ఉత్తర దక్షిణాదుల ఓటింగ్‌ వైఖరి | Voting Attitudes of North and South | Sakshi
Sakshi News home page

ఉత్తర దక్షిణాదుల ఓటింగ్‌ వైఖరి

Published Tue, Dec 19 2023 12:14 AM | Last Updated on Tue, Dec 19 2023 12:14 AM

Voting Attitudes of North and South - Sakshi

భారతదేశంలో రెండు భిన్నమైన దేశాలున్నాయని చాలాకాలంగా ఒక ఆలోచన ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశాలన్నమాట! అందుకే వాటి ఓటింగ్‌ ధోరణి కూడా భిన్నంగా ఉంటోంది. ముఖ్యంగా బీజేపీ తలకెత్తుకున్న హిందూ జాతీయవాదం విషయంలో. ఇది, ముస్లిం వ్యతిరేక భావజాలం నుంచి విడదీయ లేనిది.

అయితే, కొంతమంది చరిత్రకారుల అంచనాల ప్రకారం ఔరంగజేబు, టిప్పూ సుల్తాన్  ఇద్దరినీ ఒక గాటన కట్టలేము. అలాగే హైదరాబాద్‌ ఏడవ నిజాం వారసత్వ పాలనకే మొగ్గు చూపాడు కానీ ముస్లింల పాలనకు కాదు. ఇక, ఉత్తర భారతదేశంతో పోలిస్తే సంక్షేమ రాజకీయాలు దక్షిణాదిలో చాలాకాలంగా నడుస్తున్నాయి. దీనివల్ల ఉత్తరాదిలోలా ‘రహదారులు, వంటగ్యాస్‌’ కథనాలు కూడా చెల్లవు. అందుకే భిన్న రాజకీయాలు అవసరం.

ఎన్నికలైన ప్రతిసారీ ఫలితాలను సులువుగా విశ్లేషించడం ఎలా అన్న ప్రశ్న ఉదయిస్తూంటుంది. కొన్నిసార్లు తేలికగా ఫలితాలను విశ్లేషించవచ్చు కూడా. ఉదాహరణకు 2019లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి విజయం! కానీ పలు అంశాలు మిళితమైన ఎన్నికలను పరిశీలించే సందర్భంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. హిందీ బెల్ట్‌లో మోదీ ప్రాచుర్యాన్ని కాసేపు పక్కన బెడితే తెలుసుకోవాల్సిన అంశం ఏదైనా ఉందా? విజేతలు, పరాజితుల మధ్య ఓట్ల అంతరాలను పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్లలో ఎనిమిది శాతం భారీ అంతరమున్న మధ్యప్రదేశ్‌ను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో పోలైన ఓట్లకూ, సాధించిన సీట్లకూ మధ్య సారూప్యత దగ్గరగానే ఉంది. ఓట్లకూ, సాధించే సీట్లకూ మధ్య సంబంధం ఉండదన్నది భారతదేశంలో అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థ ప్రత్యేకత. అయితే ఈ తేడా ఎన్నికలపై చూపే ప్రభావం మాత్రం కచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల విషయంలో. కానీ బీజేపీ సాధించిన ఓట్లు మాత్రం కచ్చితంగా పెరిగాయి. చత్తీస్‌గఢ్‌లో ఇరు పార్టీల మధ్య అంతరం నాలుగు శాతం వరకూ ఉంటే, రాజస్థాన్ లో ఇది కేవలంరెండు శాతమే. కాంగ్రెస్‌ తన వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకుని ఉండగలిగితే పరాజయం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ కేవలం రెండు శాతం అదనపు ఓట్లతో అధికారం దక్కించుకున్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మోదీ చరిష్మాను మరింతపెంచుతాయని ఒప్పుకొన్నా... బీజేపీ తరచూ చేసే నినాదం ‘మోదీ హై తో ముమ్‌కిన్ హై’కు అందుబాటులో ఉన్న డేటా మాత్రం మద్దతివ్వడం లేదు. తెలంగాణలో మోదీ మాయ పనిచేయలేదు. ప్రధాన పార్టీలకు బాగా వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉత్తర భారతంపై ఎక్కువ దృష్టి పెట్టి తెలంగాణను తక్కువ అంచనా వేస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేదు. దేశ జనాభాలో దాదాపు నాలుగో వంతు ఈ ఐదు రాష్ట్రాల్లో ఉంది. ఉత్తర భారతంలో పరిస్థితి భిన్నం. 43 శాతం జనాభా ఉండగా చాలా రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. గుజరాత్‌ను కూడా ఉత్తర భార తానికి జోడిస్తే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతమేదో స్పష్టమవుతుంది. 

ఈ ఏడాది మొదట్లోనూ బీజేపీ ప్రభావ అంశం ఒకసారి వెలుగులోకి వచ్చింది. బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పుడు వచ్చిందీ చర్చ. బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న అంచనాలు వేసే ముందు... బీజేపీని ఉత్తర భారతం నెత్తిన పెట్టుకునేందుకు, దక్షిణాన తిరస్కారం ఎదురవుతున్నందుకు ఉన్న కారణాలేమిటన్నది చూద్దాం.

దక్షిణాది పూర్తిగా బీజేపీ ముక్తం కాలేదు. రెండో అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఓడిపోయింది. కానీ అక్కడ బీజేపీకి 36 శాతం ఓట్లున్నాయి. తెలంగాణలో ఎన్నికల్లోనూ తన మునుపటి ఓట్లను రెట్టింపు చేసుకుని 14 శాతానికి చేరింది. అయితే ఈ అంకెలు దక్షిణాదిలో బీజేపీ ఉనికిని సూచించేవి మాత్రమే. రాజకీయ రంగంలో ఉనికిలో ఉండటాన్ని మాత్రమే బీజేపీ కోరుకోవడం లేదు. మరిన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని అనుకుంటోంది. 

భారతదేశంలో రెండు భిన్నమైన దేశాలున్నాయని చాలాకాలంగా ఒక ఆలోచన ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశాలన్నమాట! ద్రావిడ ఉద్యమంలో మొదటిసారి ఈ భావన ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే దశాబ్దాల కాంగ్రెస్‌ ఆధిపత్యం సాగిన సమయంలో ఈ తేడా అంత స్పష్టంగా ఉండేది కాదు. కనీసం రాజకీయాలు, ఎన్నికల విషయంలో ఇది వాస్తవం. 1970ల మధ్యలో వచ్చిన అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) తరువాత పరిస్థితి మారిపోయింది. 1977 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇరు ప్రాంతాల మధ్య వైరుద్ధ్యాన్ని మరింత స్పష్టం చేశాయి. ఇందిరాగాంధీ ఉత్తరాన ఓటమి పాలైతే దక్షిణాన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ జాతీయ స్థాయి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన విషయం కూడా తెలిసిందే. 

బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా రాణించకపోయేందుకు కారణాలేమిటి? కొన్ని చారిత్రాత్మకమైనవి, మరికొన్ని సైద్ధాంతికమైనవి. బీజేపీ తలకెత్తుకున్న హిందూ జాతీయవాదం... ముస్లిం వ్యతిరేక భావజాలం నుంచి విడదీయలేనిది. అభివృద్ధి, పరిపాలన మాత్రమే రాజకీయ లాభాలు తెచ్చిపెట్టవు. ముస్లిం పాలకుల ‘చారిత్రక తప్పిదాల’ పేరిట ముస్లిం వర్గాల పట్ల వ్యతిరేకత లేకపోతే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితిలో ఉండేది కాదు. 

అయితే ఈ రకమైన హిందూ జాతీయవాదానికి దక్షిణాదిలో ముస్లింలు రాజ్యాలేలిన ప్రాంతాల్లోనే కొద్దిపాటి మన్నన లభిస్తుంది. వారి పాలనలో అన్యాయం జరిగిందని చూపించడం లేదా ప్రచారం చేయడం ద్వారా ఈ పార్టీ లాభపడే అవకాశం ఉంటుంది. మైసూరు రాజు టిప్పూ సుల్తాన్ పై కర్ణాటకలో తరచూ వివాదాలు నెలకొనడం ఇందుకే. టిప్పూ సుల్తాన్  18వ శతాబ్దానికి చెందిన వారైతే, హైదరాబాద్‌లో 1911–48 మధ్య రాజ్యమేలిన నిజాములున్నారు. కొంతమంది చరిత్రకారుల  అంచనాల ప్రకారం ఔరంగజేబు, టిప్పూ సుల్తాన్  ఇద్దరినీ ఒక గాటన కట్టలేము. అలాగే హైదరాబాద్‌ ఏడవ నిజాం వారసత్వ పాలనకే మొగ్గు చూపాడు కానీ ముస్లింల పాలనకు కాదు. అయితే రజాకార్లనే హిందూ వ్యతిరేక వర్గం నిజాం పాలన చివరి దశాబ్దంలో (1938– 48) నిజాం తరఫున పనిచేసింది.

హిందూ జాతీయవాదాన్ని చర్చలో ఉంచేందుకు బీజేపీకి తెలంగాణ, కర్ణాటకల్లో కొన్ని చారిత్రక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో అలాంటివి లేవు. ఇక్కడ హిందూ జాతీయవాదం పెద్దగా పనిచేయదు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాదిన అభివృద్ధి ఎక్కువ కావడం, సంక్షేమ రాజకీయాలు దక్షిణాదిలో చాలాకాలంగా నడుస్తూండటం వల్ల ఉత్తర భారతదేశంలో బీజేపీ వినిపించే ‘రహదారులు, వంటగ్యాస్‌’ కథనాలు కూడా చెల్లవిక్కడ. 

హిందూ జాతీయ వాదంలో ఇంకో అంశమూ ఉంది. హిందీ! దక్షిణాదిలో ఈ భాషాధిపత్య ధోరణీ చెల్లుబాటు కాదు. హిందీని రాజభాషగా చేయాలన్న డిమాండును 1980లల్లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ వదిలేసుకుందని చరిత్రకారులు చెబుతూండటం ప్రస్తావనార్హం. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పాఠశాలల్లో ప్రాంతీయ భాషల్లోనూ బోధన జరుగుతూండటం తెలిసిందే. అయినప్పటికీ హిందీ జాతీయవాదం పేరుతో జరిగే పెత్తనాన్ని దక్షిణాదిలోని మేధోవర్గం సులువుగా గుర్తించగలుగుతోంది. రాజకీయ పార్టీలూ ఈ విషయాన్ని విస్పష్టంగా బహిరంగ పరిచాయి కూడా. దక్షిణాది వారికి తమ భాష, వారసత్వాలపై గౌరవం మెండు. తప్పు కాదు కూడా.

తమ భారతీయతను ఇష్టపడుతూనే... హిందీ, హిందూ జాతీయతా భావజాలాలు తమ సాంస్కృతిక ఏకతను దెబ్బతీస్తున్నాయన్న భావన వారిలో ఉంది. దక్షిణాది మద్దతు లేకుండానే బీజేపీ మరోసారి ఢిల్లీ గద్దెను ఎక్కవచ్చు. సంఖ్యల్లోని తర్కంలో ఇదంతా ఇమిడివుంది. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ దీన్ని మరింత సులభతరం చేయొచ్చు. కానీ దక్షిణాది నుంచి వచ్చే ఉచితమైన ఫిర్యాదులను బీజేపీ విస్మరిస్తుందా? ఇది వెంటాడే గుణం ఉన్న ప్రశ్న.

- వ్యాసకర్త బ్రౌన్  యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ స్టడీస్, సోషల్‌ సైన్సెస్‌ అధ్యాపకులు
- అశుతోష్‌ వార్ష్‌ణాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement