సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం వల్లనే ఇపుడు భారత దేశంలో కొత్త క్రీడా సంస్కృతి వెల్లి విరుస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు కనీసం ఊహించనైనా ఊహించని వినూత్న క్రీడా పథకాలతో దేశంలో క్రీడారంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారి పోయాయి.
సెప్టెంబర్ 29న అహ్మదాబాద్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం – దేశంలో అపూర్వ స్ధాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పాన్ని చాటి చెప్పింది. ఈ ఏడాది జాతీయ క్రీడా పోటీల్లో భారత సాయుధ దళాలకు చెందిన క్రీడాకారులతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 7,000 మంది అథ్లెట్లు 36 రకాల క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.
దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ క్రీడలు జరిగే ప్రతిసారీ ఆయన ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి, వెన్నుతట్టి ప్రోత్స హిస్తారు. గతంలో ఏ ప్రధానమంత్రీ క్రీడాకారుల మనసులపై ఇంత ప్రభావం చూపలేదు. గెలిచినప్పుడే కాకుండా... ఓడిపోయినా మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం మన అంతర్జాతీయ క్రీడాకారులను అబ్బురపరుస్తోంది. ప్రధాని స్వయంగా మాట్లాడడం మనో నిబ్బరాన్ని పెంచుతోందని ఒలింపిక్ బ్యాడ్మింటన్ మెడలిస్టు పీవీ సింధూ చెప్పారు. నైపుణ్యానికి బదులు బంధుప్రీతి, అవినీతీ భారత క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తూ వెనక్కి లాగాయని క్రీడోత్సవాల ఆరంభం సందర్భంగా మోదీ అన్న మాట నూటికి నూరుపాళ్లూ నిజం.
అథ్లెట్ల కోచింగ్, ఆట సామగ్రి, టోర్నమెంట్ల ఖర్చులు, విద్య, పోషకాహారం, పాకెట్ మనీ వంటి అవసరాల్ని చారిత్రాత్మక ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా తీరుస్తుండటంతో – వేలాది మంది క్రీడాకారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) కారణంగా ఒలింపిక్‌లో దేశ విజయావకాశాలు మెరుగు పడుతున్నాయి. స్త్రీ, పురుష హాకీ టీమ్‌లతో పాటు 13 క్రీడాంశాల్లో 104 టాప్స్ కోర్ గ్రూప్ అథ్లెట్లకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తోంది. 2024 పారిస్, 2028 లాస్ ఏంజిలిస్ గేమ్స్ వంటి భారీ క్రీడోత్సవాలకు సన్నద్ధం కావడానికి వీలుగా 12 క్రీడాంశాల్లో మరో 269 టాప్స్ డెవలప్ మెంట్ గ్రూప్ అథ్లెట్లకూ ప్రోత్సాహం అందజేస్తున్నారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు ఖేలో ఇండియా, టాప్స్ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. (క్లిక్ చేయండి: ములాయం ప్రాభవం కొనసాగేనా?)
కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు తెస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం తనవంతు తోడ్పాటు అందజేయకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణ పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వం క్రీడల పట్ల చూపిన నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కనీసం క్రీడా రంగంలోనైనా మోదీ నుంచి కేసీఆర్ స్ఫూర్తి పొందాలి. (క్లిక్ చేయండి: ‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!)
- కిశోర్ పోరెడ్డి
బీజేపీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment