వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా? | Sakshi Guest Column On AP Budget And TDP Super Six | Sakshi
Sakshi News home page

వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?

Published Fri, Nov 15 2024 5:17 AM | Last Updated on Fri, Nov 15 2024 5:17 AM

Sakshi Guest Column On AP Budget And TDP Super Six

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్‌ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్‌ సిక్స్‌’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. 

యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్‌ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్‌ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్‌లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. 

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్‌ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. 

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్‌ సిక్స్‌’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. 

ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. 

ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు.  దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్‌ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. 

మాటిచ్చినట్టుగా విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్‌ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్‌ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.

– డా‘‘ ముచ్చుకోట సురేష్‌ బాబు
మొబైల్‌: 99899 88912 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement