అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ గెలిస్తే? | Sakshi Guest Column On Donald Trump | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ గెలిస్తే?

Published Wed, Jul 17 2024 12:49 AM | Last Updated on Wed, Jul 17 2024 12:49 AM

Sakshi Guest Column On Donald Trump

అభిప్రాయం

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఊహించినట్టుగానే రిపబ్లికన్‌ పార్టీ తన అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ను ఎంచుకుంది. ఇప్పటికే ట్రంప్‌కు సానుకూల పవనాలు వీస్తుండగా, ఆయన మీద జరిగిన హత్యాయత్నం ఆయన విజయావకాశాలను మరింతగా పెంచేవుంటుంది. అయితే ఇంకోసారి ట్రంప్‌కు అధికార పగ్గాలు చిక్కితే రకరకాలుగా నష్టం జరిగే అవకాశాలు మెండు! ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పు అంశాల్లో ట్రంప్‌ నిర్ణయాలు అమెరికాను బలహీనపరచడమే కాకుండా... భారత దేశానికీ ఆందోళన కలిగించేవే. ట్రంప్‌ తన పాత వైఖరినే కొనసాగిస్తే చైనా ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికా అంతర్గతంగా బలహీనపడితే కూడా లాభపడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి ముఖాముఖి చర్చ జో బైడెన్‌కు ఓ దుస్వప్నంలా మిగిలిపోయింది. తడబాటు, తత్తరపాటు, మతిమరపు లతో బైడెన్‌ పై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగానూ వ్యతిరేకులు పెరిగిపోయారు. బైడెన్‌  వైఫల్యం కాస్తా ట్రంప్‌కు వరంగా మారిందని చెప్పాలి. అధ్యక్షుడిగా బైడెన్‌  రికార్డు బాగానే ఉంది. కానీ చర్చ కార్య క్రమం మాత్రం అతడి వయసు, మానసిక ఆరోగ్యంపై అనేక సందే హాలు లేవనెత్తింది. 

డెమోక్రాట్ల విశ్వసనీయతతోపాటు వైట్‌హౌస్‌పై కూడా నమ్మకం సడలించే వ్యవహారమిది. డెమోక్రాట్లకు ఓటేయాల్సిందిగా మద్దతుదారులు కూడా అడిగేందుకు సందేహించే పరిస్థితి వచ్చింది. బైడెన్‌  ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోటీ నుంచి తప్పుకొమ్మని చాలామంది సలహా ఇస్తున్నా... అధికారాన్ని వదులు కునేందుకు సిద్ధంగా లేరు. పైగా తాను మాత్రమే ట్రంప్‌ను ఓడించ గలనని అంటున్నారు.

వాతావరణ మార్పును పట్టించుకోరు!
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఇంకోసారి ఎన్నికైతే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా రకాలుగా విధ్వంసం జరుగుతుందన్నది కచ్చితం. కాకపోతే భారతదేశం అంటే మనం ఆలోచించాల్సిన అంశాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. శతాబ్దాలుగా... ఇప్పుడు కూడా అమె రికా వెలువరించే కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో ఉన్నాయన్నది తెలిసిందే. ఇందుకు బాధ్యత వహించే విషయంలో మాత్రం అగ్ర రాజ్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. 

వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సాయం అందించేందుకు తిరస్కరిస్తోంది. వినియోగదారుల కేంద్రంగా నడిచే ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోయిన అమెరికా విచ్చల విడి ఖర్చులు, వనరుల వృథాకు ప్రసిద్ధి. కపటత్వం కూడా ఎక్కువే. కోట్లాదిమందిని పేదరికం కోరల నుంచి తప్పించాల్సిన బాధ్యత ఉన్న దేశాలు అభివృద్ధి విషయంలో రాజీపడాల్సిందిగా కోరడం దీనికి నిదర్శనం. చారిత్రక బాధ్యతలను విస్మరించడం, తమ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయకపోవడం అమెరికాకు మాత్రమే ప్రత్యేకం. 

ఈ విషయమై అటు డెమోక్రాట్లనూ, ఇటు రిపబ్లికన్లనూ ఇద్దరినీ నిందించాల్సిందే. అయితే బైడెన్‌  గద్దెనెక్కిన తరువాత ప్యారిస్‌ ఒప్పందానికి ఊ కొట్టడం, వాతావరణ మార్పులకు సంబంధించి చట్టాన్ని ఆమోదించడం, స్థానికంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. వాతావరణ సంక్షోభ నివారణ యత్నాలకు రుణసాయం ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించారు కూడా. ఈ చర్యలన్నీ నామమాత్రంగానైనా తానూ బాధ్యత తీసుకుంటున్న భావన కలిగించాయి. ఒకవేళ ట్రంప్‌ రెండోసారి పగ్గాలు చేపడితే ఇవేవీ కొనసాగించడన్నది కచ్చితం. తొలి దఫా గద్దెనెక్కి నప్పటి చందంగానే వాతావరణ మార్పులన్నవి అసలు సమస్యే కాదన్నట్టుగా నటిస్తారు.

ట్రంప్‌ అధ్యక్షుడైతే పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌పై వస్తున్న ఒత్తిడి తగ్గుతుందని అనుకునేందుకు బాగానే ఉంటుంది కానీ... అది స్వల్పకాలికం మాత్రమే. వాతావరణ మార్పులనేవి ప్రపంచం మొత్తం సమస్య. ఈ సమస్య ముదిరిపోవడంలో అమెరికా పాత్ర పెద్దది. పరిష్కారం కూడా అమెరికా ప్రమేయంతో మాత్రమే సాధ్యమవుతుంది. ట్రంప్‌ తన పాత వైఖరినే కొనసాగిస్తే ఈ విషయంలో చైనా ఆధిపత్యం పెరుగుతుంది. 

వాతావరణ పరిరక్షణకు సంబంధించి టెక్నాలజీల అభివృద్ధిలోనూ ముందుకు దూసుకెళుతుంది. ఫలితంగా ఇప్పటివరకూ వాతావరణ మార్పుల అంశంపై పని చేస్తున్న ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు నిర్వీర్యమవుతాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీలు వాతావరణ మార్పులకు సంబంధించి పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. దీనివల్ల వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. 

వ్యవస్థలు దెబ్బతింటాయి!
రెండో విషయానికి వద్దాం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. న్యాయవ్యవస్ధను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ న్యాయమూర్తులు శాశ్వత ప్రాతిపదికన నియ మితులవుతారు. ఫలితంగా వారికి బాధ్యత శూన్యం. పైగా న్యాయ మూర్తుల నియామకాలు అధికార వర్గం ద్వారా జరుగుతాయి. ఫలి తంగా వీరు పక్షపాతంగా ఉండేందుకూ, తాము నమ్మే భావజాలానికి అనుగుణంగా నడుచుకునేందుకూ అవకాశాలు ఎక్కువ. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక అంగం విపరీతమైన అధికా రాలు కలిగి ఉండటమే కాకుండా... సైద్ధాంతిక అంశాలపై విభజితమై ఉంటుంది.

అంతెందుకు అమెరికా ఎన్నికల వ్యవస్థనే తీసుకుంటే... అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఫలితాలతో నిమిత్తం లేదు. ఫలితంగా అవినీతిపరుడైన నేత... విరాళాలిచ్చే వారు కుమ్మక్కయ్యే అవకాశం ఉంటుంది. 2020 నాటి ఎన్నికలు ఎంతో మెరుగ్గానే జరిగాయని అనుకున్నా ఆ తరువాత అమెరికాలో సగం మంది ఎన్నికల ప్రక్రియను, అధికార మార్పిడి జరిగిన తీరును తప్పుపట్టడం గమనార్హం. 

ఈ సమస్యలకు అమెరికా రాజ్యాంగ నిర్మాణం ఒక కారణమని చెప్పాలి. వ్యవస్థలు అధికారంలో ఎవరున్నారు అన్న అంశం ఆధారంగా ఒడుదొడుకులకు లోను కాకూడదు. ట్రంప్‌ అమెరికా సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలకు ప్రతిపాదించడం ఇప్పటికే మానవ, మహిళ హక్కుల విషయంలో ప్రతికూల పరిస్థి తులు తెచ్చి పెట్టాయి. అబార్షన్‌  విషయంలో అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలు దక్కిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 

ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ గద్దెనెక్కితే మరింత మంది న్యాయమూర్తులను ఆయన సుప్రీంకోర్టులో నియమించవచ్చు. ఎన్నికల ఫలితాలను సవాలు చేయడం మాత్రమే కాకుండా... నేరం రుజువైనా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించడం వంటివి ఎక్కువ అవుతాయి. జాతి వివక్ష పెరగడం, క్రిస్టియన్‌  జాతీయతా భావజాలం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే అంశాలు కాదు. ట్రంప్‌ గెలుపుతోపాటు సెనేట్‌లో కూడా రిపబ్లిక న్లకు ఆధిక్యం దక్కితే గోరుచుట్టుపై రోకటిపోటు చందం కాక తప్పదు.

భారత్‌ ఆలోచించాలి!
భారతదేశ అధికార వర్గాలు ట్రంప్‌ మరోసారి గెలిస్తే ఏమిటన్న అంశంపై ఆలోచన మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ట్రంప్‌ రాకతో ప్రజాస్వామ్యంలో మన లోటుపాట్లు పక్కకు వెళ్లిపోతాయిలే అనుకుంటే అది తప్పే అవుతుంది. వాస్తవానికి సమస్య మరింత పెరుగుతుంది. అమెరికా వ్యవస్థలు, సంస్థల పనితీరుపై చర్చ ఎంత పెరిగితే ఆ దేశ రాజకీయం అంత అస్థిరమవుతుంది. సమాజం కూడా రకరకాల అంశాలపై ముక్కలు అవుతుంది. ఈ పరిణామాలన్నీ చివ రకు అంతర్గత కుమ్ములాటలకూ, సంఘర్షణలకూ తావిస్తాయి.

అంతర్జాతీయ, దేశీ రాజకీయాలపై అమెరికాను ఎంత కఠినంగానైనా విమ ర్శించవచ్చు కానీ... ఆ దేశం అంతర్గతంగా బలహీనపడితే లాభ పడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. అంతేకాదు... అమె రికాకు వలస వెళ్లిన, ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ అంత మంచిది కాదు. ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడు కావడం ప్రపంచ రాజకీయాలు, వాతావరణ మార్పుల సమస్యలకు నిర్ణయా త్మకం కానుందన్నది నిస్సందేహం!

ప్రశాంత్‌ ఝా 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement