జీ20 అధ్యక్ష స్థానాన్ని భారతదేశం చేపట్టి మే 31తో సరిగ్గా ఆరు నెలలు అయ్యింది. ఉక్రెయిన్ ఘర్షణ వల్ల సభ్యదేశాలు స్పష్టంగా చీలిపోవడంతో అధ్యక్ష బాధ్యత మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనూ భారత్ చక్కగా పనిచేసిందనే చెప్పాలి. అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయుతమైన కీలక భాగస్వామిగా, ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించడంలో కూడా నాయకత్వం వహించింది.
దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. అలాంటప్పుడు ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా?
సంవత్సరం పాటు కొనసాగే భారత్ జీ20 (గ్రూప్ ఆఫ్ 20) అధ్యక్ష పదవి మే 31తో దాని మధ్య బిందువును దాటేసింది. అంటే దాని పదవీ కాలంలో ఆరు నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలో జరగ నున్న శిఖరాగ్ర సదస్సుపై దృష్టి సారించడంతో తదుపరి సగం కాలం ఇప్పుడు ఆవిష్కృతమవుతుంది. జీ20 అధ్యక్షత గత పనితీరు, దాని అవకాశాలపై భావోద్వేగ రహితంగా మూల్యాంకనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం.
భారత్ జీ20 అధ్యక్ష స్థానం... కోవిడ్ మహమ్మారి, ఆర్థిక మంద గమనం, పదునెక్కుతున్న భౌగోళిక, రాజకీయ పోటీ ప్రభావాన్ని అధిగమించలేకపోయింది. జీ20 దుర్బలత్వాన్ని బహిర్గతపర్చేలా, ఉక్రెయిన్ ఘర్షణ ద్వారా ప్రేరేపితమైన ధ్రువీకరణ కూడా దీనికి తోడయింది. తీవ్రమైన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో ఈ గ్రూప్ చీలిపోయింది. అందుకే, జీ20 అధ్యక్ష బాధ్యత ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో గ్రూపు కీలక లక్ష్యాలను పరిరక్షించుకోడానికి జీ20 అధ్యక్ష స్థానాన్ని సమతుల్యం చేయడంలో భారత్ చక్కగా పని చేసిందనే చెప్పాలి. మొదటగా, అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయు తమైన కీలక భాగస్వామిగా, భారతదేశం ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించ డంలో కూడా నాయకత్వం వహించింది. దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. రాబోయే నెలలు మంత్రుల స్థాయిలో, చివరకు నాయకుల స్థాయిలో జరిగే చర్చలకు సాక్షీభూతంగా నిలుస్తాయి.
రెండవది, భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని, దాని వైవిధ్యం, విజయాలను, ప్రజాస్వామ్య నమూనాతో సాధించిన అభి వృద్ధి, రాజకీయ సుస్థిరత ఫలాలను, బలమైన నాయకత్వాన్ని, సమీకృత ఆర్థిక పురోగతిని ప్రదర్శించడమే లక్ష్యం. పర్యాటక రంగాన్ని, వాణిజ్యాన్ని, టెక్నాలజీని, ప్రపంచంతో పెట్టుబడి ఆధార సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత్‌కు ఇది ఉపకరిస్తుందన్న అంచనా దీని వెనుక ఉంది.
మూడవది, ప్రపంచరంగంలో న్యూఢిల్లీ నాయకత్వ పాత్రను నొక్కి చెప్పడానికి మరింత సంక్లిష్టమైన ప్రేరణ ఉంది. పశ్చిమ దేశాలతో వ్యవహరించడంలో (తేడాలు ఉన్నప్పటికీ) భారత్ సౌకర్య వంతమైన దేశంగా ఉంటుందనీ, రష్యాతో, చివరకు చైనాతో కూడా (విభేదాలు కొనసాగుతున్నప్పటికీ) పొత్తులు నిర్వహిస్తుందనీ,ప్రపంచ దక్షిణ దేశాలకు సలహాదారుగా పనిచేస్తుందనీ ఇది చూపు తుంది. ఈ కత్తి మీద సాము చేయడానికి తెలివైన దౌత్యం, చురుకు దనం, సృజనాత్మకతతో పాటు కాస్త అదృష్టానికి చెందిన సమ్మేళనం కూడా అవసరం.
ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిల్లో జరిగిన చర్చలతో సహా జీ20 సంబంధిత పరిణామాలకు భారత మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. ఈ క్రమంలో ప్రజలకు దీనిగురించి చక్కటి అవగాహన కలిగేలా చేసింది.
అయితే అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. ఈ ఢిల్లీ సదస్సు ఫలితాలను న్యాయబద్ధంగా అంచనా వేయడానికి ఏకాభిప్రాయం, జోడింపు, ఆచరణ అనే త్రిముఖ కోణా లను ఉపయోగించడం మంచిది.
మొదటగా, భారతీయ అతి«థేయులు ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు ముగింపులో ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా? లేదా మార్చి నెలలో 20 మంది విదేశాంగ మంత్రుల సమావేశంలో, ఉక్రెయిన్ సమస్యకు చెందిన పేరాలతో మిగిలిన 18 మంది సభ్యులతో కలిసి వెళ్లడానికి రష్యా, చైనాలు తిరస్కరించిన విధంగానే దీని ఫలితం ఉంటుందా? పైగా, ఢిల్లీలో జీ20 దేశాల నాయకులందరూ కనబడటంపై కూడా అనిశ్చితి నెలకొంది. నాయ కులు భౌతికంగా హాజరు కాలేకపోవడంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ఢిల్లీలో సదస్సు నిర్వహణకు అశక్తత వ్యక్తం చేయడం దీన్ని మరింత పెంచింది.
రెండు, జోడింపు అనేది ఢిల్లీ డిక్లరేషన్ ప్రతిపాదించే విషయాలను సూచిస్తుంది. మునుపటి సదస్సుకు సంబంధించిన ‘బాలి డిక్లరే షన్’తో పోల్చినప్పుడు, ఢిల్లీ సదస్సులో ప్రత్యేకించి ప్రపంచ పరిష్కారాలకు సంబంధించిన విషయాలు మరింత దృఢంగా, కొత్తగా ఉంటాయా? చివరగా, ప్రధాన ఒప్పందాల ఆచరణకు సంబంధించి: ఏకాభిప్రాయ ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలను అమలు చేయ డానికి రాజకీయ సంకల్పంతో కూడిన ఆచరణ జీ20ని ఒక సమర్థమైన నిర్దేశక కార్యాలయంగా చూపిస్తుందా లేక చర్చల దుకాణంగా మాత్రమే చూపుతుందా?
బహువిధ ఆర్థిక వ్యవస్థల్లో సంస్కరణల కోసం నినాదాలు ఇస్తున్నట్టుగా, జీ20 తనను తాను కూడా సంస్కరించుకోగల సమర్థు రాలనే సూచన ఢిల్లీ సదస్సులో వెలువడవచ్చు. అలా అయితే తమ కొత్త సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను చేర్చుకోవడంలో కొంచెం కూడా సందేహం ఉండకూడదు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ, ప్రజాస్వామికీకరణను వేగవంతం చేయడం కోసం పిలుపునిస్తుందా అన్నది కూడా ప్రత్యేక శ్రద్ధతో గమనించాల్సి ఉంది.
చర్చల్లో పురోగతిని నమోదు చేయడానికి జీ20 అధ్యక్ష పదవి ప్రాధాన్యతలలో రెండు అంశాలు తప్పనిసరి. అవి వాతావరణం, శక్తి పరివర్తిత ఆర్థికం. వీటికి సంబంధించి జీ20 నిబద్ధత నిర్దిష్టంగా ఉండవచ్చు. దీనికి మరిన్ని జోడింపులు చేర్చవచ్చు. ప్రపంచంలో భారతీయ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ (డీపీజీ) ప్రాసంగికతను నొక్కి చెప్పడంలో, భారత ప్రభుత్వం అసాధారణ క్రియాశీలతను ప్రదర్శించింది.
కాబట్టి ఢిల్లీ సదస్సు తుది ప్రకటనలో ఒక బలమైన సూత్రీకరణ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పరిధిలో సహకారం పొందడం కోసం బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్ వంటి ఎనిమిది అధ్యక్ష అతిథి దేశాలతో ద్వైపాక్షిక చర్చల దిశగా అధికారులు పని చేస్తే బాగుంటుంది.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, విమర్శకుల అభిప్రాయాలను, భిన్నా భిప్రాయాలను గమనించాలి. ఒక మాజీ సీనియర్ అధికారి ఇటీవల ప్రపంచం అంతర్జాతీయ ఘర్షణకు ‘ప్రమాదకరంగా దగ్గరవుతోంద’ని పేర్కొంటూ– జీ20, ‘ఎస్‌సీఓ’ శిఖరాగ్ర సదస్సుల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాలన్న ఆశలను తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
ప్రజాస్వామ్యం, వైవిధ్యం గురించిన అధికారిక సిద్ధాంతం దేశీయ రాజకీయాలకు అనుగుణంగా లేదని వాదిస్తూ ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ‘జీ20 కపటత్వం’ గురించి మాట్లా డారు. ఇకపోతే మూడో విమర్శకుడు జీ20 పౌర సమాజ వేదిక హైజాక్ కావడం గురించి రాశారు. కొంతమంది విదేశీ పరిశీలకులు ‘థింక్20’ ప్రక్రియ గురించి ఫిర్యాదు చేశారు.
భారతదేశ జీ20 అధ్యక్షతకు సంబంధించి బహుముఖ ప్రయాణ క్రమంలో కొన్ని చికాకులు సమానంగా ఉంటాయి. వస్తుగతంగా చెప్పాలంటే, జీ20 అధ్యక్ష పదవీకాలంలో భారత్ ఇప్పటివరకూ బాగా పనిచేసింది. ప్రత్యేకించి ప్రపంచంలో భారత్ పాత్ర గురించి విశ్వ వ్యాప్తంగా అపూర్వ సందడిని సృష్టించింది. శ్రద్ధ, దౌత్య చతురత, రాజకీయ దృష్టి, కాస్త అదృష్టంతో ఈ బిడారు విజయవంతంగా తన గమ్యాన్ని చేరుకోవాలి. భారతదేశానికీ, జీ20కీ గొప్ప కీర్తిని తెచ్చి పెట్టాలి.
రాజీవ్ భాటియా
వ్యాసకర్త మాజీ రాయబారి; డిస్టింగ్విష్డ్ ఫెలో, గేట్‌వే హౌజ్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment