సినీ’మాయే’ – విస్తృతమై, ‘నాటు నాటు’ అంటూ నాటుకుంటున్న ఈ కాలాన నీటుగా, ఉదాత్త విలువల దీటుగా – నాటకం పట్ల సమాజంలో కళాభిరుచులకు ఆస్కారంగా, ఆదరాభిమానాలు పాదుకు నేలా రంగస్థల నాటకానికి ప్రాపుగా ఒక కాపు కాస్తూ, కృషి చేస్తున్న సంస్థల్లో ఒకటి ‘రసరంజని’. జీవధార కళగా రంగస్థల నాట కాన్ని పరివ్యాప్తం చేస్తూ, సొంత రిపర్టరీ నిర్వహణతో బాటు – ఎన్నో నాటక సమా జాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ, మూడు దశాబ్దాలుగా నాటక రంగాభి మానుల మన్ననలు అందుకుంటున్న సంస్థ రసరంజని. ‘వరల్డ్ థియేటర్ డే’ను మార్చి 27న జరుపుకొంటున్న సందర్భంగా రసరంజని 3 రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహిస్తోంది.
పౌరాణిక నాటకాలు, చారిత్రకాలు, సాంఘిక నాటకాలు ఎన్నో సమాజాభివృద్ధిలో, సామాజిక చైతన్యంలో గణనీయమైన పాత్ర పోషించాయి. నాటక ప్రదర్శన అన గానే జనం ఒకప్పుడు తండోపతండాలుగా బండ్లు కట్టుకుని మరీ తరలి వెళ్లేవారు. ఆ రోజుల్లో సురభి వంటి నాటక సమాజాల కీర్తి సురభిళాలు పరివ్యాపితమై విరాజిల్లేవి.పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణరాయ బారం వంటి పద్యనాటకాల లగాయితు కన్యాశుల్కం, వరవిక్రయం, చిల్లర దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూపోతే అంతులేని పట్టి కగా... జనాదరణ పొంది సమాజంపై ప్రభా వం చూపిన రంగస్థల నాటకాలు ఎన్నో. ఈ తరానికి వాటిని (ప్ర)దర్శింపచేయడంలో ‘రసరంజని’ పాత్ర అవిస్మరణీయం.
నాటక రంగ అభివృద్ధి కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తృతంగా ప్రదర్శింపబడాలనీ, నాటకం ప్రజల మధ్యకి వెళ్లాలనీ, నాటకం ద్వారా సమాజ చైతన్యం జరగాలనీ ముఖ్యంగా ఎన్ని ఇక్కట్లున్నా టిక్కెట్టు కొని నాటకం చూడడం అనే ఉత్తమాభిరుచిని జనం విడనాడకూడదనే సంకల్పంతో నేటికీ రంగస్థల నాటక ప్రదర్శ నలకే కట్టుబడి 31 ఏళ్లుగా నెలనెలా రసరంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాటకరంగానికే తలమానికాలు.‘రసరంజని’ 1993 మార్చి 8న నెల కొల్పబడింది. ఈ మూడు దశాబ్దాల ప్రయా ణంలో దాదాపు 700 నాటకాలు, మూడు వేల అయిదువందల ప్రదర్శనలు – సంస్థ కళాకారులతోనే కాక అనేక నాటక సమా జాల వారితో ప్రదర్శించడమైంది.
సొంత రిపర్టరీ నెలకొల్పడం ద్వారా ఎందరో నటీనటులకు, రచయితలకు, దర్శ కులకు, రంగస్థల సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి, తద్వారా వారు నాటకరంగంలో స్థిరపడి వన్నెవాసికెక్కడానికి రసరంజని దోహదపడింది. రంగస్థలంపై రసరంజని కథానాటక సప్తాహాలు, కథానాటక శరన్న వరాత్రులు, తెలుగు హాస్య నాటకోత్సవాలు, జాతీయ నాటక ప్రదర్శనలు, జాతీయహిందీ నాటకోత్సవాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రదర్శనలు అందించి తనదైన ప్రత్యే కతను చాటుకుంది. ‘ప్రపంచమే ఒక నాటక రంగం. ప్రతి ఒక్కరం పాత్ర ధారు లమే!’ దర్శకుడు వేర యినా, మనమే అయినా, జీవితం అనే తెర పడే వరకూ అంకాలు మారుతూ బ్రతుకు దృశ్యాలు ఘటనలూ, సంభా షణలూ వెలుగు నీడలతో వివిధ రసా లతో సాగుతూనే ఉంటాయి అనే మాట మనం వింటూ వస్తున్నదే !
అటువంటప్పుడు నాటకమే ప్రపంచంగా, సమాజహిత చింతనతో కృషి చేస్తున్న నాటకరంగం సంస్థలను సమాదరించడం జనకర్తవ్యం. వారు కోరుతున్నది నాటకం చూడమని! నాటకాన్ని సమాదరించడం అంటే జీవితాన్ని సమాదరించడమే! మనిషినీ, మానవతనూ సమాదరించడమే!
- వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి
-సుధామ
రంగస్థల నాటకానికి రక్షాకంకణం
Published Mon, Mar 25 2024 1:09 AM | Last Updated on Mon, Mar 25 2024 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment