చట్టానికి అనుగుణంగా ప్రజాభిప్రాయం ఉండాలని లేదు. ‘హత్యాచార’ ఘటనలు జరిగినప్పుడు బాధితుల ఆవేదన లాంటి కారణాలతో కొన్ని సందర్భాలలో ఇన్‌స్టంట్ జస్టిస్ అందించడం కోసం పోలీసులు కొన్ని చర్యలు చేపడుతున్నారు. అవి వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితపక్షానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. చట్టానికీ, ప్రజాభిప్రాయానికీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలి. గతంలో లైంగికదాడుల సందర్భాల్లో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున స్పందించేవారు. కానీ ఇప్పుడు వాటిని రాజకీయం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సమాజంలో జరిగే వైపరీత్యంగా కాకుండా, అదేదో ప్రభుత్వమే దగ్గరుండి చేయించినట్లుగా ఆరోపించడం వాటి దివాళాకోరుతనం.
తెలంగాణలో ‘దిశ’ అనే యువతిపై జరిగిన దారుణ ‘హత్యాచారానికి’ సంబంధించి పోలీ సులు అప్పట్లో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. నింది తులు ఎదురుదాడి చేస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్ జరగ్గానే పోలీసులకు అభినందనల వెల్లువ వచ్చింది. పోలీసు అధికారులపై జనం పూల వర్షం కురిపించారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్న దంటే, ఆనాడు ఉన్న ప్రజల మూడ్ అది అని చెప్పడానికి. ‘దిశ’ కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరి ఏకంగా ఒక రిటైర్డ్ జస్టిస్ సిర్పూర్కర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ నివేదిక సంచలనంగా మారింది. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయా లని సిఫారసు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
ఈ కమిషన్ నివేదికను తరచి చూస్తే, ఎన్‌కౌంటర్ బూటకపుదే అన్న విషయం ఇట్టే అర్థం అవుతుంది. పోలీసులు తమ సాక్ష్యాలలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆయా క్రాస్ ఎగ్జామినేషన్లలో తేలికగా దొరికి పోవడం కనిపిస్తుంది. ఈ కేసు వ్యవహారం ఇంతవరకు వస్తుందని పోలీసులు అనుకుని ఉండకపోవచ్చు. పోలీసులే ఇలా తీర్పులు ఇచ్చేస్తే, కోర్టులు ఎందుకు? విచారణలు ఎందుకు? పోలీ సులు ఈ ఒక్క ఎన్‌కౌంటర్‌తోనే ఆపుతారా? వారు ఎవరిపైన అయినా కక్ష పూనితే ఇలాగే ఎన్‌కౌంటర్ చేస్తే ఏమిటి పరిస్థితి అన్న ప్రశ్న కూడా సహజంగానే తలెత్తింది.
ఢిల్లీలో ‘నిర్భయ’ అనే యువతిని దారుణంగా కదిలే బస్సులో హింసించి అత్యాచారం చేసిన ఘటన దేశం అంతటినీ కుదిపివేసింది. అప్పటికప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తెచ్చింది. అయినా ఢిల్లీలో ఆ తర్వాత కూడా అనేక లైంగిక దాడి నేరాలు జరిగాయి. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కొన్ని ఘటనలు మొత్తం సమాజాన్ని కలవరపెట్టాయి. అక్కడ కూడా కొందరు ఎన్‌కౌంటర్ అయ్యారని చెబుతారు.
ఎన్‌కౌంటర్లు ప్రధానంగా నక్సల్స్ హింసాకాండను అదుపు చేసే సందర్భంలో వ్యాప్తిలోకి వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1960వ దశకంలో నక్సలైట్లను అణచివేయడానికి జలగం వెంగళరావును హోం మంత్రిగా నియమించారని అనేవారు. ఆ తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నక్సల్‌బరీ ఉద్యమంలో శ్రీకాకుళం తదితర జిల్లాలలో పలువురు షావుకార్లను హతమార్చేవారు. ఒక గ్రామంలో అయితే ఒక వ్యాపారి తలను నరికి గ్రామ నడిబొడ్డున వేలాడదీసి భయానక వాతావరణం సృష్టించారు. గిరిజనులను దోపిడీ చేస్తున్నా రన్నది వారిపై ప్రధాన అభియోగం. నక్సల్స్ ఉద్య మంలో హింస పెరిగేకొద్దీ ఆ ఉద్యమం బలహీనపడుతూ వచ్చిందని చెప్పాలి.
ఈ ఎన్‌కౌంటర్‌లపై 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఒక కమిషన్‌ను కూడా వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కాలంలో కూడా నక్సల్స్ దాడులు, పోలీస్ ఎన్‌కౌంటర్లతో ఉమ్మడి ఏపీలోని కొన్ని జిల్లాలు అట్టుడికి పోతుండేవి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్‌కౌంట ర్లలో పలువురు నక్సలైట్ నేతలు మరణించారు. బెంగళూరు నుంచి నలుగురు నక్సల్ నేతలను పట్టుకొచ్చి, జగిత్యాల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేశారన్న ఆరోపణ అప్పట్లో వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ, ఒడిషా, ఏపీ సరిహద్దులలోనూ కొన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి.
అంతకుముందు గద్దర్‌పై కొందరు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఆయన బతికి బయటపడ్డారు. ఇది పోలీసుల పనే నన్న ఆరోపణలు వచ్చాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తిరుమల అడవులలో ఇరవైమంది తమిళకూలీలు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఆ కేసులో ఎందువల్ల న్యాయవ్యవస్థ ఇంత తీవ్రంగా స్పందించలేదో తెలియదు.
ఇదంతా చరిత్ర. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి ఇలాంటి సీరియస్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఇంతకుముందు నయీమ్‌ను కూడా తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ప్రజల నైతిక మద్దతు లభించిందనే చెప్పాలి. దిశ హత్య తర్వాత ఏపీలో దిశ చట్టం తేవడంతో పాటు దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. దిశ యాప్‌ను మహిళలు కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపవలసి ఉంది. అందులో ఇరవై ఒక్క రోజులలో నిందితులకు శిక్షలు పడాలి లాంటి నిబంధనలు పెట్టారు.
ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అక్కడక్కడా లైంగిక దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఆ మాటకు వస్తే ప్రపంచలోని అన్ని దేశాలలోనూ ఇలాంటివి ఉన్నాయి. రామాయణంలో రావణుడు ఒంటరిగా ఉన్న సీతమ్మవారిని అపహరించుకుపోవడం, భారతంలో ద్రౌపదిని భర్తల ముందే వస్త్రాప హరణ చేసి అవమానించడం, జరాసంధుడు వంటివారు ఇతర మహి ళలపై ఆకర్షణ పెంచుకుని, చివరికి మృత్యువు పాలవడం వంటివి అందరికీ తెలిసినవే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు ఇలాంటి దాడులకు గురి అవుతూనే ఉన్నారు. అయితే మన దేశంలో ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడానికి ఆయా పార్టీలు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఇది సమాజంలో జరిగే వైపరీత్యంగా కాకుండా, అదేదో ప్రభుత్వమే దగ్గరుండి చేయించినట్లుగా ప్రతి పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఏపీలో అయితే ఇది మరీ శృతి మించి రాగాన పడినట్లుగా ప్రతిపక్షం, దానికి మద్దతు ఇచ్చే మీడియా విపరీత ప్రచారం చేస్తుంటాయి. స్త్రీలపై అవాకులు చవాకులు పేలేవారు కూడా మహిళోద్ధారకుల్లా మాట్లాడుతుంటారు.
గతంలో లైంగికదాడి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వపరంగా ఏవైనా లోపాలు ఉంటే, లేదా పోలీసుల పాత్ర ఉందని అభియోగం వస్తే ప్రజలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున స్పందించేవారు. ఉదాహరణకు 1978 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఒక పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ అమానుషానికి గురైనప్పుడు ఏపీ అంతా అట్టుడికిపోయింది. పలు చోట్ల కర్ఫ్యూలు కూడా పెట్టవలసి వచ్చింది. కానీ ఇప్పుడు రాజకీయం పులిమి ప్రత్యర్థులను బదనాం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దానితో బాధితురాలికి న్యాయం జరగడం కష్టంగా మారుతోంది. నలభై ఏళ్ల సీనియర్ నేతగా ఉన్న ఒకాయన లైంగికదాడి బాధితురాలి వద్దకు వందమంది అను చరులను వెంటేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. వ్యక్తిగత నేరాలు వేరు. సమాజం లేదా ప్రభుత్వపరంగా జరిగే నేరాలు వేరు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. కానీ తమ రాజకీయ లబ్ధి కోసం అన్నిటినీ కలగాపులగం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్ర యంతో మన నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్ల సమాజానికి నష్టం జరుగుతోంది.
ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే– చట్టం వేరు, ప్రజాభిప్రాయం వేరు. ఈ రెండింటికీ మధ్య సమన్వయం చేసుకుంటూ పోలీస్ వ్యవస్థ లేదా ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే సమస్యలను కొని తెచ్చుకు న్నట్లవుతుంది. అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే. అదే సమయంలో ఇన్‌స్టంట్ జస్టిస్ పేరుతో ఎన్ కౌంటర్లు చేసుకుంటూ పోతే దానికి అంతం ఉండదన్న వాస్తవాన్ని కూడా గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పాలి.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment