తీరం..భక్తజన సంద్రం
బాపట్లటౌన్: సూర్యలంక సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 2 లక్షల మేర పర్యాటకులు తీరానికి చేరుకోవడంతో తీరం ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. మరోవారం రోజుల్లో కార్తికపౌర్ణమి ముగియనుండటంతో పర్యాటకులు, భక్తులు ఆదివారం తీరానికి ఒక్కసారిగా పోటెత్తారు. తీరంలో పలు సామాజిక వర్గీయులు కార్తిక వనసమారాధనలు నిర్వహించడంతో తీరంలో పర్యాటకుల, భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహిళలు తెల్లవారుజామునే సూర్యలంక తీరానికి చేరుకొని తీరం ఒడ్డున పసుపు, కుంకుమ, ఐదురకాల పూలు, పండ్లతో గౌరీదేవి పూజలు నిర్వహించి తీరంలో స్నానాలాచరించారు. స్నానాలు చేసేందుకు, ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహించేందుకు సూర్యలంక తీరం అనువుగా ఉండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. తీరం వెంబడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తాలుకా పోలీసులు చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని రీతిలో తీరానికి వాహనాలు భారీస్థాయిలో చేరుకోవడంతో పార్కింగ్ స్థలం వాహనాలతో కిక్కిరిసింది.
కిలోమీటరు దూరంలో నిలిచిన వాహనాలు
ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు తీరానికి చేరుకొని సూర్యనమస్కారాలతో కూడిన స్నానాలు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం 9 గంటల వరకు తీరం వెంబడి వరకు అనుమతించిన వాహనాలు భక్తులు, పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో వాహానాలను తీరానికి అర కిలోమీటరు దూరంలోనే నిలుపుదల చేశారు. సుమారు 2 లక్షల మేర పర్యాటకులు వచ్చినట్లు అంచనా. రోడ్డుపై కిలోమీటరు దూరంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్‌చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. స్నానాలనంతరం సూర్యలంక తీరంలో ఏర్పాటుచేసిన తారకేశ్వరస్వామి దేవాలయం, ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో తీరంలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తీరం వెంబడి, ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన, గౌరీదేవి పూజలు, పుష్పార్చన కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ప్రత్యేక బందోబస్తు
తీరానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐలతో తీరంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. తీరంలోని వాచ్‌టవర్‌పై నుంచి ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని గమనిస్తూ పర్యాటకులు, భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయి తీరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 17 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 6 బోట్లు ఏర్పాటుచేసిన గజ ఈతగాళ్లు తీరంలోనికి ఎవరిని పోనివ్వకుండా ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించారు.
పర్యాటకులతో నిండిన సూర్యలంక తీరం దాదాపు 2 లక్షల మంది సందడి పెద్దసంఖ్యలో వాహనాల్లో రాక వన సమారాధనలతో తోటలు కళకళ గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అష్టకష్టాలు పడిన పోలీసులు తీరంలో గస్తీ నిర్వహించిన పోలీసులు, గజ ఈతగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment