మహిళల సంరక్షణ కోసం మహిళా.. మీ కోసం
నగరంపాలెం: మహిళల సంరక్షణ కోసం ‘మహిళా.. మీకోసం’ అంటూ ఒక వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ నూతనంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నగరంపాలెం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఆమెతో పాటు నగర కమిషనర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక మహిళగా రాత్రివేళల్లో ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే కొన్నిసార్లు ఆలోచిస్తామన్నారు. ఆ సమయంలో మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తే మహిళగా తమకు ఎంతో ధైర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి భరోసా, భద్రతను కల్పించే సరికొత్త కార్యక్రమానికి జిల్లా పోలీస్ శాఖ ఆచరణలోకి తీసుకురావడం హర్షణీయమని చెప్పారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆ మార్గంలో ప్రయాణించేందుకు భయంగా ఉందని మహిళలు చెప్పేవారని అన్నారు. అటువంటి మార్గాల్లో మహిళల భద్రత కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చేదని పేర్కొన్నారు. అటువంటి ఆలోచనకు శ్రీకారం చుడుతూ ‘మహిళా..మీ కోసం’ అంటూ అమల్లోకి తీసుకురావడం బాగుందని తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ కార్యక్రమ ఆవిష్కరణకు నెల రోజులుగా శ్రమించామని అన్నారు. మహిళలు ఆపద తలెత్తితే 9746414641 నంబర్ ద్వారా సహాయం పొందవచ్చునని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, శాసీ్త్రయ నృత్యాలు, లఘు నాటికల ప్రదర్శనలు, కళాశాలల విద్యార్థుల ప్రసంగాలు నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన వారిని సత్కరించి, జ్ఙాపికలు అందజేశారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు.
ఆపద వేళల్లో మహిళలకు
97464 14641 ద్వారా సహాయం
పచ్చజెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్, నగర కమిషనర్, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment