పర్చూరులోని ప్రధాన సెంటర్
టీడీపీ ఓట్ల దందా రట్టు కానుంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయి నుంచే మేనేజ్ చేస్తోంది. ఎక్కడున్నా ‘మన’వారిని జాబితాలో చేర్పించి పబ్బం గడుపుకుంటోంది. అవకాశం ఉన్న మేర చేర్పుల్లో పచ్చమార్కు కనిపిస్తుంది. కిందస్థాయి అధికారులు చూసిచూడనట్లు వెళ్లారు. గత కొన్నేళ్లుగా పర్చూరు నియోజకవర్గంలో ఇదే తంతు నడుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ విచారణతో దొంగ ఓట్ల లెక్క తేలనుంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్‌కు ఫారం–7 దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. మార్టూరు, కారంచేడు, యద్దనపూడి మండలాల్లో అత్యధికంగా దొంగ ఓట్లు ఉండగా మిగిలిన మండలాల్లోనూ ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మృతుల ఓటర్లతో పాటు నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో స్థిరపడినవారి ఓట్లు అలాగే ఉంచుకున్నారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లినా వారి ఓట్లు తొలగించకపోగా కూతురు కుటుంబం తరఫున ఓట్లు చేర్పించారు. అక్రమ ఓట్లను తొలగించాలని పర్చూరు నుంచి ఎన్నికల కమిషన్‌కు ఇప్పటి వరకు 13, 356 ఫిర్యాదులు అందాయి. దీనిపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది.
దొంగ ఓట్లతోనే టీడీపీ గెలుపు..
పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లే టీడీపీ బలం. ఎన్నికల ఫలితాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. టీడీపీ ఆవిర్భవించిన 1983 నుంచి ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా ఆ తరువాత 1999, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ గెలిచిన ఆరుసార్లలో ఐదుసార్లు కేవలం వెయ్యి నుంచి ఆరు వేల లోపు ఓట్లతో మాత్రమే గెలుపొందింది.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేవలం 1,647 ఓట్లతో విజయం సాధించారు. 1985లో 1,077 ఓట్లతో, 1999లో 2,209, 1983లో 6,614 , 1989లో 6,828 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి 10,775 ఓట్లతో విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి 15 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం నాలుగుసార్లు మాత్రమే 10 వేలకు పై చిలుకు ఓట్లతో అభ్యర్థులు గెలిచారు. 1967, 1991లో కాంగ్రెస్ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి 10 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందగా, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2014 టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావులకు 10 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది.
దొంగ ఓట్లు పోతే గెలుపు తారుమారే..
నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగిస్తే గెలుపోటములు తారుమారయ్యే పరిస్థితి. గత ఎన్నికల ఫలితాలు చూస్తే సగటున ఆరువేల ఓట్ల మెజారిటీకి మించి ఇక్కడ ఏ అభ్యర్థి గెలుపొందలేదు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేవలం 1,647 ఓట్లతో మాతమ్రే నెగ్గారు. నియోజకవర్గంలో ఇప్పటికే 13 వేల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. పది వేలకు తక్కువ లేకుండా దొంగ ఓట్లు ఉంటాయని పచ్చపార్టీ నేతలే చెబుతున్నారు. విచారణ అనంతరం దొంగ ఓట్లను తొలగిస్తే ఇక్కడ టీడీపీకి కష్టకాలమే.
భుజాలు తడుముకుంటున్న పచ్చనేతలు...
వేలాదిగా వస్తున్న ఫిర్యాదులతో దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా స్వయంగా విచారణ చేపట్టారు. దీంతో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారంటూ రాద్ధాంతానికి దిగారు. తమకున్న పచ్చపత్రికలు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నానాయాగీ చేశారు. దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుగా ఎన్నికల కమిషన్‌ను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
మరో వైపు దొంగ ఓట్లపై ఫిర్యాదులు పెరిగాయి. పర్చూరులో ఇప్పటి వరకు దొంగ ఓట్ల పుణ్యమాని అరకొర మెజార్టీతో నెగ్గుకు వస్తున్న టీడీపీకి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఏమి చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా దొంగ ఓట్లను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment