జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగు తూనే ఉంది. కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. పైగా కేంద్రం దొడ్డి దారిన రకరకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. అందులో వాటాను మాత్రం రాష్ట్రాలకు పంచడం లేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమ న్వయం, సహకారం పెరిగేందుకు గతంలో ఏర్పడిన కమిషన్లు పలు కీలక సిఫార్సులు చేశాయి. అవి అమలునకు నోచుకోకపోవడంతోనే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది.
.
‘నేతిబీరలో నెయ్యి చందం దేశంలో సహ కార సమాఖ్య స్ఫూర్తి’ అని అన్నారు ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. రాష్ట్రాలకు అందించే నిధులు, హక్కులకు సంబంధించికేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వపు పోకడల పట్ల విసిగి పోయి తమ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రులు గతంలో చాలా మంది ఉన్నారు.
జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని భారత రాజ్యాంగంలోని 256–263 వరకు ఉన్న అధికరణలు నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు హయాం నుంచి నేటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం పెరిగేందుకు గతంలో సర్కారియా కమిషన్, పూంఛ్ కమిషన్‌లు పలు కీలక సిఫార్సులు చేశాయి. కానీ, అవన్నీ అమలునకు నోచుకోకపోవడంతోనే... సహకారం కొరవడింది, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది.
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ నాటి యూపీఏ ప్రభుత్వ కేంద్రీకృత విధానాలను విమర్శిస్తూ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకై బలంగా గొంతెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అనుసరించిన మార్గంలోనే పయనిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరీముఖ్యంగా దక్షిణ భారతం పట్ల మోదీ వివక్ష చూపిస్తున్నారన్న భావన ప్రజలలో క్రమేపీ బలపడుతోంది. ఇది ఎంత దూరం వరకు వెళ్లిందంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపే ఈ వివక్ష ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతాన్ని
ఓ ప్రత్యేక దేశంగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుందని కర్ణాటకకు చెందిన కొందరు మంత్రులు ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతి ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వ పన్నులు, ఇతర ఆదాయాల్లో విభజించ దగ్గ మొత్తాలను (డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్) పంచడానికి, భారత రాజ్యాంగంలోని అధికరణ 290 ప్రకారం, 1951 నుంచి ప్రతి ఐదేళ్లకోమారు ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రాల అర్థిక అవసరాలు తీర్చడానికి పన్ను ఆదాయాల్లో గణనీయమైన భాగం రాష్ట్రాలకు అందాలని ఆర్థిక సంఘాలు ఎప్పటికప్పుడు సిఫార్సులు చేస్తూ వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతానికి పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని 41 శాతంకు కుదించి, 1 శాతం పన్నును కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ, కశ్మీర్‌లకు బదలాయించాలని కేంద్రానికి సూచించింది. అయితే, పేరుకు 41 శాతంగా పైకి కనపడుతున్నప్పటికీ వాస్తవంగా 31 శాతం నిధులే అందుతున్నాయని బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. అయినప్ప టికీ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆదాయం పెంచుకొనేందుకు రక రకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. వీటిద్వారా వచ్చే రాబడిని రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. సర్‌చార్జీలు, సెస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం పొందుతున్న మొత్తం పన్నుల వాటాలో 20 శాతం మేర ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక ఉగ్రవాదం అని పిలుస్తున్నాయి. అందువల్లనే ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం... రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని బీజేపీయేతర ప్రభు త్వాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.
సెప్టెంబర్ 11న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ యేతర దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, చేసిన డిమాండ్లను పరిశీలిస్తే కేంద్రంతో రాజీలేని పోరాటం చేయడానికి ఈ రాష్ట్రాలు సమాయత్తం అయినట్లుగా కనబడుతుంది. నిధుల కేటాయింపునకు కేంద్రం అనుస రిస్తున్న విధివిధానాల్లో శాస్త్రీయత లోపించిందన్నది నిర్వివాదాంశం. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తు న్నది.
దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలే. చారిత్రకంగా మొదట్నుంచీ దక్షిణాది రాష్ట్రాలు... ఉత్తరాది రాష్ట్రాలకంటే ఆర్థికంగానూ, ఇతరత్రా పలు అంశాల్లోనూ మెరుగ్గా ఉన్నాయి. దేశ విభజన పరిణామాలు ఉత్తరాది రాష్ట్రాల మీద ప్రతి కూల ఫలితాలు చూపాయి. మత, కులపర వైషమ్యాల కారణంగా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి అడుగంటింది. అదే సమయంలో పలు సామా జిక, సాంస్కృతిక ఉద్యమాల కారణంగా దక్షిణాదిలో విద్యకు ప్రాధాన్యం లభించింది. 1990 దశకంలో దేశంలో ప్రారంభమైన సంస్కరణల ఫలితాలను, ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్, ఫార్మా తదితర రంగాలలో వచ్చిన విప్లవాలను దక్షిణాది రాష్ట్రాలు సద్వినియోగపర్చుకొని ఆర్థికంగా ముందంజ వేశాయి. నిధుల కేటాయింపునకు మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రాల పని తీరును, ప్రతిభను కొలమానంగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాలు గత రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికీ, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చడానికీ... ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగానైతే అధిక నిధుల్ని ఖర్చుచేస్తాయో... అదే నమూనాను జాతీయస్థాయిలో అమలు చేసి వెనుకబడిన రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించడంలో తప్పేముందని ఉత్తరాది రాష్ట్రాల ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం... భారత కన్సాలిడేషన్ ఫండ్‌కు ఏటా జమ అవుతున్న లక్షల కోట్ల కార్పొరేట్ పన్నుల మొత్తం నుంచి ఖర్చు చేయవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అయింది.
రాష్ట్రాలు తమ వాదనలను నీతి ఆయోగ్ సమావేశాలలోవిన్పించే అవకాశం ఉంది. కానీ, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, దానిస్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కేవలం కేంద్రానికి సలహా లిచ్చే ఓ సంఘంగానే మిగిలిపోయింది. ‘నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లడం శుద్ధదండగ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని మమతా బెనర్జీతో సహా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించడం గమనార్హం!
ఇక, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్వి భజించాలని కేంద్రం యోచిస్తున్న పూర్వరంగంలో దక్షిణాది రాష్ట్రా లకు తీరని నష్టం కలగడమేకాక... కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పోషించే నిర్ణయాత్మక పాత్ర, వాటి పలుకుబడి గణనీయంగా తగ్గిపోతాయి. అదే జరిగితే ఎన్.టి. రామా రావు చెప్పినట్లు నేతిబీరలో నెయ్యి చందంగా సహకార సమాఖ్య వ్యవస్థ తయారవుతుంది. రాష్ట్రాల సూచనలను పట్టించుకోకుండా కేంద్రం ఒంటెత్తు పోకడలకు పోతే సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడటం తథ్యం!
-డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు; కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment