పరిధులు గ్రహిస్తేనే వ్యవస్థలకు ప్రతిష్ట  | R C Lahoti Article On Supreme Court Judgement | Sakshi
Sakshi News home page

పరిధులు గ్రహిస్తేనే వ్యవస్థలకు ప్రతిష్ట 

Published Thu, May 20 2021 12:41 AM | Last Updated on Thu, May 20 2021 12:46 AM

R C Lahoti Article On Supreme Court Judgement - Sakshi

న్యాయమూర్తులకు కూడా పరిమితులు ఉంటాయి. వాటిని గుర్తించడంలోనే వారి బలం ఉంటుంది. కోర్టులు తెలిసి గానీ, తెలియక గానీ చేసే వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన బాధ్యతలకు అవరోధం కలిగించేవిగా ఉండకూడదు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ప్రభుత్వం కన్నా మెరుగైన సమాచారం ఉండే అవకాశం ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. ఏదైనా నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు తప్పితే కోర్టులు తమ సమీక్షలో ప్రభుత్వ విధాన నిర్ణయ ప్రక్రియను ప్రశ్నించేవిగా ఉండకూడదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఏ తరహా గౌరవం, రక్షణ కోరుతుందో అదే తరహా నిగ్రహం, వినయం న్యాయమూర్తులు ప్రదర్శించాలి. హుందాతనానికి మచ్చ రాకుండానే పౌరుల హక్కులను న్యాయ వ్యవస్థ కాపాడాలి.

భారత ఎన్నికల సంఘం కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ రాజ నీతిజ్ఞతకు దర్పణం పడుతోంది. ఇదే అంశంపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం కోవిడ్‌ భద్రతా మార్గదర్శకాలను అమలుపరచడంలో విఫలమయిం దనీ, ఫలితంగా ఆ మహమ్మారి మరింతగా విజృంభించిందనీ వ్యాఖ్యా నించింది. ‘కోవిడ్‌–19 మహమ్మారి విస్తరించడానికి ప్రధాన బాధ్యత ఒక్క ఎన్నికల సంఘం(ఈసీ) మీదనే వేయాల్సి ఉంటుంది’. ‘హత్యా రోపణపై కేసు పెట్టి ఈసీని న్యాయస్థానం ముందు నిలబెట్టాలి’ అని నోటిమాటగా ఆ వ్యాఖ్య చేసింది. దీనిని మీడియా ప్రముఖంగా ప్రచు రించింది. ఆ కేసుపై ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఎవరికీ అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే ఎన్నికల సంఘానికీ, హైకోర్టుకూ మధ్య ఏర్పడిన వివాదాన్ని తెలివిగా తప్పిం చింది. అయితే తాను ఏం చేయాలో సుప్రీంకోర్టు అదే చేసింది.

రికార్డుల్లోకి ఎక్కకపోయినా కోర్టు విచారణ సమయంలో ఏం జరిగిందన్నది ఎలాంటి దాపరికం లేకుండా ప్రచురించే హక్కు మీడి యాకి ఉందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. అదే సమయంలో ఈసీ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ ‘విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు తీర్పులో భాగం గానీ, నిర్ణయానికి కట్టుబడాల్సిన పరిస్థితి గానీ కల్పించవు’ అన్న వ్యాఖ్యానంతో హైకోర్టు నోటిమాటగా చేసిన వ్యాఖ్యల ప్రభావాన్ని కొట్టేసింది.

సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసే విధంగా ఎలాంటి మాటలు లేకుండానే ‘‘హైకోర్టు వ్యాఖ్యలు కఠినంగా ఉన్నాయి. అవి సందర్భో చితంగా లేవు. విచారణ సమయంలో కోర్టులో న్యాయమూర్తులు బహిరంగంగా వ్యాఖ్యలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అవి అపోహలకు తావిస్తాయి. బెంచిలోనూ, తీర్పులోనూ కూడా న్యాయమూర్తులు ఉపయోగించే మాటలు ‘న్యాయవ్యవస్థ గౌరవానికి’ భంగం కలగని రీతిలో ఉండాలి అని స్పష్టం చేసింది. హైకోర్టు ఆచరించే అప్రమత్తత, దాని పరిధి కూడా రాజ్యాంగం ఉటంకించిన న్యాయవ్యవస్థ అధికార స్వభావం, కోణాలపై న్యాయ సమీక్షకు నిలుస్తాయి గనుక, కోర్టు ఔన్నత్యాన్ని నిలబెట్టేవిగా ఉండాలి’’ అని పేర్కొంది. ఇవి న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానాలు ఆక్రమించిన అందరికీ సందేశాత్మకంగా ఉన్నాయి. ‘వ్యాఖ్యలు, అప్ర తిష్టను ఆపాదించే వ్యంగ్యోక్తులు లేదా తీవ్ర విమర్శలు ధ్వనించేలా వ్యాఖ్యానించి న్యాయమూర్తులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు’ అని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

‘బెంచిలో న్యాయమూర్తి పదవి ఒక అధికార స్థానం. న్యాయ వ్యవస్థ సాధారణ నియమావళికి అనుగుణంగా వారు అనుసరించే సంయమనం, క్రమశిక్షణ సైన్యంలోని ప్రభావశీలతను ప్రతిబింబిం చాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఏ తరహా గౌరవం, రక్షణ కోరు తుందో అదే తరహా నిగ్రహం, వినయం న్యాయమూర్తులు ప్రదర్శిం చాలి’ అని జస్టిస్‌ కె.జగన్నాథ శెట్టి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

‘మీరు గుడ్డిగా ఉండవచ్చు, కానీ మేం కాదు’, ‘బిచ్చమెత్తండి, అరువు తెచ్చుకోండి, దొంగిలించండి... కానీ మీరు ఆక్సిజన్‌ తేవా ల్సిందే’ అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నోటిమాటగా వారి న్యాయ వాదితో చేసిన వ్యాఖ్యలు ప్రాచుర్యం పొంది పత్రికల్లో పతాక శీర్షిక లకెక్కాయి. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత, అవసర మైనంతగా మానవ వనరులు, సామగ్రి, సాధన సంపత్తులు కల్పిం చడం ద్వారా ఆరోగ్య సర్వీసులు పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నది అసాధారణ పరిస్థితి అనే విషయం కోర్టులు మరిచిపోకూడదు. ఏదైనా నిర్ణయం రాజ్యాంగవిరుద్ధం, అన్యాయం అయినప్పుడు తప్పితే కోర్టులు తమ సమీక్షలో ప్రభుత్వ విధాన నిర్ణయ ప్రక్రియను పరిశీలించాలి గానీ, నిర్ణయాన్ని ప్రశ్నిం చేవిగా ఉండకూడదని ప్రభుత్వ చర్యలపై న్యాయసమీక్షకు సంబం ధించిన మౌలిక సూత్రాలు తెలియచేస్తున్నాయి. ‘నేనే మీ స్థానంలో ఉంటే ఇదే ఉత్తమ నిర్ణయం అయి ఉండేది’ అనే స్థాయిలో కోర్టులు తమ నిర్ణయాన్ని కార్యనిర్వాహకవర్గంపై రుద్దకూడదు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ప్రభుత్వం కన్నా మెరుగ్గా మీకు సమాచారం ఉన్నదా? సరైన వాస్తవాలను మరింత మెరుగ్గా సేకరించగల వనరులున్నాయా? పరిస్థితి తప్పనిసరి అయితే రాత్రనకా, పగలనకా  వారంలో 7 రోజులూ, రోజులో 24 గంటలూ కూచుని నిమిషానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోగల, దౌత్యం ప్రదర్శించగల, ఆచరణీయమైన వ్యూహం అనుసరిస్తూ కోర్టుల్లో గానీ లేదా చాంబర్లలో (11 నుంచి 5 వరకు) కూచునిగానీ నిరంతర ఆదేశాలు, నిర్దేశాలు చేయగల సమర్థత ఉన్నదా అని కోర్టులు తమకు తామే ప్రశ్నించుకోవాలి.

స్వేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటించగల తరహాలో న్యాయవ్యవస్థ క్రియాశీలత ప్రదర్శించినట్టయితే అది నిరుత్పాదకం కావడమే కాదు, న్యాయశాఖ నిర్వహణకు సంబంధించిన నియమావళిని అనుసరించ డంలో ప్రశంసలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కార్య నిర్వాహక వ్యవస్థను సక్రమంగా పని చేయమని ఆదేశించడం అనేది ‘మీరు చేయలేకపోతే మేమే చేస్తామ’న్నట్టుగా ఉంటుందన్న విషయం మరిచిపోకూడదు.

పాలనా వ్యవస్థలోని మూడు ప్రధానాంగాలు–చట్టవ్యవస్థ, కార్య నిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ–పరస్పర విశ్వాసం కలిగి ఉండాలి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థ క్రియాశీలత లేదా క్రియారాహిత్యాన్ని పరిశీలించే సమయంలో వారికి నిర్దేశించిన హద్దులు దాటి పోయేదిగా ఉండకూడదు. కార్యనిర్వాహక వర్గం తప్పుదారి పడితే లేదా విఫలం అయితే సరైన దారిలో ఉండాలని ఆదేశించి దిద్దుబాటు చేసే అధికారం న్యాయవ్యవస్థకు ఉంటుంది. కోర్టులు కూడా తెలిసిగానీ లేదా తెలి యకగానీ చేసే వ్యాఖ్యలు ప్రభుత్వ బాధ్యతలకు అవరోధం లేకుండా అప్రమత్తత పాటించాలి. ఇందుకు భిన్నంగా వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉన్నట్టయితే తమకు శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా తెలియని శత్రు వుతో నిరంతర పోరాటం సాగిస్తున్న నిజాయితీపరులైన, అధికారు లను నిరుత్సాహపరిచేవిగా మారిపోతాయి. కేంద్రం పరిస్థితికి అను గుణంగా స్పందిస్తూ రాష్ట్రాల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత గల ఫెడరల్‌ వ్యవస్థ మనది. అదే సమయంలో వనరులు పరిమితంగా ఉండి రాష్ట్రాల కోర్కెలు అపరిమితంగా ఉన్నట్టయితే వాటి మధ్య సమ తూకం తేవాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంది.

హుందాతనానికి ఏవిధంగానూ భంగం కలుగని రీతిలో పని చేస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడినట్టయితే న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల విశ్వాసం ఇనుమడిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ కీలక వ్యవస్థల మధ్య కొన్ని ఉద్రిక్తతలు తలెత్తడం సహజమే. కానీ ఆ మూడు వ్యవస్థలూ ఆ అవరోధాన్ని దాటే ప్రయత్నం చేయాలి. న్యాయాన్ని కాపాడగల బాధ్యత ఉన్న న్యాయమూర్తులు కూడా సామా జిక నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి. నాణ్యమైన ఉత్సుకత ప్రద ర్శించాల్సిన అవసరం న్యాయమూర్తులపై ఉన్నప్పటికీ పాట్రిక్‌ డెవ్లిన్‌ మాటలను అరువు తెచ్చుకోవడం వల్ల వారి నిష్పాక్షికత దెబ్బ తింటుంది. న్యాయవ్యవస్థ మౌలిక లక్షణాలైన న్యాయ తాత్వికత, న్యాయ విధానం అత్యంత సంక్లిష్ట సమయాల్లో మార్గదర్శిగా నిలుస్తాయి. కానీ తమకు గల పరిమితులు గుర్తించడంలోనే  న్యాయ మూర్తుల బలం ఉంటుంది. సంక్లిష్టమైన న్యాయ సమస్యలకు వారి వద్ద సమాధానాలు ఉండవచ్చు, కానీ తాము ఏ బాట అనుసరిం చాలనే విషయంలో వారికి ప్రశ్నలు కూడా ఉంటాయి. మానవులు తప్పులు చేయడం సహజం, న్యాయమూర్తులు మంచి న్యాయ తాత్వి కత ప్రదర్శించడాన్ని మించిన ఆచరణీయత మరేదీ ఉండదు అని ఆహరాన్‌ బరాక్‌  ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమూర్తి (ద జడ్జ్‌ ఇన్‌ ఎ డెమోక్రసీ) పుస్తకంలో రాశాడు.

వ్యాసకర్త: ఆర్‌.సి. లహోటి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement