ఇంతవరకూ శిక్షా కేంద్రాలుగా ఉన్న కారాగారాలు ఇక పరివర్తన కేంద్రాలుగా మారనున్నాయి. అందు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ళలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. శిక్షాకాలం పూర్తయినా చాలామంది ఖైదీల మానసిక స్థితిలో మార్పు రావడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక వారికి సరైన ఉపాధి దొరక్కపోవడంతో మళ్లీ నేరాలకు పాల్పడి తిరిగి జైలుకు చేరుతున్నారు. కొందరు న్యూనతతో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా కనిపిస్తుంది.
రాష్ట్రంలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, అనంతపురం కేంద్ర కారాగారాలతో పాటు మొత్తం 80 జైళ్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,499 మంది ఖైదీలు రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్నారు. నాలుగు కేంద్ర కారాగారాలతో కలిపి 15 జైళ్లను తొలి దశలో పరివర్తనా కేంద్రాలుగా మార్చ డానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మూడు కేటగిరీలుగా ఖైదీలను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. ఏడాదిలోపు శిక్ష పడిన ఖైదీలు, ఏడాది కంటే ఎక్కువ శిక్ష పడిన ఖైదీలు, రిమాండ్ ఖైదీలు అనే కేటగిరీలుగా వర్గీకరించి వాళ్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. వీటి కోసం జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
ఈ పరివర్తన కార్యక్రమం కోసం ప్రతి జైల్లోనూ ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటవుతోంది. మానసిక వైద్య నిపుణులు, సంక్షేమ శాఖ అధికా రులు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీవో), సామాజిక కౌన్సిలర్, ఆర్థిక రంగ నిపుణుడు, చిన్న తరహా పరిశ్రమల శాఖ అధికారులు, విద్యావేత్తలు తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.
ఖైదీల్లో హింస, నేర ప్రవృత్తి రూపుమాపటం, చట్టానికి బద్ధుడయ్యే పౌరుడిగా తీర్చిదిద్దడం; తన జీవితానికీ, కుటుంబానికీ అవసరమయ్యే ఆర్థిక ప్రణాళిక లను వేసుకోగలగటం; విద్య, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం; కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలగటం, ప్రేమ తత్వాన్ని నింపటం, సామాజికంగా గౌరవ జీవనం ఆవశ్యకతను తెలియజేయడం, న్యూనతా భావాన్ని తొలగించడం, ఆత్మస్థైర్యాన్ని కలిగించటం, ఉత్సాహాన్ని నింపడం తదితర అంశాలపై ఖైదీలకు కౌన్సిలింగ్, శిక్షణ ఇస్తారు. క్యాటగిరీల వారీగా వారానికి, 15 రోజులకూ, నెలకూ, ఆ తర్వాత 45 రోజులకూ కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఖైదీని అక్షరాస్యునిగా తీర్చిదిద్ది కనీసం సంతకం చేసే స్థాయికి తీసుకురావాలనేది ఈ పరివర్తన సంకల్పం.
వారి అభివృద్ధి నివేదికను ఎప్పటికప్పుడు ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. వారి సామాజిక పరివర్తన తీరును విశ్లేషించి తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. ఖైదీలకు సంబంధించిన తుది నివేదిక కాపీని వాళ్లు జైలు నుంచి విడుదలయ్యాక సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు. అక్కడ పోలీసులు వాళ్ల సామాజిక ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచుతారు. అవసరమైతే మంచి మార్పుతో బయటకు వచ్చిన ఖైదీల స్వీయ అనుభవాలతో పలువురికి కౌన్సిలింగ్ ఇప్పించే విధానాలు కూడా కార్యచరణలో ఉన్నాయి.
ఇప్పటికే పెద్ద జైళ్లలో ఖైదీలకు డైరెక్ట్ టెన్త్ ఇంటర్మీడియట్, దూర విద్యా విధానం ద్వారా డిగ్రీ, పీజీ చదువులు కొన సాగుతున్నాయి. ‘స్కిల్ ఇండియా’ ద్వారా ప్లంబింగ్, వెల్డింగు, వీవింగ్, టైల రింగ్ తదితర వృతుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జైళ్లలో తలపెట్టిన పరివర్తన తొలి దశా కార్యక్రమం విజయవంతం అయితే మలిదశలో మిగతా అన్ని జైళ్లకూ విస్తరించడం సాధ్యమవుతుంది. నేరాల సంఖ్య తగ్గి, శాంతి భద్రతలు కట్టుదిట్టమై, జైళ్ల నిర్వహణలో మన రాష్ట్రం దేశానికే స్ఫూర్తిగా నిలవనుంది.
చిలుకూరి శ్రీనివాసరావు
వ్యాసకర్త జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ‘ 89859 45506
పరివర్తనా కేంద్రాలుగా మన కారాగారాలు
Published Wed, Dec 13 2023 5:01 AM | Last Updated on Wed, Dec 13 2023 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment