స్కిల్ డెవలెప్‌మెంట్ కోర్సుల్లో విద్యార్థులు, ఉద్యోగార్థులకు నాణ్య మైన శిక్షణ ఇచ్చి ఉంటే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఆ అవకాశాన్ని లేకుండా ‘స్కిల్ కుంభకోణాని’కి చంద్రబాబు పాల్పడటంతో లక్షల కుటుంబాలు శాశ్వతంగా నష్టపోయాయి. యువతకు చంద్రబాబు చేసిన అన్యాయం క్షమించరానిది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిమయం చేసిన పాపం ఊరికే పోదు.
పక్కా ఆధారాలతో ‘స్కిల్ కుంభకోణం’లో దొరికిపోవడంతో చంద్రబాబును ప్రభుత్వం చట్టం ముందు నిలబెట్టింది. 2014–19 మధ్య ఐదు సంవత్సరాల్లో కేవలం విద్యార్థుల జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్‌నూ సర్వనాశనం చేశారాయన. రాజధాని నుంచి ఫైబర్ గ్రిడ్ వరకు... ఆయన ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలూ, పథకాల్లో అవినీతి, ఆశ్రిత పక్ష పాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసి దాచేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పథకాలూ, కార్యక్రమాలూ చేపట్టి నట్లు తేటతెల్లం అవుతోంది. స్కిల్ కుంభకోణం కేవలం తీగ మాత్రమే. ఈ తీగను పట్టుకొని లాగితే చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం కదులుతుంది. బాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. న్యాయస్థానాల్లో శిక్ష పడకుండా బాబు తప్పించుకోలేరు. విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి స్కిల్ కుంభకోణానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం తప్పకుండా శిక్ష విధిస్తుందని విశ్వాసం ఇప్పుడు అందరిలోనూ ఉంది. ప్రజా కోర్టులోనూ శిక్ష తప్పదనే విషయాన్ని బాబు గుర్తించాలి.
ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేసే టక్కు టమార విద్య బాబును ఆదుకొంది. ప్రతి దానికీ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఒకటి ఉన్నట్లే చంద్రబాబు గజకర్ణ గోకర్ణ విద్యకూ ఎక్స్‌పైరీ డేట్ ముగి సింది. అందుకే రూ. కోట్లు పుచ్చుకొనే బడా అడ్వొకేట్లను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో దించినా, కొమ్ములు తిరిగిన లాయర్లు తమ వాదనా పటిమను న్యాయస్థానాల్లో జడ్డి ముందు ప్రదర్శించినా చంద్రబాబును చట్టం ముందు నిలబెట్టకుండా అడ్డుకోవడం సాధ్యం కాలేదు.
అద్భుత వాదనా పటిమ కనపరిచే సామర్థ్యం ఉన్న బడా లాయర్లు కూడా కేసు లోతుపాతుల్లోకి వెళ్లకుండా కేవలం సాంకేతిక పరమైన అంశాలకే పరిమితం కావడం చూస్తుంటే.. అవినీతి చేసి దొరికిపోయామనీ, లోతు పాతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాల మీద బయట పడాలనేది చంద్రబాబు బృందం ఆలోచన అనీ చిన్న పిల్లలకూ తెలిసిపోతోంది.
ఐదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసినందుకు ప్రజా న్యాయస్థానంలో టీడీపీకి శిక్ష విధించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా తన 14 సంవత్సరాల పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ రిక్రూట్‌మెంట్ చేపట్టలేదు. ప్రాథమిక, సెకండరీ, ఇంటర్ విద్యను పూర్తిగా ప్రయివేటుకు కట్టబెట్టారు. విద్యా రంగంలో ‘చై–నా’ వేళ్లూనుకోవడానికి చంద్రబాబు అనుసరించిన విధానాలు కారణమయ్యాయి.
ఫలితంగా విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడం, పేద–మధ్య తరగతి ప్రజల రక్తాన్ని పీల్చేయడం మన కళ్లముందు కనిపించిన వాస్తవం. విశ్వ విద్యాలయాలనూ నాశనం చేసి నాణ్యత లేని చదువులతో పేదలకు తీరని అన్యాయం చేసిన బాబుకు ప్రజా కోర్టులో 2019లో ప్రజలు విధించిన శిక్షనే 2024 ఎన్నికల్లోనూ మరోసారి విధించనున్నారు. స్కిల్ కుంభకోణంలోనే కాదు మిగతా కుంభ కోణాల్లోనూ కోర్టులు విధించే శిక్షలు అనుభవించడమే చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం.
కైలే అనిల్‌కుమార్
వ్యాసకర్త పామర్రు ఎమ్మెల్యే,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
రెండు రకాలుగానూ శిక్ష తప్పదు!
Published Wed, Sep 20 2023 5:08 AM | Last Updated on Wed, Sep 20 2023 9:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment