ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన తెలంగాణ రైతులు
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడిలో సాగులో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు సోమవారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పంటలు పండించి విజయాలను సాధిస్తున్న స్థానిక రైతులను కలిశారు. సాగు వివరాలు, దిగుబడి, పంట నాణ్యత గురించి తెలుసుకున్నారు. వడ్లమూడి రైతులు సూర్యదేవర ఉమామహేశ్వరరావు, పాటిబండ్ల శ్రీధర్ సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో వరి పంటలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పండించడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా ఉంటుందని, దిగుబడి కూడా బాగుంటుందని రైతులు వివరించారు. వరి ఒకటే కాకుండా, గట్ల మీద రకరకాల కూరగాయలు పండించుకొని తినడం ద్వారా వారి ఆరోగ్యంతో పాటు కొంత ఆదాయం కూడా వస్తుందని తెలంగాణ రైతులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తామని తెలంగాణ రైతులు తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జిలు అభిలాష్, అనూష, మైలా వెంకటరామరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీవో నాయకుడు బ్రహ్మారెడ్డి మృతి
గుంటూరు మెడికల్: ఏపీ ఎన్జీవో అమరావతి తాలూకా అధ్యక్షుడు వజ్రాల బ్రహ్మారెడ్డి(56) గుండె సంబంధిత వ్యాధితో ఆదివారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్య ఆరోగ్య శాఖ చిలకలూరిపేటలో ఎంపీహెచ్‌ఈఓగా బ్రహ్మారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శెట్టిపల్లి సతీష్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, తదితరులు బ్రహ్మారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment