ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేమిటి? | Sakshi Guest Columns On Five States Election | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేమిటి?

Published Sat, Dec 9 2023 5:20 AM | Last Updated on Sat, Dec 9 2023 5:20 AM

Sakshi Guest Columns On Five States Election

హిందీ ప్రాంతంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పొందిన ఘోర పరాజయం, తెలంగాణలో దాని అద్భుతమైన విజయాన్ని మరుగున పడేసింది. 2018లో తాను గెలిచిన మూడు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌) కాంగ్రెస్‌కు ప్రస్తుతం అతిపెద్ద దెబ్బ తగిలింది. బీజేపీ సమగ్ర విజయానికి కారణం, ఈ మూడు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మద్దతు లభించడం. అయితే కాంగ్రెస్‌ ఓడిపోయినప్పటికీ తన ఓట్ల వాటాను మాత్రం నిలుపుకోగలిగింది. బరిలో నిలిచిన ఇతరుల కారణంగా బీజేపీ అధికంగా ప్రయోజనం పొందింది. ఏదేమైనా, ఈ విజయాలతో 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, అత్యంత కీలక ప్రాంతంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకోగలిగింది. 

ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పొందిన ఘోర పరాజయం, తెలంగాణలో దాని అద్భుతమైన విజయాన్ని మరుగున పడేసింది. అయితే కాంగ్రెస్‌ ఓడిపోయినప్పటికీ మధ్య ప్రదేశ్‌లో 40.4 శాతం, రాజస్థాన్‌లో 39.5 శాతం, చత్తీస్‌గఢ్‌లో 42.23 శాతం ఓట్ల వాటాను నిలుపుకోగలిగింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాగ్రెస్‌కు లభించిన ఓట్ల శాతానికి గుర్తించదగిన ప్రాముఖ్యత ఉంది.

ముఖ్యంగా రాష్ట్రాల ఎన్నికల్లో స్థానికంగానూ, సార్వత్రిక ఎన్ని కల్లో జాతీయంగానూ ఓటర్లకు విజ్ఞప్తి చేయాలనే ఆశతో నిరుద్యోగం, కులవివక్ష వంటి అంశాలను ఎత్తిచూపడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయ త్నించింది. అయితే, హిందూ జాతీయ వాదం, మతతత్వ రాజకీ యాల సమ్మేళనం అనేవి కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం అనేవాటికంటే ఎక్కువ ఆదరణ పొందాయి. హిందూ జాతీయవాద ఏకీకరణతో బీజేపీ సాధించిన విజయాలు, కీలకమైన రాష్ట్రాల్లో అది అస్వాదిస్తున్న గొప్ప ప్రతిధ్వనిని ఎత్తి చూపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పుష్కలమైన ఆర్థిక వనరులను ఉపయోగించడం, ఆరెస్సెస్‌ కేడర్‌ శక్తిమంతమైన పునాదిగా ఉండటంతో బలమైన దేశం, అభివృద్ధి, సంక్షేమవాదాన్ని కోరుకునే పార్టీగా, హిందూమత ఛాంపియన్‌గా తనను తాను ప్రమోట్‌ చేసుకోవడానికి బీజేపీకి అవకాశం దొరికింది.

బీజేపీ ఎన్నికల ప్రచారం బలమైన రాష్ట్ర నాయకులను పక్కకు నెట్టివేసి, మొదటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే దృష్టి పెట్టింది. ఎన్నికలకు వెళ్లిన ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదించకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. దీనర్థం ఏమిటంటే, అశోక్‌ గెహ్లోత్, భూపేష్‌ బఘేల్‌ వంటి కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ రాష్ట్ర నాయకులు తమ స్థానిక బీజేపీ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా
కాకుండా మోదీకి వ్యతిరేకంగా పోటీ పడ్డట్టయింది. ఉత్తర, మధ్య భారతదేశంలో ప్రధానికి ఉన్న భారీస్థాయి ప్రజాదరణ, ఈ నాయకుల పట్ల ప్రజామోదాన్ని తటస్థింపజేసింది.

కర్ణాటకలో స్థానిక నాయకుల ప్రాచుర్యం, ప్రాముఖ్యత తెచ్చిన ఫలితాల అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వం, ఆ రాష్ట్ర నాయకులపై స్థిరమైన అంచనా వేసుకుంది. వారికి స్వేచ్ఛా హస్తాన్ని అందించింది. అయితే, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌లలో వారి నాయకుల అంతర్గత పోరు, మితిమీరిన ఆకాంక్షలు ఈ వ్యూహానికి చెల్లుచీటి పలికాయి. రాష్ట్ర నాయకత్వంలో చీలికలు అనేవి ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీర్ఘకాలంగా ప్రదర్శితమవుతూ వచ్చాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఇంటినే సక్రమంగా ఉంచుకోలేని పార్టీ అని ఓటర్లకు సందేశం పంపింది. రెండు రాష్ట్రాలలో పోరాడుతున్న నాయకుల మధ్య ఎట్టకేలకు ఒక ఒప్పందం కుదిరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

ముఠాతత్వానికి తోడుగా రాష్ట్ర నాయకత్వానికీ, అధిష్ఠానానికీ మధ్య సఖ్యత, ఏకాభిప్రాయం కనబడలేదు. దాంతో కాంగ్రెస్‌ ప్రచా రానికి పొంతన లేకుండా పోయింది. వారి గడ్డపై ఎలాంటి జోక్యాన్నీ శక్తిమంతమైన రాష్ట్ర నాయకులు ఇష్టపడలేదు. దీనికి విరుద్ధంగా, బీజేపీ ప్రచారం తీవ్రంగా సాగింది. తన దృష్టినంతా కేంద్రీకరించింది. పైగా ఆ పార్టీ ఒకే స్వరంలో మాట్లాడింది. ఇది ఆశ్చర్యకరం కాదు, ఎందుకంటే సమకాలీన బీజేపీ అత్యంత కేంద్రీకృతమైన పార్టీగా
ఉంది. అదే సమయంలో కాంగ్రెస్‌ తన గతం నుండి బయటపడటంలో భాగంగా సాపేక్షంగా వికేంద్రీకరణకు గురైంది.

పరిస్థితిని మరింత దిగజార్చుతూ, రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదు. బీజేపీతో పోరాడటానికి కలిసి వచ్చిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని 28 పార్టీలతో కూడిన ఇండియా గ్రూప్‌ పార్టీల మధ్య సఖ్యత రాష్ట్ర ఎన్నికలలో కనిపించలేదు. ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో రాష్ట్ర ప్రత్యేక పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఉండాలి. చేయడం కంటే చెప్పడానికి ఇది సులభంగా ఉంటుంది. ఏమైనా, సీట్ల పంపకం జరగలేదు. ఇది కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిని కూడా దెబ్బతీసింది. దీన్ని ఓటర్లు విభజించబడిన ఇల్లుగా భావించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల భవితవ్యం... బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోగలవని స్పష్టం చేస్తోంది.

ఓబీసీలలో బీజేపీకి ఉన్న మద్దతును తగ్గించడానికి కాంగ్రెస్‌ చేసిన పెద్ద పోరాటమే, కుల ఆధారిత జనాభా గణన. కానీ అది ‘నో–బాల్‌’గా మారింది. ఇదేమీ ప్రయోజనం ఇవ్వలేదు. ఈ పిలుపునకు క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం లేకుండా పోయింది. ఓబీసీ ఓట్లలో బీజేపీ వాటా పెరగడమే దీనికి నిదర్శనం. ఏమైన ప్పటికీ, కుల గణన కోసం డిమాండ్‌ అనేది, హిందూ గుర్తింపు రాజకీ యాలకు స్ఫూర్తిదాయకమైన లేదా ప్రభావవంతమైన ప్రతిఘటనా అంటే సందేహాస్పదంగా ఉంది. స్పష్టమైన రాజకీయ పార్శ్వం, లేదా దాని సందేశాన్ని తెలియజేయడానికి సమర్థవంతమైన ప్రచారం, సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత సమన్వయం లేకుండా... ఈ రాష్ట్రాలలో బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కుల రాజకీ యాలు, సామాజిక న్యాయ ఆలోచనలు సరిపోవు.

రాష్ట్ర, జాతీయ ఎన్నికల మధ్య సంబంధం ఉంటుందనే దానికి పరిమితమైన రుజువు మాత్రమే ఉంది. అయినప్పటికీ, వరుస పోటీలలో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ నిర్ణయాత్మక ఓటమి దాని విశ్వసనీయతను దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. పైగా లోక్‌సభ ఎన్నికలు కేవలం ఐదు నెలల దూరంలో ఉన్న కీలక సమయంలో ఈ ఓటమి ఆ పార్టీని నిరుత్సాహపరుస్తుంది కూడా. అయితే, ఈ క్లిష్టమైన రాష్ట్రాల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీయేతర పార్టీలను ఎంచుకున్నందున మొత్తంగా ఆశ పోలేదని కూడా చెప్పవచ్చు.

కాంగ్రెస్‌ ఈ ప్రాతిపదికన నిర్మాణం కావాలి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే, అది స్పష్టమైన సైద్ధాంతిక కథనాన్ని ప్రదర్శించాలి. అలాగే దాని సొంత రాజకీయాలను వ్యక్తీకరించాలి. మొదటగా, అది బీజేపీని ‘మరింత హిందూ’ పార్టీగా అధిగమించడానికి ప్రయత్నించకూడదు. దానికోసమే అయితే, ఓటర్లు బీజేపీనే ఎంచుకునే అవకాశం ఉంది. సైద్ధాంతిక ప్రతిఘటన అనేది తప్పని సరిగా హక్కుల ఆధారిత సంక్షేమం, ప్రత్యేకించి సామాజిక సామ రస్యంతో ముడిపడి ఉన్న ఉపాధి హామీలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి సంబంధించి విభిన్న నమూనాను ప్రతిబింబించాలి. మొత్తానికి, కాంగ్రెస్‌ తన రాజకీయ చర్చను పున:ప్రారంభించాలి. పాలకపక్ష పాలనలోని ప్రతికూల అంశాలు, వాటినుండి గ్రహించిన తప్పులు, వారు ప్రచారం చేసిన రాజకీయాలపై దృష్టి పెట్టడం కంటే... ఓటర్లను ఉత్తేజపరిచే సానుకూల ఎజెండాను సమర్థించడం ద్వారా మేలు జరుగుతుంది. 

-వ్యాసకర్త ప్రొఫెసర్‌ ఎమెరిటా, సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ స్టడీస్, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement