు స్థాయి హెచ్చినపుడు శాస్వసంబం ధమైన వ్యాధులు పెరుగుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి జబ్బులున్న వారికది నరకప్రాయమే! కాలుష్యం ముఖ్యంగా కోవిడ్‌– 19 వైరస్‌ వ్యాప్తిలోనే కాకుండా ప్రతికూల ప్రభావంతో ఆరోగ్య సమస్యల్ని జఠిలం చేస్తోంది. ఢిల్లీ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాయు కాలుష్యం వల్ల పలు జబ్బులు పెరగటమే కాకుండా మను షుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతోంది. శ్వాసలో స్వచ్చమైన గాలి– ఆక్సిజన్‌ తగినంత లభించక కోవిడ్‌ రోగులు కోలుకునే అవకాశాలూ మందగిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్‌ మన దేశంలో ఈ సంవత్సరం జనవరి చివర్లో వచ్చినందున శీతాకాలంలో అది చూపే ప్రభావం గురించి అంచనా దొరకటం లేదు. ఐరోపా దేశాలు, అమెరికాలో రెండో విజృంభణ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని, మనం జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు, పాలకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాల్లో మొదటి పీక్‌ (మార్చి)తో పోల్చి చూస్తే రెండో విజృంభణలో కేసులు సంఖ్య మూడింతలు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) తాజాగా వెల్లడించింది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా కేవల శ్వాసకోశ సంబంధ ఇబ్బందులే! కానీ, కరోనా శ్వాస ఇబ్బందులతో పాటు రక్తం గడ్డకట్టడం, గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి తీవ్ర నష్టాలు కలిగిస్తోంది. శీతాకాలంలో శ్రద్ధతీసుకోవాలని, మెట్రోల్లో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులంటున్నారు.

ఆర్డినెన్స్‌ రూపంలో కొత్త చట్టం
ఢిల్లీలో గాలి స్వచ్ఛత–నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త అత్యయిక ఉత్తర్వు (ఆర్డినెన్స్‌) తెచ్చింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీయార్‌)లో వాయుకాలుష్య కారకులయ్యే పరిశ్రమలు, ఇతర ఉత్పత్తి–సేవా సంస్థలకు నీరు, విద్యుత్తు సరఫ రాను నియంత్రించే, నిలువరించే అధికారాలు కల్పిస్తూ ఒక కమిషన్‌ ఏర్పాటు ఈ అత్యయిక ఉత్తర్వు వెనుక ఉద్దేశం. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులుంటారు. వారిలో కార్యదర్శితో పాటు ముఖ్య మైన 8 శాఖలకు చెందిన ఉన్నతాధికారులుంటారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌–1973 కింద లభించిన వెసులుబాటుతో ఈ కమిషన్, కాలుష్య కారకులయిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా అయిదేళ్ల జైలు శిక్ష విధించే అధికారాలు కలిగి ఉంటుంది. నిజానికి రెండు దశాబ్దాల కిందటే, 1998లో, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ (ఈపీసీఏ)– చట్టమొకటి తెచ్చారు.

కోరలు లేక పెద్ద ప్రభావం చూపలేకపోయింది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం వల్ల వచ్చే వ్యర్థ వాయువులతోనూ గాలి కాలుష్యమౌతోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి దీపావళి టపాసులు కాల్చకూడదని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు ఢిల్లీ పొరుగునున్న హర్యానా, రాజ స్తాన్‌లలో ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మీరేం చేస్తున్నారో చెప్పండని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అడిగింది. ఢిల్లీ పొరుగునున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ (పశ్చిమ ప్రాంతం) రాష్ట్రాల్లో పంట అవశేషాల్ని పొలాల్లో తగులబెట్డం వల్ల ఢిల్లీ పైకి వచ్చే పొగ, పొగ మేఘాల నియంత్రణపై సుప్రీంకోర్టు, ఎన్జీటీలు పలుమార్లు నిర్దిష్ట ఆదేశాలిచ్చాయి. ఆదిత్య దూబే–భారత ప్రభుత్వం మధ్య నడిచిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసి, ఈ సమస్య పరిష్కారం చూడమంది. జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలో ఏర్పరచిన ఈ కమిషన్‌ పలు సూచనలు చేసింది. ఇప్పుడీ కమిషన్‌ రద్దయి, దాని స్థానే అత్యయిక ఉత్తర్వుతో ఏర్పడ్డ తాజా కమిషన్‌ ఇకపై ఈ బాధ్యత నిర్వహిస్తుంది.

ఒక్క దెబ్బతో రెండు పిట్టలు
ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల వరిపంట నూర్పిళ్లయ్యాక పొలంలో మిగిలిన (కుదుళ్లు) గడ్డి అవశేషాల్ని రైతులు తగులపెడతారు. మను షులే అయితే వరి కుదుళ్లను నేలకు దగ్గరగా కోస్తారు. మరు పంటకు పొలం దున్నినపుడు అవి మట్టిలో కలిసి, ఎరువవుతాయి. 1980లకు ముందు ఇదే జరిగేది. కానీ, యంత్రాల ద్వారా నూర్పిళ్లు జరిపినపుడు అది వరి కుదుళ్లను నేల నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల మేర వదిలి కోస్తుంది. బాస్మతి అయితే తప్ప ఆ మిగులు పశుగ్రాసంగా కూడా పనికి రాదు. దాన్ని మరో మారు కోయడం రైతుకు అదనపు ఖర్చు. వ్యయభారం తప్పించుకునేందుకు వాటిని తగులబెడతారు. ఇలా కాల్చడం వల్ల నైట్రోజన్‌ ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్‌ గాల్లో కలిసి, తీవ్ర వాయుకాలుష్యానికి కారణమౌతోంది. అదొక పొగమేఘమై ఢిల్లీ వరకు విస్తరిస్తోంది. ఇంధన పరిశోధన సంస్థ (టీఈఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం డబ్లుహెచ్‌వో అనుమతించిన కాలుష్యపరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని  కలిగిస్తోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, గడ్డి కాల్చడంతో అరవై రోజులపాటు వెలువడే ఈ కాలుష్యాలు, ఏడాది పాటు ఢిల్లీలో అన్ని వాహనాలు వెలువరించే కాలుష్యం కన్నా నాలుగయిదు రెట్లు అధికం! తామలా పంట అవశేషాలు కాల్చడం పర్యావరణ పరంగా ప్రమాదకరమని, ప్రభుత్వం నిషేధించిన తర్వాత అలా చేయడం భారత శిక్షాస్మృతి (సెక్షన్‌ 188) కింద నేరమని పాపం రైతులకు తెలియదు.

వాయు (కాలుష్య నియంత్రణ) చట్టం–1981 కింద కూడా ఇది నేరమే! రైతుల్లో అవగాహన పెంచాలి. భారత పరి శ్రమల సమాఖ్య (సీఐఐ) చొరవతో పంజాబ్‌లో 2018లో 19 గ్రామాల్లో, మరుసటేడు 105 గ్రామాల్లో చేసిన ప్రత్యామ్నాయ చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. 1.83 లక్షల టన్నుల గడ్డిని కాల్చకుండా నిరోధించ గలిగారు. దీన్ని ప్రభావిత ఇతర రాష్ట్రాలన్నింటికీ విస్తరిం చాలి. అవగాహన పెంచి రైతల్ని సమాయత్తపరచాలి. వరికోత యంత్రాల్ని ఆధునీకరించడం, పంట అవశేషాల్ని మట్టిలోనే కలిపి ఎరువుగా మార్చడం వంటివి సత్ఫలితాలిస్తాయి. ఢిల్లీ కాలుష్యపీడ తొలగడమే కాకుండా రైతుల భూసారం పెరుగుతుంది. సహజంగా పంటకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మట్టిపై మంటల్లేక జీవవైవిధ్య రక్షణ జరుగుతుంది. భూగర్బజల మట్టాలూ పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యామ్నాయ చర్యలకు... ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్లు, స్వచ్ఛంద–పౌర సమాజ సంస్థలు, రైతులు సంఘటితం కావాలి. సంబంధీకులంతా చేయి చేయి కలిపితేనే.... వాయు కాలుష్యభూతం కట్టడి సాధ్యం.

-దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement