వరంగల్: పోలీస్‌శాఖలో బదిలీలు, పోస్టింగ్‌లపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై అందిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) స్పందించింది. వరంగల్, కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్‌లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీసు అధికారుల పోస్టింగ్‌ల్లో కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు.
అత్యధికంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 21 మందికి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ముగ్గురు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం, వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్‌ఓయూ 3/ 2023 ద్వారా రాశారు.
అడుగడుగునా ఉల్లంఘనలే...?
ఫిర్యాదుల పరంపరపై ఆరా...
ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని లెటర్ నంబర్ 437/6/1/ఐఎన్‌ఎస్టీ/ఈసీఐ/ఎఫ్‌యుఎన్‌సీటీ/ఎంసీసీ/2023 ద్వారా తేదీ 02.06.2023న కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పేర్కొంది. అందుకు విరుద్ధంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనేక మందికి తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ తరహా పోస్టింగ్‌లకు సంబంధించి 51 మంది పేర్లతోపాటు వారు ఎక్కడెక్కడ, ఎంతకాలం పని చేశారన్న వివరాలను ఫిర్యాదులో చేర్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21 మంది పో స్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదం అయ్యాయి.
ఈ పోస్టింగ్‌ల పైనే వివాదం..
నాలుగేళ్లలో మూడేళ్లు పూర్తి చేసిన కొందరికి అదే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని ఫిర్యాదులున్నాయి. చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్న ఎన్నికల కోడ్ వర్తించే అధికారుల జాబితా ఇలా ఉంది.
► జూలై 15న మామునూరు ఏసీపీగా నియమితులైన సి.సతీష్.. దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఇది కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన వారు కూడా ఉన్నారు.
► ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జరిగిన బదిలీల్లో పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు.
► 2014 ఎన్నికల్లో పని చేసిన డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు.
► గత ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్‌బీ ఏసీపీ నుంచి నర్సంపేటకు ఏసీపీగా బదిలీ అయిన పి.తిరుమల్ ఎనిమిదేళ్లు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పని చేశారు.
► ఇంతేజార్‌గంజ్ సీఐ నుంచి శాయంపేట ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయిన మల్లేశ్ ఆయన సర్వీసు కాలమంతా వరంగల్ జిల్లా, కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు. జనగామ, నర్మెటలలోనూ సీఐగా పనిచేశారు.
► సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కె.శ్రీనివాస్ ఐటీకోర్.. టాస్క్‌ఫోర్స్‌లకు మారగా.. ఎనిమిది సంవత్సరాలుగా వరంగల్ (కమిషనరేట్) జిల్లాలోనే పనిచేశారు.
► హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్, డీసీఆర్‌బీ, వెకెన్సీ రిజర్వు (వీఆర్)లలో పోస్టింగ్‌లు కొ ట్టారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐలు రవికుమార్, దేవేందర్, కె.కుమారస్వామి, ఓ.రమేష్‌లు పై పోస్టింగ్‌లలో ఉన్నారు. సుబేదారి ఎస్‌హెచ్‌ఓ షుకూరుది వరంగల్ జిల్లా.
► ధర్మసాగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమితులైన శ్రీధర్ తొమ్మిదేళ్లుగా వరంగల్ జిల్లా (పోలీస్ కమిషనరేట్)లో పని చేస్తున్నారు. హసన్‌పర్తి ఎస్‌హెచ్‌ఓగా, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన ఆయన ధర్మసాగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు.
► వరంగల్ జిల్లాలోనే తన సర్వీసు కాలమంతా పని చేసిన సీఐ సుజాతను కాజీపేట ట్రాఫిక్‌గా నియమించడం వివాదాస్పదమైంది. ఆరేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న మరో మహిళా అధికారిణి సువర్ణను కూడా రూరల్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా నియమించారు.
► ఆరేళ్లుగా జిల్లాలోనే పని చేస్తున్న రామకృష్ణ సీఐని గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఐదేళ్లుగా అర్బన్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా ఉస్మాన్ షరీప్ పనిచేస్తున్నారు.
► మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్‌ఐ ఎస్‌కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను ఆదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామి అని ఆరోపణలున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్‌ఐగా కూడా నియమించారు.
► ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్‌ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment