ఆర్థికరంగంలో ‘వృద్ధి’, ‘అభివృద్ధి’ అనే పదాల్ని చాలామంది తరచుగా ఒకే అర్థంలో వాడుతుంటారు. సామాజిక రంగంలో ఇవి రెండు భిన్నమైన భావనలే కాక పరస్పర విరుద్ధమైన భావనలు కూడ. దేశంలోని వస్తువులు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. దీనిని సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ద్వారా కొలుస్తారు. ఆర్థిక వృద్ధికి పరిమాణం ముఖ్యం. ఒక దేశ /రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తాలూకు మొత్తం పరిమాణాన్ని ఇది పరిగణన లోనికి తీసుకుంటుంది. ఇది విస్తృత అభివృద్ధికి అవసరమైన కొలమానమేగానీ సమాజంపై దాని ప్రభావాన్ని చూడడానికి అదొక్కటే సరిపోదు.
ఆర్థిక అభివృద్ధి అనేది మానవ శ్రేయస్సు, సామాజిక పురోగతి మరీ ముఖ్యంగా సామాజిక న్యాయం తదితర అంశాల్లో మెరుగుదలలను పరిశీలించే విస్తృత భావన. ఇందులో ఆర్థిక అంశాలే కాకుండా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు కూడా ఉంటాయి.
వృద్ధి ఆధారిత ప్రభుత్వాధినేతలు ఉన్నప్పుడు ఏదో జరిగిపోతున్నట్టు ప్రదర్శన, హడావిడి ఉంటుందిగానీ ప్రజలకు ఆ సౌఖ్యాలు అందవు. అభివృద్ధి ఆధారిత ప్రభు త్వాధినేతలు ఉన్నప్పుడు ఆ ప్రదర్శనలు, హడావిడి ఉండ వుగానీ ప్రజలకు సౌఖ్యాలు అందుతుంటాయి. మన రాజ కీయ నాయకుల్లో ఈ రెండు కోవలకు చెందినవారూ
ఉంటారు. ఆయా దశల్లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి ఆర్థిక విధానాలను అను సరించారు. పీవీ నరసింహారావు, చంద్రబాబు, నరేంద్ర మోదీలది వృద్ధి ఆర్థిక విధానం. జీడీపీ బాగుంటుంది కానీ, పేదరికం పెరుగుతూ ఉంటుంది.
ఎన్నికల చరిత్రను పరిశీలించినప్పుడు ఆలోచనా పరుల ప్రభావం ఓటర్లపై అంతగా లేదనీ, వర్గ సిద్ధాంతాల ప్రాతిపదికగా ప్రజలు చాలాసార్లు ఓట్లు వేయలేదనీ అర్థ మవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు సందర్భాల్లో మాత్రమే వర్గ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయి. 1952లో హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం–తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులకు మంచి మెజారిటీ వచ్చింది. కానీ, నిజాం–హైదరాబాద్, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు భారీ మెజా రిటీ వచ్చి ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.
అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో శ్రామిక, భూస్వామ్య–పెట్టుబడీదారుల మధ్య మరో ఉధృత వర్గపోరాటంగా 1955 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ కాంగ్రెస్‌కే ఆధిక్యత వచ్చింది. ఎమర్జెన్సీని ఎత్తేసిన తరువాత లోక్‌సభకు జరిగిన ఎన్ని కల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందులో దేశంలోని ఆలోచ నాపరుల పాత్ర కూడ వుంది. ఎమర్జెన్సీ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు నాలుగు ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం కూడ కనిపించింది. నక్సలైట్ల మీద తీవ్రంగా విరుచుకు పడిన పార్టీలు ఓడిపోయేవి, నక్స లైట్లతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలు గెలిచేవి. తరు వాత కాలంలో ఈ ప్రభావం మాయమయ్యింది.
ఇటు కమ్యూనిస్టులూ, అటు అంబేడ్కరిస్టులూ చెప్పే సిద్ధాంతాలకూ, ప్రజల ఓటింగ్ విధానాలకూ పొంతనే లేదు. దేశ జనాభాలో 85 శాతం శ్రామికవర్గమే అయి నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నికల్లో 2 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. అలాగే దేశ జనాభాలో బహు జనులు 85 శాతం ఉన్నప్పటికీ బీఎస్‌పీ వంటి అంబే డ్కరిస్టు పార్టీలకు 4 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మనం రెండు సూత్రీకరణలు చేయవచ్చు. మొదటిది, కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు సిద్ధాంతాలను పెట్టుబడీదారీ పార్టీలు హైజాక్ చేశాయి అనేది. రెండోది; ప్రజలకు ఇప్పటి కమ్యూనిస్టు, అంబేడ్క రిస్టు పార్టీల నాయకుల మీద నమ్మకం లేదు అనేది.
కమ్యూనిజం వేరు, కమ్యూనిస్టు పార్టీలు వేరు అయినట్టు; అంబేడ్కరిజం వేరు, అంబేడ్కర్ పేరున వెలసిన పార్టీలు వేరు. అసలు విషయం ఏమంటే, ఈ పార్టీల్లో బహు అరుదుగాతప్ప నమ్మదగ్గ నాయకులు ప్రజలకు కనిపించడం లేదు. ఎవరయినా నమ్మదగ్గ నాయకులు ఎక్కడయినా కనిపిస్తే ప్రజలు కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు పార్టీలను అక్కడ గెలిపిస్తూనే ఉన్నారు. ఓటర్లకూ పార్టీల ప్రకటిత సిద్ధాంతాలకూ మధ్య ఒక వైరుధ్యం ఉంది. ముందుదాన్ని పరిష్కరించాలి.
రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థులయిన కమ్యూనిస్టుల్నీ, నక్సలైట్లనీ బల హీనపరచడానికి ఇందిరాగాంధీ భూసంస్కరణ చట్టాలు, అటవీ భూముల పరిరక్షణ చట్టాలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభర ణాలు రద్దు వంటివాటిని తెచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు కోరేదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీలకు అభిమానులుగా ఉన్న ఓటర్లు సహితం కాంగ్రెస్ ఓటర్లుగా మారి పోయారు.
తాను ప్రకటించిన ఆదర్శాలను కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఆచరించలేదు. సరిగ్గా ఎన్టీ రామారావు రంగ ప్రవేశం చేసి ఇందిరా గాంధీ వాడిన ఆయుధాలతోనే ఆమె పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఓడించారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలన్నీ ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ నుండి పుట్టినవే.
ఎన్టీ రామారావు ప్రకటించిన ఆదర్శాలను చంద్ర బాబు చిత్త శుద్ధితో ఆచరించలేదు. పైగా వారు పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలకు (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) తనను తాను బ్రాండ్ అంబాసిడర్‌గా సగర్వంగా ప్రకటించుకోవడం మొదలెట్టారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల నాడిని పట్టుకున్నారు. ఇందిరా గాంధీ అందించిన ఆయుధాలతో ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను ఓడించినట్టే, ఎన్టీ రామారావు అందించిన ఆయుధాలతో తెలుగు దేశం పార్టీని ఓడించడానికి వైఎస్ సిద్ధపడ్డారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు చేపడితే... వైఎస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు నినాదంతో వాటిని చిత్తు చేశారు. ఆ తరువాత ‘ఆరోగ్యశ్రీ’ వంటివి వచ్చాయి.
కొత్త ఆంధ్ర ప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన పాత విధానాలను మార్చుకోలేదు. మరొక్కసారి నూతన ఆర్థిక విధానాలనే అనుసరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త రాజధానినీ, పోలవరం ప్రాజెక్టునూ నిర్మించి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అవి పూర్తయ్యేలోగా హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించుకునే వీలుంది. అందులో అనవసరంగా జోక్యం చేసుకున్న చంద్రబాబు నూతన ఆర్థిక విధానాలను జొప్పించారు. అలాంటివి సింగపూర్ పెట్టుబడీదారులకు బాగుంటాయిగానీ ప్రజలకు బాగుండవు. గత ఎన్నికల్లో అమరావతి రాజధాని పరిధి లోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్య ర్థులు గెలవలేదు. ఇది ఏ సంకేతాన్ని ఇచ్చిందీ?
వైఎస్ జగన్ మరొక్కసారి ప్రజల నాడిని పట్టు కున్నారు. నూతన ఆర్థిక విధానాలకు పూర్తిగా వ్యతిరేక మయిన ‘నవరత్నాల’ను ముందుకు తెచ్చారు. పేదల ఆర్థిక విధానం ముందు చంద్రబాబు మరొక్క సారి ఘోర పరాజయాన్ని చవిచూశారు.
చంద్రబాబు నూతన ఆర్థిక విధానాలను వదులు కోలేరు. దానికీ కొన్ని ఓట్లు ఉన్నాయన్నది వారి నమ్మకం. అయితే ఆ ఓట్లు ఎన్నికల యుద్ధంలో గెలవడానికి సరి పోవని వారికి స్పష్టంగా తెలుసు. వారికిప్పుడు అదనపు ఓట్ల కోసం పవన్ కల్యాణ్ కావాలి. తెలంగాణలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన ఓడిపోవడమేగాక ఎక్కడా డిపాజిట్లను కూడ నిలబెట్టుకోలేక పోయింది. అదొక రికార్డు. రాజకీయాల్లో ప్రవేశించి దశాబ్దం దాటుతున్నా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రికార్డు కూడ ఆయన సొంతం. వారిని చంద్రబాబు నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ ఆశిస్సులు దక్కుతాయని చంద్రబాబు ఆశిస్తూ ఉండవచ్చు.
డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్
పెరుగుదల వేరు... మెరుగుదల వేరు!
Published Tue, Jan 23 2024 5:24 AM | Last Updated on Tue, Jan 23 2024 5:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment