గ్యాస్ సిలిండర్లు పేలి ఒకరు మృతి
పెదకాకాని: గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన అమ్మిశెట్టి శ్రీనివాసరావు కుటుంబం ఆదివారం కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంట్లో దీపారాధన, పూజలు చేసింది. తర్వాత గ్రామ శివారులోని నాగేంద్రస్వామి పుట్ట వద్దకు అందరూ వెళ్లారు. పూరిల్లు ఒక్కటే అయినప్పటికీ రెండు పోర్షన్‌లు ఉన్నాయి. రెండవ పోర్షన్‌లో ఆయన కుమార్తె నల్లూరి సుజాత నివసిస్తోంది. ప్రమాదవశాత్తూ ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగా మంటలు వ్యాపించాయి. పూరిల్లు అగ్నికి ఆహుతి అవుతున్న క్రమంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌లు రెండు ఒకదాని తరువాత మరొకటి పేలడంతో చుట్టు పక్కల వారు కూడా దగ్గరకు రావడానికి భయపడ్డారు. మంటలు ఆర్పేందుకు కూడా ముందుకు రాలేదు. ఇంటిలో ఉన్న మరొక గ్యాస్ సిలిండర్ పేలి దాని ముక్కలు తగిలి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అమ్మిశెట్టి తులసీనాఽథ్, గుంటముక్కల పరమేష్, గుంటముక్కల మల్లికార్జున, గుంటముక్కల వీరాంజనేయులును స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. తలకు తీవ్రగాయాలైన అమ్మిశెట్టి తులసీనాఽథ్(37) మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పెదకాకాని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. అమ్మిశెట్టి తులసీనాఽథ్ అప్పటి వరకూ పొలానికి గడ్డిమందు వేసి ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అత్త ఇంటికి వచ్చాడు. వారి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ తొలగించాడు. ఇంజిన్ శుభ్రం చేసి రోడ్డుపైకి చేరే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఆయనకు భార్య లక్ష్మీతిరుపతమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో ముగ్గురికి గాయాలు దీపం మంటలు అంటుకుని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment