విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
గుంటూరు వెస్ట్: కళాశాల ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు యాజమాన్యాలు ఇబ్బందులు కలిగించకూడదని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం పేర్కొన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ జరగని కారణంగా హాల్ టిక్కెట్లు ఇవ్వకపోవడం, ప్రాక్టికల్స్, తరగతులకు రానివ్వకపోవడం వంటివి చేయొద్దని తెలిపారు. కొన్ని యాజమాన్యాలు ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని కళాశాలలకు దీనిపై నిర్దిష్టమైన సూచనలు జారీ చేయాలన్నారు.
యూటీఎఫ్ గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా యు.రాజశేఖర్‌రావు, ఎం. కళాధర్‌లు ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్జీవో కళ్యాణ మండపంలో జరిగిన యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా జిల్లా శాఖకు నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా పీవీ శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారిగా ఎండీ గయాసుద్దౌలా, కార్యదర్శులుగా సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి. వెంకటేశ్వరరావు, టి.ఆంజనేయులు, ఎం.గోవిందు, కె. కేదార్‌నాఽథ్, ఎండీ షకీలాబేగం, కె.కామాక్షి, బి.ప్రసాద్ ఎన్నికయ్యారు.
తిరునాళ్ల జెండా ఆవిష్కరణ
గుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో పునీత శౌరి వారి తిరునాళ్ల జెండా ప్రతిష్ట కార్యక్రమంతో పండుగను ఆదివారం ఫాదర్ పామిశెట్టి బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మొదటి దివ్య బలిపూజలో ఫాదర్ పునీత శౌరి వారు –క్రీస్తురాజుని ప్రకటించుట గురించి భక్తులకు వివరించారు. భక్తులకు శౌరి వారి వస్త్రముతో కూడిన బంగారు ఉంగరంతో ముద్దును అందజేశారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శౌరి వారి పుణ్యక్షేత్రం ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్, మఠకన్యలు, గుడి పెద్దలు, గ్రామ క్రైస్తవులు భక్తులు పాల్గొన్నారు.
7 నుంచి క్యారమ్స్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్, చిత్తూరు జిల్లా క్యారమ్స్ సంఘం సంయుక్తాధ్వర్యంలో వచ్చే నెల 7, 8వ తేదీల్లో ఏపీ 3వ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్స్ టోర్నమెంట్ ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పట్టణంలోని రెవెన్యూ భవన్ ప్రాంగణంలో పోటీలు ఉంటాయన్నారు. పురుషులు, మహిళలు, వెటరన్స్ విభాగాల్లో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 99511 15678 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు మృతి
పట్నంబజారు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో వాటిపై వస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవభారత్‌నగర్‌కు చెందిన దాసరి రమేష్ (65) ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి బృందావన్ గార్డెన్స్ మీదుగా తిరిగి వస్తున్నాడు. అదే క్రమంలో కొరిటెపాడుకు చెందిన బి. మల్లేష్ (20) మారుతీనగర్‌లో అయ్యప్ప మాల ధరించిన నేపథ్యంలో భజనకు వెళ్లి ఇంటికి బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో రింగురోడ్డు వద్ద వీరి వాహనాలు ఢీకొన్నాయి. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం దాసరి రమేష్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా జీజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో జీజీహెచ్‌కు తరలిస్తుండగా అతడు మృతి చెందాడు. మల్లేష్ ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment