తెలంగాణ చరిత్రలోనే మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 12 మంది ఎంపీలు, మునుగోడులో తిష్ఠ వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ప్రతి రెండు గ్రామాలకూ ఒక ఎమ్మెల్యేని మోహరించారు. మండలానికి ముగ్గురు మంత్రులను నియమించి భారతీయ జనతా పార్టీ నాయకులను, గ్రామస్థాయిలో ఉండే యువతను టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగి పోతాయనీ, పింఛన్ దారులకు పింఛను రాదనీ, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇన్ని కుయుక్తులతో సాధించినది విజయమేనా? ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 97,006 ఓట్లు తెచ్చుకొని 10,309 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,693 ఓట్లు పొంది టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వణికించారు. కాంగ్రెస్ 23,906 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది.
భారతీయ జనతా పార్టీ తమకు పోటీనే కాదనీ, కాంగ్రెస్సే ప్రత్యర్థి అని ఎన్నోసార్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు; ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ మును గోడులో భారతీయ జనతా పార్టీకి మంచి ప్రజాదరణ కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోలేక ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు’ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయి కంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని సాధించిన విజయమే తప్ప కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి కానీ, ఆయన పరిపాలనా విధానం చూసి గానీ వచ్చింది కాదు.
కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని భావించి... విజయం కోసం తన అంగ బలాన్నీ, అధికార బలాన్నీ ఉపయోగించారు. తాను చీదరించి మనుగడ లేకుండా చేసిన కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టు కున్నారు. అందుకే కనీస మెజారిటీ అన్నా టీఆర్‌ఎస్‌కు దక్కింది. ఈ ఉప ఎన్నిక... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది.
ఓటమి భయంతో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రెండు గ్రామాలను అప్పగించి ఆయా గ్రామాలలో మెజార్టీ చూపిం చకపోతే వచ్చే ఎలక్షన్లలో వారికి సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలిసింది. దీన్నిబట్టి కేసీఆర్ బీజేపీని చూసి ఎంతగా భయపడ్డారో తెలుస్తోంది. ఇంతజేస్తే... మంత్రులు ఇన్‌ఛార్జీలుగా ఉన్న గ్రామాలలో బీజేపీకి టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఆ విధంగా మంత్రులకు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదన్నమాట. కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇన్‌ఛార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఉండి... ప్రతి ఒక్క ఓటరుకూ రూ. 4,000 ఇచ్చినా టీఆర్‌ఎస్‌కు బీజేపీ కన్నా 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి వరుసగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఆరెగూడెం, లింగోజిగూడెం గ్రామాలలో టీఆర్‌ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
భారతీయ జనతా పార్టీ నిజంగా మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో; చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ, అనుకున్నంత మెజారిటీ సాధించలేక పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే భావించిన టీఆర్‌ఎస్ చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలలో 30 వేల పైన ఓట్లు కొత్తగా నమోదు చేయించడం జరిగింది. ఇలా హడావిడిగా ఇన్ని కొత్త ఓట్లు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అవుతుంది అని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రెండు మూడు వేల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలోని నివాసితులవి కాగా, మిగతా ఓట్లన్నీ టీఆర్‌ఎస్ నాయకులు... మునుగోడు పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తల చేత ఓటు కోసం అప్లై చేయించినవే అని చెప్పవచ్చు. ఇదే రకమైన విధానాన్ని కేసీఆర్ పట్టభద్రులకు జరిగిన రెండు శాసనమండలి ఎలక్షన్లలో కూడా ఉపయోగించారు.
అలాగే ఒకటవ తారీఖు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకూ డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి, మద్యాన్ని ఏరులై పారించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభుత్వానికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తనకు తాను జాతీయ నేతగా ప్రకటించుకొని బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ఫామ్‌హౌస్ డ్రామాకు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు టీఆర్‌ఎస్ తెరలేపడం జరిగింది.
అయినప్పటికీ మునుగోడులోని ఓటర్లు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాటకాన్ని నమ్మలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఫామ్ హౌస్ డ్రామా రక్తి కట్టలేదు. ఈ మొత్తం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఒక రూపాయి కూడా పట్టుబడకపోవడం ప్రభుత్వ వ్యవస్థల దుర్వి నియోగానికీ, అధికార యంత్రాంగం టీఆర్‌ఎస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసింది అనడానికీ నిదర్శనం. (క్లిక్ చేయండి: బీఆర్‌ఎస్‌కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చిన అనేక సర్వేలు చూసిన తర్వాత అయోమయానికి గురవు తున్న టీఆర్‌ఎస్ నేతలకు... ఏమి చేయాలో పాలుపోక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం దేనికి అద్దం పడుతుంది? ఈ పనులేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డు కోలేవు. ఇటీవలి కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. అధికారం దిశగా అడుగులు వేస్తోంది.
- ఎన్. రామచందర్ రావు
మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ
Comments
Please login to add a commentAdd a comment