లక్షద్వీప్ ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చిన ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవే, ఇతర సివిల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. డామన్ డయ్యూ ప్రాంతంలో అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాంతంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ద్వీపప్రాంతంలో ప్రపుల్ నిర్వాకానికి పర్యవసానాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన అయిదు నెలల తర్వాత బంగ్రామ్ ప్రాంతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పర్యావరణ టూరిజాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి పాలనాయంత్రాంగం సమాధానమివ్వాల్సి వచ్చింది. అయిదు ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఒక వారం రోజుల తర్వాత రెండో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని లక్షద్వీప్ యంత్రాంగం వాగ్దానం చేయడంతో తొలి సమావేశం రద్దయిపోయింది. మే 24న సాయంత్రం 5 గంట లకు ప్రతిపాదిత రెండో సమావేశం కూడా నిర్వహించారు. దీనికి చాలామందే హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఒక హోటల్ పరిశ్రమకు చెందిన వ్యక్తి ప్రకారం, ఈ భేటీకి 16 పార్టీలు హాజరయ్యారని చైర్మన్ హోదాలో లక్షద్వీప్ కలెక్టర్ అక్సర్ ఆలీ పేర్కొన్నారు. అయితే బిడ్ డిజైన్‌పై పాలనాయంత్రాంగంతో భేటీలో పాల్గొన్నవారు విభేదించడంతో ఫలితం లేకుండానే ముగిసిపోయింది.
ఈ బేటీపై అనేకమంది అసమ్మతి వ్యక్తచేశారు. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలంటే ఒక్కొక్క సంస్థ 70 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండాలని షరతుపెట్టారు. అయితే 30 గదుల రిసార్టును నిర్వహించడానికి 70 కోట్ల టర్నోవర్‌ను చూపించవలసిన అవసరం నాకేంటి అంటూ భేటీలో పాల్గొన్నవారిలో ఇద్దరు ప్రశ్నించారు. పైగా బిడ్ డాక్యుమెంట్లలో సైన్ చేసిన ఒప్పందం ముసాయిదా ప్రతిని చేర్చలేదు. ఇలాంటి స్థితిలో మాకు ఎవరు భద్రత కల్పిస్తారనేది మనస్సును తొలుస్తోందని మరొక హోటల్ యజమాని ప్రశ్నించారు. మేం పర్యావరణపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? స్థానికులకు ఉద్యోగాల కల్పన మాటేంటి? మేం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. ఇలాంటి అంశాలను పొందుపర్చకపోతే బిడ్స్‌ని ఎలా సరిపోల్చగలం అని మరొకరు ప్రశ్నించారు.
అయితే కథ ఇంతటితో ముగియలేదు. బిడ్ దాఖలు చేయడానికి కన్సార్టియంలకు అనుమతిస్తూ పొందుపర్చిన నిబంధనను తొలి, రెండో సమావేశాల మధ్యకాలంలో తొలగించారు. ఈ మొత్తం అంశంలో పాలనాయంత్రాంగం ప్రదర్శించిన ఆత్రుత హోటల్ పరిశ్రమదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందుగా లక్షద్వీప్ లోని రిసార్టును తాము చూడాలని కోరుకుంటున్నట్లు బిడ్డర్లు అడిగితే మరో మూడు, నాలుగు రోజుల్లో చూపిస్తామని పాలనా యంత్రాంగం అలసత్వం ప్రదర్శించడం మరీ విశేషం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ కాలంలో పాలనా యంత్రాంగం ఆహ్వానం మేరకు హోటల్ పరిశ్రమదారులు రాలేకపోయారు. తమ సందర్శనను కాస్త పొడిగించాలని కోరారు. కానీ పాలనాయంత్రాంగం తిరస్కరించింది. బంగ్రమ్ దీవి కోవిడ్ బారిన పడలేదని, అతిథులు ఎలాంటి సమస్యలు లేకుండా దాన్ని సందర్శిస్తున్నారని అధికారులు ఒక బిడ్డర్‌కు ఈమెయిల్ సందేశం పంపారు. అదే సమయంలో బంగ్రమ్ రిసార్టును గతంలో నిర్వహించి ఉన్న సీజీహెచ్ ఎర్త్ ఎక్స్‌పీరియన్స్ హోటల్స్ యజమాని ఒకరు రిసార్టును తాను సందర్శిస్తానని కోరితే, అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేదు.
ఆ రిసార్ట్ పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో తెలీకుండానే మేం బిడ్‌లో ఎలా పాల్గొనగలం అని అమృతర చెయిన్ ప్రీమియం రిసార్టులను నిర్వహిస్తున్న గుర్మీత్ సింగ్ ఓబెరాయ్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మేం ప్రస్తావించాం. ఇప్పుడు కరోనా మహమ్మారి విస్తృతంగా ఉంది. మేం ఆ ప్రాంతాన్ని సందర్శించలేం. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అనడిగాం. కానీ మా పర్యటనను వాయిదా వేయడాన్ని వారు పట్టించుకోలేదు. పైగా ముంబై ప్రాంత హోటల్ యజమాని ఒకరు ఆ రిసార్టును ఇప్పటికే ఎవరికైనా ప్రత్యేకించారా అని ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది.
లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు కానీ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లో ఆయన ప్రారంభించిన రెండు ఇన్నింగ్స్‌లు కానీ పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. తన కార్యాలయంలోనే సమస్త అధికారాన్నీ కేంద్రీకరించుకున్నారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవై, ఇతర సివిల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఇకపోతే డామన్ డయ్యూలో ప్రఫుల్ పటేల్ నిర్వాకంపై గుణపాఠాలు మరింత ప్రబలంగా ఉన్నాయి. అసలుకు ప్రఫుల్‌ను ఈ ప్రాంతానికి ఎందుకు పంపించారు అనే అంశంపై పూర్తి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని అక్కడికి పంపించారని కొన్ని మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర కేబినెట్‌లో కనీసం ఒక సీటును కూడా అతడు ఎన్నడూ నిర్వహించలేదన్న వాస్తవాన్ని కొన్ని పత్రికలు బయటపెట్టాయి. దీంతో కేంద్రప్రభుత్వ వర్గాలలో అతనంటే చిన్నచూపు ఏర్పడిపోయిందని, లేకా అతడు చాలా స్వార్థపరుడని, దురాశా జీవి అని, చాలామంది అధికారులు అతడికి దూరంగా జరిగారని గుజరాత్ కేంద్రంగా పనిచేసే ఒక సామాజిక శాస్త్రవేత్త పేర్కొనడం గమనార్హం.
డామన్ డయ్యూ ప్రాంతాన్ని చేరీ చేరగానే ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాం తంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. పటేల్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీఏ సత్య, శివస్సా ప్రాంతంలో వినోబా భావే ఆసుపత్రికి అధిపతిగా ఉన్న వీకే దాస్, స్థానిక అవినీతి వ్యతిరేక బ్యూరోను నిర్వహిస్తున్న ఏయూ జడేజా, సివిల్ కన్‌స్ట్రక్షన్ పనులను పరిశీలించే బీసీ వర్లి, తదితరులు తన చెంత చేరిపోయారు.
చివరకు ఉన్నతాధికారులు సైతం ప్రపుల్ ఆదేశానుసారం వ్యవహరించాల్సి వస్తోందని స్థానిక వ్యాపారవేత్త ఒకరు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంత అధికారులతో పనిచేయడానికి బదులుగా తన సొంత వ్యక్తులతో ఎలా పని చేయించుకుంటున్నారని ప్రముఖ మీడియా సంస్థలు ప్రఫుల్ పటేల్‌ని ప్రశ్నించాయి కానీ ఆయన స్పందించలేదు. మరోవైపున హోటళ్లు, సివిల్ కన్‌స్ట్రక్షన్ వంటి రంగాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. సివిల్ కన్‌స్ట్రక్షన్ రంగాన్ని పరిశీలించినప్పుడు స్థానిక అధికారులు, కార్యకర్తలు అనేక ఆరోపణలు చేశారు.
మొదటగా ఈ వ్యవహారాలతో సంబంధమున్న కొందరు వ్యక్తులు ప్రఫుల్ చేపట్టిన ప్రాజెక్టుల హేతుబద్ధతను ప్రశ్నించారు. కనీసం సైకిల్ తిరగడానికి కూడా తావు లేని చోట నాలుగు లేన్ల ప్రధాన రహదారిని నిర్మించాలని ప్రఫుల్ ప్రతిపాదించారని ఒక ఉన్నతాధికారి ఆరోపించారు. ఈ విషయాన్ని ఎత్తిచూపినప్పటికీ ప్రఫుల్ కనీసం స్పందించలేదు. రెండో విషయం ఏమిటంటే, లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ఉదాహరణకు ఆర్కేసీ ఇన్ఫ్రా బిల్ట్ అనే కంపెనీకి అతి పెద్ద భాగస్వామి ఎవరంటే గోద్రాకు చెందిన కమలేశ్ కుమార్ నవీన్ చంద్ర షా. అనేక పెద్ద సివిల్ కన్‌స్ట్రక్షన్ పనులు ఈ కంపెనీకి వెళ్లిపోయాయని స్థానిక వ్యాపారవేత్త చెప్పారు. ఈయన అభిప్రాయంతో కేంద్రపాలిత ప్రాంత ఉన్నతాధికారి కూడా ఏకీభవించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెండర్లలో అంచనా వేసిన వ్యయానికి 41.87 శాతం, 33 శాతం అధికంగా కోట్ చేసినప్పటికీ ఇదే కంపెనీకి కాంట్రాక్టులు దక్కాయి. వాస్తవానికి 30 శాతం కంటే అధికంగా అంచనా వేసిన టెండర్లను రద్దు చేసి మళ్లీ ఆహ్వానించాల్సి ఉంది. ఇదీ ప్రఫుల్ నేతృత్వంలో లక్షద్వీప్‌లో ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం.
ఎమ్. రాజశేఖర్
– వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
(ది వైర్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment